బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ బాలకృష్ణ
మన తెలంగాణ / హైదరాబాద్: 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఛైర్మన్ నందమూరి ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ జాతీయ జెండాను ఎగుర వేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో నెలకొన్న పలు జాడ్యాలైన అవినీతి, యువతను పీడిస్తున్న మాదక ద్రవ్యాలు, అలసత్వం లాంటి వాటిపై పోరాడాలని పిలుపునిచ్చారు. భారత దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని ఎందరో మహానుభావులు, విప్లవకార్లు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని వారు చేసిన త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వేచ్చావాయువులు లభించాయని అన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజులలో తిండి గింజలకు ఇబ్బంది పడే రోజు నుండి నేడు చంద్రునిపై స్వయంగా కాలూనే స్థాయికి భారత దేశం ఎదిగిందన్నారు.దేశానికి ఎందరో మహనీయులు సేవలు అందించారని వారిలో ఒకరైన తన నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ సంస్థ గత 23 సంవత్సరములుగా ఎందరో పేద క్యాన్సర్ రోగులకు నిరంతరాయంగా సేవలు అందిస్తోందని అన్నారు. భవిష్యత్తులోనూ ఈ పంథాలో కొనసాగడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం క్యాన్సర్ పై పోరాడుతున్న చిన్నారులు, వైద్యులతో కలసి మూడు రంగులలో ఉన్న బెలూన్లను గాలిలో ఎగుర వేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు, పేషెంట్లకు మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సీఇవో టిఎస్.రావు ,అసోసియేట్ డైరక్టర్ డా. కల్పనా రఘునాథ్, తదితరులు పాల్గొన్నారు.