Sunday, January 19, 2025

మెగా సంగ్రామానికి సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

మెగా సంగ్రామానికి సర్వం సిద్ధం
నేటి నుంచి ఫుట్‌బాల్ ప్రపంచకప్
తొలి మ్యాచ్‌లో ఖతార్‌తో ఈక్వెడార్ ఢీ
ఖతార్: ప్రపంచంలోనే అత్యంత జనాదారణ క్రీడగా పేరున్న ఫుట్‌బాల్ మెగా సంగ్రామానికి ఆదివారం తెరలేవనుంది. ఏడారి దేశం దోహా ఖతార్ వేదికగా ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగనుంది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఖతార్‌లోని 8 వేదికల్లో ఈ పోటీలు జరుగనున్నాయి. ఇందులో మొత్తం 32 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. టోర్నీలో మొత్తం 64 మ్యాచ్‌లు జరుగుతాయి. డిసెంబర్ 18న జరిగే ఫైనల్‌తో మెగా టోర్నీకి తెరపడుతోంది. ఐదు సార్లు ఛాంపియన్ బ్రెజిల్‌తో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్, మాజీ విజేతలు ఇంగ్లండ్, అర్జెంటీనా, జర్మనీ, స్పెయిన్, ఉరుగ్వేలు టోర్నీలో ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి.

ఎప్పటిలాగే ఈసారి కూడా అందరి కళ్లు బ్రెజిల్, జర్మనీ,స్పెయిన్, అర్జెంటీనా, క్రొయేషియా, పోర్చుగల్, పోలండ్ తదితర జట్లపై నిలిచాయి. కిందటిసారి రన్నరప్‌తో సరిపెట్టుకున్న క్రొయేషియా ఈసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. బ్రెజిల్ కూడా మరోసారి టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది. స్పెయిన్, అర్జెంటీనాలు కూడా ట్రోఫీపై కన్నేశాయి. జర్మనీ కూడా టైటిల్ సాధించడమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. ఈసారి కూడా దక్షిణ అమెరికా, యూరప్ దేశాల జట్ల మధ్యే టైటిల్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. అమెరికాకు చెందిన బ్రెజిల్, అర్జెంటీనా, మెక్సికో, ఉరుగ్వే, ఈక్వెడార్ జట్లు టైటిల్ సాధించాలనే లక్షంతో ఉన్నాయి. మరోవైపు యూరప్‌కు చెందిన ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఇంగ్లండ్, జర్మనీ, క్రొయేషియా, బెల్జియం, పోర్చుగల్, డెన్మార్క్, పోలండ్ జట్లు కూడా భారీ ఆశలతో బరిలోకి దిగుతున్నాయి.

ఇక ఆసియాకు చెందిన ఖతార్, సౌది అరేబియా, దక్షిణ కొరియా, జపాన్, ఇరాన్ జట్లు ఒకటి రెండు సంచలన విజయాలు సాధించాలని తహతహలాడుతున్నాయి. ఆఫ్రికాకు చెందిన కామెరూన్, ఘనా, మొరాకో తదితర జట్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

32 జట్లు, 8 గ్రూపులు
ఇక మెగా టోర్నీలో మొత్తం 32 జట్లు పోటీ పడుతున్నాయి. జట్లను 8 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో నాలుగేసి జట్లకు చోటు కల్పించారు. గ్రూప్‌ఎలో ఖతార్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్, గ్రూప్‌బిలో ఇంగ్లండ్, ఇరాన్, యుఎస్‌ఎ, వేల్స్, గ్రూప్‌సిలో అర్జెంటీనా, సౌది అరేబియా, మెక్సికో, పోలండ్, గ్రూప్‌డిలో ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ట్యూనీషియా, గ్రూప్‌ఇలో స్పెయిన్, కొస్టారికా, జర్మనీ, జపాన్, ఎఫ్‌లో బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా, జిలో బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్, గ్రూప్‌హెచ్‌లో పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, దక్షిణ కొరియా జట్లకు చోటు లభించింది.

8 వేదికల్లో పోటీలు
మరోవైపు ఈసారి వరల్డ్‌కప్ పోటీలు 8 స్టేడియాల్లో జరుగనున్నాయి. అల్‌బైత్ స్టేడియం, ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం, అల్ తుమామా స్టేడియం, అహ్మద్ బిన్ అలీ స్టేడియం, లుసెల్ స్టేడియం, స్టేడియం 974, ఎడ్యూకేషన్ సిటీ స్టేడియం, అల్ జనూబ్ స్టేడియం వేదికగా ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలు జరుగుతాయి.

ఎక్కడ చూసిన సందడే..
మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఖతార్‌లో ఎక్కడ చూసిన సందడి వాతావరణం కనిపిస్తోంది. ఫుట్‌బాల్ మ్యాచ్‌లను తిలకించేందుకు ఇప్పటికే వేలాది మంది అభిమానులు ఖతార్ చేసుకున్నారు. బ్రెజిల్, ఇంగ్లండ్, అర్జెంటీనా, స్పెయిన్, పోర్చుగల్, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు ఖతార్‌కు చేరుకున్నారు. వీరి రాకతో ఏ నగరంలో చూసిన పండగ వాతావరణమే కనిపిస్తోంది. మరోవైపు ఖతార్ ప్రభుత్వం ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు భారీ మొత్తంలో వ్యయాన్ని వెచ్చించింది. అత్యాధునిక ప్రమాణాలతో కూడిన స్టేడియాలను సిద్ధం చేసింది. అంతేగాక టోర్నమెంట్ సజావుగా సాగేందుకు కనివిని ఎరుగని రీతిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.

FIFA World Cup: Qatar vs Ecuador Match Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News