Friday, December 27, 2024

మాటల మంటలు

- Advertisement -
- Advertisement -

రైతులను అవమానిస్తే బిజెపిని గద్దె దింపుతాం: మంత్రి హరీశ్‌రావు

ధాన్య సేకరణపై సిఎం ద్వారా దమ్కీలు ఇస్తున్నారు: పీయూష్ గోయల్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటికే తీవ్రమైన ఘర్షణకు దారితీసిన యాసంగి వరి ధాన్య సేకరణ సమస్యపై రాజ్యసభలో కేంద్ర పీయూష్ గోయల్‌కు టిఆర్‌ఎస్ సభ్యులకు మధ్య తీవ్రమైన మాటల యుద్ధం సాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యుల ప్రశ్నలకు కేంద్ర సమాధానమిచ్చారు. ఎఫ్‌సిఐతో రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఉప్పుడు బియ్యాన్ని కొంటామన్నారు. ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఎఫ్‌సిఐకి రాసిచ్చాయని వెల్లడించారు. పంజాబ్ బియ్యాన్ని దేశమంతటా తింటారని, అటువంటి బియ్యమే ఇవ్వాలని కోరామని చెప్పారు. రైతులను తప్పుదోవ పట్టించేలా తెలంగాణ వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి ద్వారా దమ్కీలు ఇస్తున్నారని ఆరోపించారు. ఇందుకు టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధాన్య సేకరణపై మరోసారి రైతులను మోసం చేస్తోందన్నారు. అసలు తెలంగాణ నుంచి కేంద్రం ఎంత బియ్యం కొంటుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కేంద్రం వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్ర రైతులను అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

రైతులకు కేంద్రమంత్రి గోయల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగాన్ని అడుగడుగునా అవమాన పర్చడం కేంద్ర మంత్రికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ‘బిడ్డా! పీయూష్.. నూకలు తినమని చెప్తవా? అటుకులు, అన్నమో తిని తెలంగాణను సాధించుకున్నాం. అలాగే అవసరమైతే నూకలు తినైనా బిజెపిని గద్దె దించుతాం’ అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరి రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

Fight between TRS and BJP over Farmers

పెద్దల సభలో ధాన్యం దంగల్

కేంద్ర మంత్రి గోయల్, ఎంపి కెకెల మధ్య మాటల యుద్ధం
యాసంగి ధాన్యం కొనుగోలుకు టిఆర్‌ఎస్ ఎంపిల పట్టు
ససమేరా అన్న కేంద్రం… తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు అం శంపై మరోసారి రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభలో టిఆర్‌ఎస్ పక్ష నాయకుడు కె.కేశవరావుల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం నడిచింది. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని టిఆర్‌ఎస్ ఎంపిలు పట్టుబట్టగా… కేంద్రం మాత్రం ససేమిరా? అని భీష్మించింది. దీంతో కేంద్రపై టిఆర్‌ఎస్ ఎంపీలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా కొద్దిసేపు సభలో ఇరు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
శుక్రవారం రాజ్యసభ జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సమాధానమిస్తూ….ఉప్పుడు బియ్యా న్ని ఒప్పందం మేరకే కొంటామన్నారు. ఎఫ్‌సిఐతో రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందం ప్రకారమే బియ్యం కొనుగోలు చేస్తామన్నారు. ఉప్పుడు బియ్యాన్ని ఇవ్వమని రాష్ట్రాలు రాసిచ్చాయన్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉందన్నారు. ఈ విషయాన్ని తాము (కేంద్రం) పదే పదే స్పష్టం చేస్తూన్నా.. తెలంగాణ నేతలు మెండిగా వాదిస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో సిఎంల ద్వారా కొందరు తనను బెదిరించే (ధమ్కీ) ప్రయత్నం కూడా చేశారన్నారు.
కేంద్ర మంత్రి పీయూష్ ఇచ్చిన సమాధానంపై కేశవరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణపై కేంద్రం మరోసారి రైతులను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. అసలు తెలంగాణ నుంచి కేంద్రం ఎంత బియ్యాన్ని కొంటుందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ పలుమార్లు కేంద్రాన్ని అడిగిన విషయాన్ని ఈ సందర్భంగా కేవశరావు గుర్తు చేశారు. దీనిపై సూటిగా సమాధానం చెప్పకుండా కేంద్రం రోజుకొక మాటమారుస్తూ అనవసరంగా మెలికలు పెడుతోందని విమర్శించారు. ఇది ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇదేనా రైతుల పట్ల కేంద్రానికి ఉన్న బాధ్యత అని నిలదీశారు. కేంద్రం మొదటి నుంచి తెలంగాణ పట్ల చూన్న చూపుతోనే వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలోని రైతులకు న్యాయం చేయాలని తాము ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసి నా.. దురదృష్టవ శాత్తు అది కేంద్రం చెవులకు ఎక్కడం లేదని ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బియ్యం కొనుగోలు విషయంలో కేంద్రం వద్ద స్పష్టమైన విధానం ఉందా? లేదా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని కెకె అన్నారు. రాష్ట్రానికో తీరు ఉంటుందా? అని నిలదీశారు. పంజాబ్‌ను ఒకలా.. తెలంగాణను మరోలా ఎందుకు చూస్తున్నారని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో లేదా? అని కెకె ప్రశ్నించారు. డీసెంట్రలైజ్‌డ్ ప్రొక్యూర్‌మెంట్ (డిసిపి) విధానంలో ధాన్యం సేకరిస్తున్న రాష్ట్రాల నుంచి కేంద్రం ధాన్యం కొంటుందా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు. డిసిపి విధానంలో రాష్ట్రమేనేరుగా ధాన్యం కొని మిల్లింగ్ తర్వాత ఎఫ్‌సిఐకి ఇస్తుందన్నారు. కానీ ధాన్యం కొనుగోలు సమయంలో జూన్ నెలలోనే రాష్ట్రం డబ్బులు చెల్లిస్తోందని… కేంద్రం మాత్రం ఆగస్టులో ఆ మొత్తాన్ని ఇస్తుందన్నారు. తమ వద్ద నుంచి ఎంత మొత్తంలో బియాన్ని కొనుగోలు చేస్తారో కేంద్రం స్పష్టంగా చెప్పాలని ఆయన గట్టిగా అడిగారు. కేంద్ర ఆహార శాఖ తన లేఖల్లో గానీ…. ఒప్పందాల్లో గానీ వరి గురించి చెప్పిందే తప్ప బియ్యం అన్న పదాన్ని వాడలేదన్నారు. తెలంగాణలో భిన్న వెరైటీ ధాన్యం ఉంటుందని, ఒడిశాలో మరో రకంగా ఉంటుందని ఆయన అన్నారు. ఆ వెరైటీలతోనే బాయిల్డ్ రైస్ తయారు అవుతుందని కేశవరావు అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కేంద్రం వద్ద ఏ కోశానా కనిపించడం లేదన్నారు. కాగా కేంద్రం తీరును నిరసిస్తూ టిఆర్‌ఎస్ ఎంపీలు సభ నుంచి వెళ్లిపోయారు.

పాత అబద్ధాలే వల్లె వేశారు

ఇక్కడి భౌగోళిక పరిస్థితికి అనుగుణంగా బాయిల్డ్ రైసే పండుతాయి, కేంద్రం నష్టాన్ని భరించలేదా? : మంత్రి నిరంజన్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: దాన్యం కొనుగోళ్ల బాధ్యతను వదిలేసి రాష్ట్రాలే కొనుగోలు చేసుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తెయడం రాజ్యాంగ విరుద్ధం అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.శుక్రవారం రాజ్యసభలో కేంద్ర మంత్రి గోయల్ చేసిన వ్యాఖ్యలపై నిరంజన్‌రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. ధాన్యం కొనుగోళ్లపై గోయల్ పాత అబద్దాలే వల్లవేశాడన్నారు. సభ సాక్షిగా కొందరు ముఖ్యమంత్రులు బెదిరించారని చెప్పడం అప్రజాస్వామికం అన్నారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్న పీయూష్‌కు పదవిలో ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు.కేంద్రం రాసుకున్న ఫార్మాట్‌లో రాష్ట్రాల నుండి బలవంతంగా లేఖలు తీసుకుని బాయిల్డ్ రైస్ ఇవ్వమని లేఖ ఇచ్చారనడం దుర్మా ర్గం అన్నారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ కు అనుకూలంగా ఉన్న ధాన్యం మాత్రమే తెలంగాణలో పండుతాయన్నారు. ఇది ఈ ప్రాంతానికి మాత్రమే ఉన్న ప్రత్యేక పరిస్థితి అని, రా రైస్ చేస్తే వచ్చే నష్టాన్ని కేంద్రం ఎందుకు భరించదని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలకూ ఒకే గైడ్ లైన్స్ అని పీయూష్ గోయల్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని రాష్ట్రాలకు ఒకే నిబంధన అనడం సరికాదన్నారు.

రైతులను అవమానపరిస్తే ఊరుకోం
పీయూష్ వెంటనే క్షమాపణ చెప్పాలి: హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రైతులను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై రాష్ట్ర ఆర్ధిక శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్ర రైతులను అవమానిస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వెంటనే రైతులకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులను, రైతాంగాన్ని అడుగడుగునా అవమానపరచడం కేంద్రమంత్రికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఆయన చేసిన అహాంకారపూరిత వ్యాఖ్యలపై తెలంగాణ రైతులు తగు రీతిలో బుద్దిచెబుతారన్నారు. బిడ్డా! పీయూష్…నూకలు తినమని చెప్తావా, అటుకులో, అన్నమో తిని తెలంగాణ సాధించుకున్నామన్నారు. అవసరమైతే నూకలు తినైనా…కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చాలా ఘాటుగా మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో రాష్ట్ర రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పార్లమెంట్‌లో మరోసారి తెలంగాణ రైతాంగాన్ని అవమానపరిచేలా గోయల్ మాట్లాడారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని నాలుగు మాటలు అంటే పడుతాం…. కానీ తెలంగాణ రైతాంగాన్ని, ప్రజల్ని అవమానపరిస్తే సహించేది లేదన్నారు. ఈ విషయంపై సిఎం కెసిఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారన్నారు. అయినప్పటికీ గోయల్‌కు అహంకారింపులు, వక్రీకరణలను మానుకోవడం లేదని మండిపడ్డారు. దేశం మొత్తం ఒకేరకమైన పరిస్థితులు ఉండవన్నారు. కేంద్రం ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం తగదని మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ తరహా వాతావరణం తెలంగాణలో ఉండదన్నారు. పంజాబ్‌లో విత్తన ధాన్యాలు పండిచడం సాధ్యమా? ఒక్కడ ఒక పంట గోధుమాలు వేస్తారన్నారు. ఇక్కడ అలా వేయటానికి లేదన్నారు. అందువల్ల రా రైస్ ఇవ్వాలని మెలిక పెట్టడమేంటి? అని నిలదీశారు. సబ్ కా సాత్…. సబ్ కా వికాస్‌లో తెలంగాణ రాష్ట్రం లేదా? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. మాకు ధమ్కీలు ఇవ్వడం రాదని, ఐటి, ఇడి దాడులతో ధమ్కీలు ఇస్తుంది మోడీ సర్కారేనని మండిపడ్డారు. ధమ్కీలు ఇవ్వడమే బిజెపి సంస్కృతి అని హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు డీజిల్, పెట్రోల్ ధరలు దించుడుఎన్నికల తర్వాత ధరలు పెంచుడు ఇది మీ విధానమన్నారు. తెలంగాణ ప్రజలు ఏదైనా సహిస్తారు… కానీ అవమానాన్ని సహించరన్నారు.
రైతులకు క్షమాపణ చెప్పాల్సిందే
తెలంగాణను పంజాబ్‌తో ముడిపెట్టకుండా రైతులు పండించిన ధాన్యాన్ని అంతా కేంద్రం సేకరించాలన్నారు. బాయిల్డ్ రైస్ ఇస్తామంటే రా రైస్ మాత్రమే ఇవ్వాలని మెలిక పెట్టడమేంటి? అని ప్రశ్నించారు. ఈ సమస్యను కేంద్రం పరిష్కరించకుండా రైతుల స్థాయిని తగ్గించే విధంగా కేంద్ర మంత్రి మాట్లాడడం శోఛనీయమన్నారు. అందువల్ల ఆయన వెంటనే తెలంగాణ రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. డబ్ల్యూటివో ఒప్పందాలను మార్చగలిగే శక్తి రైతులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆ ఒప్పందాలను మార్చేకునే అధికారం ఒక్క కేంద్రానికే ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News