హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సిఎ) మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఉచిత పాస్‌ల విషయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, హెచ్‌సిఎ మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఉచిత పాస్‌ల కోసం హెచ్‌సిఎ తమని వేధిస్తుందని.. సన్‌రైజర్స్ ఆరోపణలు చేసింది. ఇలాగే కొనసాగితే.. హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని బెదిరించింది. కోరినన్ని పాస్‌లు ఇవ్వనందుకు ఓ ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్స్‌లకు తాళాలు వేసిందని సన్‌రైజర్స్ వెల్లడించింది. అంతేకాక.. హెచ్‌సిఎ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. సన్‌రైజర్స్ లేఖను విడుదల చేసింది.
‘పన్నెండేళ్లు హెచ్‌సిఎతో కలిసి ఉన్నాం. కానీ, గత రెండు సీజన్లుగా వేధింపులు ఎదురవుతున్నాయి. ఒప్పందం ప్రకారం 10 శాతం(3900) కాంప్లిమెంటరీ టికెట్లు ఇస్తున్నాం. 50 సీట్ల కెపాసిటీ ఉన్న ఎఫ్12ఎ కార్పొరేట్ బాక్స్ కూడా అందులో భాగమే. అయితే ఈ ఏడాది దాని కెపాసిటీ 30 అని చెప్పి.. మరో 20 టికెట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. అదనపు టికెట్లు ఇస్తేనే తెరుస్తామంటూ.. గత మ్యాచ్‌లో ఎఫ్-3 బాక్సుకు తాళం వేశారు. మేం స్టేడియంకి అద్దె చెల్లిస్తున్నాం.. ఐపిఎల్ సమయంలో స్టేడియం మా నియంత్రణలో ఉంటుంది. మ్యాచ్ ముందు ఇలా బెదిరించడం కరెక్ట్ కాదు. ఇలాంటి బెదిరింపులు రావడం మొదటిసారి కాదు. గత రెండేళ్లలో హెచ్‌సిఎ సిబ్బంది ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ఈ ఏడాది హెచ్‌సిఎ అధ్యక్షుడు కూడా పలుమార్లు బెదిరించారు. వీళ్ల ప్రవర్తన చూస్తే.. సన్‌రైజర్స్ జట్టు ఆడటం ఇష్టం లేనట్లు ఉంది. అదే నిజమైతే.. బిసిసిఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యంతో మాట్లాడి.. మరో వేదికకు మారిపోతాం’’ అని సన్‌రైజర్స్ జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) లేఖలో పేర్కొన్నారు.