80 వేల ఉద్యోగాల కోసం ప్రభుత్వమే కోచింగ్ ఇవ్వాలని అధ్యక్షుడి డిమాండ్.
పై చదువులకు పూర్తి ఫీజు మంజూరు చేయాలి.
బీసీ సంఘాల పై బిజెపి బండి సంజయ్ విమర్శలు సరికాదు
ఈ నెల 19న రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు డబ్బున్నవాళ్ళు ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు వెళుతున్నారనీ, డబ్బు లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు ప్రభుత్వమే కోచింగ్ ఇవ్వాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. రాష్ట్రంలో ఒకే దఫాలో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ ప్రకటించిన నేపద్యంలో జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య స్పందించారు. 80 వేల ఉద్యోగాలకు దాదాపు 15 లక్షల మంది పోటీ పడతున్నారనీ, కనీసం 5 లక్షల మందికి గ్రూప్ 1,2,3,4 సర్వీస్ ఉద్యోగాలకు, పోలీస్ ఉద్యోగాలకు, టీచర్ ఉద్యోగాలకు ప్రభుత్వం కోచింగ్ ఇవ్వాలని పేర్కొన్నారు. మరో వైపు బీసీ స్టడీ సర్కిల్ తో పాటు ప్రైవేటు కోచింగ్ సెంటర్లలోను, యూనివర్సిటీలలోనూ కోచింగ్ ఇప్పించాలని కోరారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మొత్తం ఫీజులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం, బీసీలకు మంజూరు చేయకపోవడంతో ఎంతో మంది బిసి విద్యార్ధులు దిక్కు తోచక చదువు మానుకుంటున్నారన్నారు. అందుచేత ర్యాంకులు, ఇతర నిబంధనలు ఎత్తివేసి ఇంజనీరింగ్, మెడికల్, పీజీ, డిగ్రీ, ఇంటర్ కాలేజీ కోర్సులు మాత్రమే కాకుండా ఐ.ఐ.టి, ఐ.ఐ.ఎం తదితర జాతీయ స్థాయి కోర్సులు చదివే బీసీ విద్యార్థులకు ఫీజులు మంజూరు (రీఇంబర్స్ మెంట్) చేయాలని కోరారు. మన రాష్ట్రంలో బీసీ సంఘాల పోరాటం వల్ల 1200 గురుకుల పాఠశాలలు వచ్చాయనీ, ఈ స్కీమును ఏ పార్టీ, ఏ ప్రభుత్వం చేయలేదని, బి.సి సంఘాలు పోరాడి తెచ్చుకున్నారని పేర్కొన్నారు.
దేశంలో ఏ సంఘం చేయని విధంగా 12 వేలకు పైగా ఉద్యమాలు, ధర్నాలు, ర్యాలీలు బిసి సంఘాలు చేశాయని, ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ బిసి వాదాన్ని చూసి భయపడి వారికి పార్టీ అధ్యక్ష పదవులు ఇస్తోందన్నారు. ఈ వాస్తవాలు గుర్తించకుండా బండి సంజయ్ బీసీ సంఘాల పై విమర్శించడం సరికాదన్నారు. బీసీల డిమాండ్ల కోసం కేంద్ర ప్రభుత్వం పై పోరాడుతున్నామని పలువురు నాయకులు అక్కసుతో బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని, బండి సంజయ్ ఒక బీసీ నాయకుడు అవ్వడం వల్ల గౌరవిస్తున్నామని హెచ్చరించారు. బిజేపి పార్టీ ఒక తులసి వనం వంటిదని, దీనిని కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం బ్రష్టు పట్టించరాదని హితవు చెప్పారు. బిజెపి ముసుగులో బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడడం పార్టీకి చెడ్డపేరు తేవడమేనని అన్నారు. ఈ మేరకు ఈ నెల 19న విద్యానగర్ ప్రాంతంలో ఉన్న బిసి భవన్ లో రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం కార్యవర్గ సమావేశం జరపాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 33 జిల్లాల బీసీ విద్యార్థి సంఘం ముఖ్యనాయకులు హాజరవుతారు.