ఫిఫా వరల్డ్‌కప్ 2022.. బోణీ కొట్టిన ఈక్వెడార్
ఆతిథ్య ఖతార్‌పై 2-0తో గెలుపు
ఖతార్: ఎడారి దేశం ఖతార్‌లో ఫిఫా ప్రపంచకప్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. లేజర్ లైటింగ్ షోలు, సంప్రదాయ అరబిక్ సంగీతంతోపాటు పాశ్చాత్య సంగీత కార్యక్రమాలతో అల్‌బెత్ స్టేడియం మార్మోగిపోయింది.కొరియన్ బిటిఎస్‌కు చెందిన జంగ్‌కూక్ ప్రారంభోత్సవంలో నృత్య కార్యక్రమంతో ఆహూతులను అలరించాడు. ఖతార్ గాయకుడు అల్ కుబైసితో కలిసి టోర్నీ గీతాన్ని ఆలపించాడు. హాలీవుడ్ లెజెండ్ మోర్గాన్ ఫ్రీమన్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. హాలీవుడ్ స్టార్ మోర్గాన్ ఆశ, ఐక్యత, సహనంతో కూడిన సందేశంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తొలుత ఫ్రాన్స్ లెజెండ్ మార్సెల్ అభిమానుల సమక్షంలో ప్రపంచకప్ ట్రోఫీని అందజేశాడు.
కాగా ఫిఫా వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ తలపడ్డాయి. స్టేడియం వేదికగా జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో ఈక్వెడార్ కెప్టెన్ ఎన్నర్ వాలెన్సియా గోల్స్ చేసినా తొలి గోల్ ఫౌల్‌గా రద్దు చేశారు. గ్రూప్ ఎ మ్యాచ్ మొదలైన మూడు నిమిషాల్లోనే ఎన్నర్ గోల్ చేసి ఆధిక్యంలో నిలిపాడు. అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. విఎఆర్ కారణంగా గోల్ రద్దయినా ఎన్నర్ మరో రెండు గోల్స్‌ను చేయడంతో ప్రథమార్థంలో ఈక్వెడార్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. 16వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మలిచిన ఎన్నర్ 31వ నిమిషంలో మరో గోల్ చేశాడు. ద్వితియార్థంలో మ్యాచ్ ముగిసేసరికి ఇరుజట్లు గోల్ చేయకపోవడంతో ఈక్వెడార్ 2-0తో గెలుపొందింది.
FIFA World Cup: Ecuador lead 2-0 against Qatar