Monday, January 20, 2025

నేడు ఐదోదశ పోలింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మొత్తం 543 నియోజకవర్గాల్లో 379 నియోజకవర్గాలకు నాలుగు దశల్లో పోలింగ్ పూర్తయిం ది. ఐదోదశ పోలింగ్ సోమవారం 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజక వర్గాల్లో జరగనుంది. మొత్తం ఓటర్లు 8.95 కోట్ల మం దిలో 4.26 కోట్ల మంది మహిళలు, 5109 మంది  థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 94, 732పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కాగా, 9.47 లక్షల పోలింగ్ అధికారులు నియామకమయ్యారు. మొత్తం 49 నియోజకవర్గాల్లో మహారాష్ట్రలో 13, ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమబెంగాల్‌లో 7, బీహార్‌లో 5,ఝార్ఖండ్‌లో 3, ఒడిశాలో 5, జమ్ముకశ్మీర్‌లో 1, లడ్డాఖ్‌లో 1 వంతున ఉన్నాయి. పలువురు ప్రముఖులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పీయూష్ గోయల్, ఉజ్జల్ నికాం, కరణ్‌భూషణ్ సింగ్, ఎల్‌జెపి చీఫ్ చిరాగ్ పాశ్వాన్, జెకెఎన్‌సి చీఫ్ ఒమర్ అబ్దుల్లా, ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణీ ఆచార్య, సాధ్వీ నిరంజన్ జ్యోతి, సంతన్ ఠాకూర్, శివసేన శ్రీకాంత్ షిండే, తదితరులు ఐదో దశలో ఉన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నో లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై సమాజ్ వాది పార్టీ అభ్యర్థి రవిదాస్‌మల్హోత్రా పోటీకి దిగారు. మంత్రిగా పనిచేసిన మల్హోత్రా ప్రస్తుతం లక్నో సెంట్రల్ అసెంబ్లీ స్థానం ఎమ్‌ఎల్‌ఎగా ఉన్నారు.

కీలకమైన స్థానాల్లో రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పోటీగా బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ రంగంలో ఉన్నారు. అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మతో ఎస్‌పి రవిదాస్ మెహ్రోత్రా పోటీ పడుతున్నారు. ముంబై నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థి పీయూష్ గోయల్ కు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి భూషణ్ పాటిల్ బరిలో ఉన్నారు. ముంబై నార్త్ సెంట్రల్ నుంచి బీజేపీ అభ్యర్థి ఉజ్వల్ నికాంతో కాంగ్రెస్ అభ్యర్థి వర్షాగైక్వాడ్ పోటీ పడుతున్నారు. కైసర్‌గంజ్ నుంచి బీజేపీ అభ్యర్థి కరణ్ భూషణ్ సింగ్, ఎస్‌పి అభ్యర్థి రామ్‌భగత్ మిశ్రా పోటీ పడుతున్నారు. హాజిపూర్ నుంచి ఎల్‌జెపి అభ్యర్థి చిరాగ్ పాశ్వాన్‌తో ఆర్‌జెడి అభ్యర్థి చంద్రరామ్ ఢీకొంటున్నారు. శరణ్ నుంచి ఆర్‌జెడి అభ్యర్థి లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణీ ఆచార్య, బీజేపీ అభ్యర్థి బి రాజీవ్ ప్రతాప్ రూడీ పోటీ పడుతున్నారు. బారాముల్లా నియోజకవర్గంలో ఎన్‌సి అభ్యర్థిగా ఒమర్ అబ్దుల్లాతో పీపుల్స్ కాన్ఫరెన్స్ అభ్యర్థి సజాద్‌లోనీ పిడిపి అభ్యర్థిగా మీర్ మొహమ్మద్ ఫయాజ్ పోటీ పడుతున్నారు. బారాముల్లా నియోజకవర్గంలో 17.37 లక్షల ఓటర్లలో 500 మంది కన్నా ఎక్కువ సంఖ్యలో శతాధిక వయోవృద్ధులు ఉండడం విశేషం.

ఏప్రిల్ 19న జరిగిన మొదటి దశ పోలింగ్ 21 రాష్ట్రాల్లో 102 నియోజకవర్గాల్లో జరిగింది. ఏప్రిల్ 26న 13 రాష్ట్రాలకు సంబంధించి 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. మే 7న మూడోదశలో 12 రాష్ట్రాల 94 స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 13న నాలుగో దశలో 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు పోలింగ్ జరిగింది.
ఒడిశా లోని 35 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్
ఒడిశా లోని 35 అసెంబ్లీ నియోజక వర్గాలకు కూడా సోమవారం పోలింగ్ జరగనుంది. ఒడిశా అభ్యర్ధుల్లో బీజేడీ అధ్యక్షుడు , ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రంగంలో ఉన్నారు.
లక్నోలో అసెంబ్లీ ఉప ఎన్నిక
లక్నో తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News