Monday, December 23, 2024

పోర్చుగల్ చేతిలో స్విట్జర్లాండ్ చిత్తు..

- Advertisement -
- Advertisement -

దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో భాగంగా స్విట్జర్లాండ్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ అదరగొట్టింది. గొంకాలో రామోస్ హ్యాట్రిక్ గోల్స్ సాధించడంతో ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ 6-1 తేడాతో స్విట్జర్లాండ్‌ను చిత్తుగా ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో లేకుండానే బరిలోకి దిగింది. అయితే రమోస్ అసాధారణ ఆటను కనబరచతో పోర్చుగల్ భారీ తేడాతో విజయం సాధించింది. మరోవైపు స్విట్జర్లాండ్ బంతిని ఎక్కువ సేపు తమ నియంత్రణలోనే పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇక పోర్చుగల్ ఈ మ్యాచ్‌లో అసాధారణ ఆటను కనబరిచింది. 17వ నిమిషంలో ఫెలిక్స్ నుంచి పాస్‌ను అందుకున్న రామోస్ దాన్ని గోల్‌గా మలిచాడు.

దీంతో పోర్చుగల్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత మరింత దూకుడును ప్రదర్శించింది. 33వ నిమిషంలో కెప్టెన్ పీప్ తలతో కళ్లు చెదిరే గోల్‌ను సాధించాడు. దీంతో ప్రథమార్ధం ముగిసే సమయానికి పోర్చుగల్ 2-0తో నిలిచింది. ఇక రెండో అర్ధభాగంలో పోర్చుగల్ మరింత చెలరేగి ఆడింది. 51వ నిమిషంలో రామోస్ తన రెండో గోల్‌ను నమోదు చేశాడు. ఆ వెంటనే రాఫెల్ గెరీరో పోర్చుగల్ తరఫున నాలుగో గోల్ నమోదు చేశాడు. మరోవైపు 58వ నిమిషంలో స్విట్జర్లాండ్ ఆటగాడు ఆకంజీ గోల్ సాధించాడు. కానీ 67వ నిమిషంలో రామోస్ తన మూడో గోల్‌ను నమోదు చేశాడు. ఇక ఇంజ్యూరీ సమయంలో రాఫెల్ రియో మరో గోల్ సాధించాడు. దీంతో 6-1 తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. కాగా, ఈ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ ప్రత్యర్థి టీమ్ కంటే ఎక్కువ పాస్‌లు అందుకున్నప్పటికీ దాన్ని గోల్స్‌గా మలచడంలో విఫలమైంది. దీంతో స్విస్ టీమ్‌కు ఘోర పరాజయం తప్పలేదు.

తొలి హ్యాట్రిక్ నమోదు
ఇక ఖతర్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. స్విట్జర్లాండ్‌తో జరిగిన చివరి ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోర్చుగల్ యువ సంచలనం గొంకాలో రామోస్ హ్యాట్రిక్‌తో అదరగొట్టాడు. 17, 51, 67 నిమిషాల్లో రామోస్ మూడు గోల్స్ నమోదు చేశాడు. రామోస్‌కు ఇదే తొలి ప్రపంచకప్ కావడం విశేషం. ఆడిన మొదటి విశ్వకప్‌లోనే రామోస్ హ్యాట్రిక్ సాధించి సంచలనం సృష్టించాడు. కిందటి వరల్డ్‌కప్‌లో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కూడా హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. ఈసారి రామోస్ అతని సరసన నిలిచాడు.

FIFA: Portugal beat Switzerland by 6-1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News