మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగాన్ని విదేశీ కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా దేశభక్తియుత పౌరులంతా రైతాంగానికి అండగా నిలవాలని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు పిలువు నిచ్చారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యన్ని, లౌకికతత్వన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నాయకులు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) జాతీయ కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ ఆర్‌టిసి క్రాస్ రోడ్స్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు మూడ్ శోభన్ అధ్యక్షతన జరిగిన సభలో వెంకట్ మాట్లాడుతూ భారత వ్యవసాయ రంగాన్ని, సమైఖ్యతను, సమగ్రతను, రాజ్యాంగాన్ని, జాతీయోద్యమ వారసత్వాన్ని కొనసాగించడానికి ప్రతిజ్ఞా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
దేశ సంపద అంత కార్పొరేట్‌కు వెలుతోందని అన్నారు. కార్పొరేట్లను తరమికోట్టాలని, సంపదను పేదలకు పంచాలని అన్నారు. మోడికి అధికార కాంక్ష, దేశ సంపదను ఎలా దోచుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఉత్పత్తిని సృష్టిస్తున్న 70 శాతం రైతాంగ జీవితం అల్లాకల్లోలం అవుతుందని అన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాడానికి ప్రణాళికే లేదని అన్నారు. రైతాంగానికి ఇచ్చిన హామీల గురించి ప్రస్తావన లేదని అన్నారు. రైతుల కంటే వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు దేశంలో పెరిగిపోయాయని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో కొనుగోలు శక్తి పడిపోయిందని అన్నారు. ఉపాధి పడిపోయిందని అన్నారు. మహిళలు, పిల్లులు రక్తహినతతో భాదపడుతున్నారని అన్నారు. వారికి తిండి పెట్టే ఆలోచన మన ప్రభుత్వాలు చేయడంలేదని అన్నారు.
ఈ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యన్ని, లౌకికతత్వన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్లు టి. సాగర్, ప్రసాదన్నలు మాట్లాడుతూ.. కనీస మద్దతు ధరల చట్టం చేస్తానని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరిస్తామని, రైతులపై అక్రమంగా మోపిన కేసులను ఎత్తివేస్తామని, పంటల బీమా పథకాన్ని సవరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ హామీలను పక్కన పెట్టి కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టేందుకు పూనుకుంటున్నదన్నారు. పంటల కొనుగోలు బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంటున్నదని, కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేయడానికి సిద్ధంగా లేదన్నారు. ప్రజా పోరాటాలపై తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తున్నదన్నారు. వ్యవసాయ రంగాన్ని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా దేశభక్తియుత పౌరులంతా రైతాంగానికి అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, ప్రొఫెసర్ అరిబండి ప్రసాద రావు, బోంతల చంద్రారెడ్డి, ఆర్ వెంకట్రాములు, బొప్పని పద్మ, కిషొర్, రఘు తదితరులు పాల్గొన్నారు.