Thursday, December 12, 2024

తెలంగాణ తల్లి కోసం ఇంత లొల్లా!

- Advertisement -
- Advertisement -

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు సుదీర్ఘ పోరాటం చేశారన్నది, దానికి కెసిఆర్ నాయకత్వం వహించాడు అన్నది, తమ పార్టీ ఏనాడు విస్మరించలేదు అని అంటూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఇచ్చినటువంటి పార్టీగా తమకు దక్కాల్సిన గౌరవం కూడా తమకు దక్కాల్సిందే అని గట్టిగా భావించాడు. తెలంగాణ తల్లి కొత్త విగ్రహం స్థాపనకు డిసెంబర్ 9వ తేదీని ఎంచుకున్నారు. 2009 డిసెంబర్ 9న సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నారని, అందువల్లే ఆ రోజే 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ప్రతిష్టిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.ఆ రోజు కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ జన్మదినం కూడా. ఒక చేత్తో పూర్ణ కలశం, మరో చేత్తో కోతకొచ్చిన వరి పంటతో, తలపైన కిరీటంతో ఉండే తెలుగు తల్లి నిలువెత్తు విగ్రహం ఆనాటి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో చాలానే ప్రసిద్ధి పొందింది.

ఎన్నడో 1942లో దీనబంధు అనే ఒక సినిమా కోసం, శంకరంబాడి సుందరాచారి రాసిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు’ అన్న సుప్రసిద్ధ గేయం ఆనాడు ఎక్కడ చూసినా మారుమోగేది. కాగా తెలుగు తల్లి తెలంగాణ తల్లిగా రూపాంతరం చెందిన పరిణామం చాలా ప్రత్యేకం, ఆసక్తికరమైనది. తెలుగు తల్లి, తెలంగాణ ప్రజలను, వారి ప్రాంతాన్ని, భాషను, యాసను, సంస్కృతిని చిన్నచూపు చూసిన, ఆంధ్రా ప్రజల తల్లే తప్ప, తమ తల్లి కాదనే భావన ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఆందోళన క్రమంలో రూపుదిద్దుకున్న భావన. తమదైన తెలంగాణ తల్లిని తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రత్యేకత్వాన్ని ప్రతిబింబించేలా తయారు చేసుకోవడం కోసం ఆనాటి నుంచే అనేక ప్రయత్నాలు జరిగాయి. తెలంగాణ తల్లి ఎలా వుండాలి అనే అంశంపై చర్చలు, రకరకాల నమూనాల రూపకల్పనలు, కొనసాగాయి. ఇక పడిపోయాం అనుకున్న ప్రతి సందర్భంలోనూ మళ్ళీ కెరటంలా ప్రజాఉద్యమం తెలంగాణ అంతటా ఉవ్వెత్తున లేచేది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమం అపూర్వమైనది, అసాధారణమైంది, చరిత్రలో చిరకాలం నిలిచేది. ప్రజలు తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు అనే దానికి సాక్షిభూతమైనది. అయితే హస్తినాపురపు అధికార రాజకీయాలలో చేతి దాకా వచ్చిన ముద్ద అనేక మార్లు చేతి నుంచి జారిపోవడం కూడా అంతే సత్యం.

ఇక పార్లమెంట్లో ఆమోదం పొందుతుంది.తెలంగాణ వచ్చినట్టే అనుకున్న సందర్భాల్లో మళ్ళీ కథ ఎన్నోసార్లు మొదటికి వచ్చేది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం వల్ల ఆంధ్ర ప్రాంత ప్రజలకు తమ పార్టీ వ్యతిరేకమవుతుందని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు దాని ఘనతను మొత్తం ఆనాటి పోరాట పార్టీ అయిన తెరాస పొందుతుందని, ఇది రాజకీయంగా తనకి నష్టం కలుగజేసే నిర్ణయం అని తెలియని అమాయకత్వం లో ఆనాటి కాంగ్రెస్ ఏమీ లేదు. అయినప్పటికీ ఈ మూల్యాన్ని చెల్లించడానికి సిద్ధపడి మరీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆనాటి పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనుకూల నిర్ణయం తీసుకునింది. ఆ నిర్ణయం తెలంగాణ సమాజానికి ఒక గొప్ప ఊరటను, నూతన ఉత్సాహాన్ని, గొప్ప విజయాన్ని, కొత్త ఆశలను ఎన్నిటినో ఇచ్చిన మాట కూడా వాస్తవమే. ఆ తరువాత పదేళ్లపాటు పరిపాలన సాగించిన తెలంగాణ రాష్ట్ర సమితికి, ముఖ్యమంత్రి కెసిఆర్‌కి, ఆయన కుటుంబ సభ్యులకీ ఎదురు లేదు.

సుదీర్ఘ కాలపు అధికార స్వప్నాన్ని కన్న ఆయన కలలు, తమ తమ పాలనకు ఎదురులేని విశ్వసించిన ఆయన తన సుస్థిరత కోసం రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా ఉండాలని అనుకున్నాడు. నాడు ప్రతిపక్షంలో ఉన్న గెలిచిన సుమారు 20 మంది ఎంఎల్‌ఎలు ‘తెలంగాణ ఇచ్చిన పార్టీ’ నుండి ‘తెలంగాణ తెచ్చిన పార్టీ’ తరలి వెళ్లడం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తనదైన ముద్రను వేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను తీసివేసి, గుర్తులు తీసివేసి, దాదాపు వాటిలాగే ఉన్న వాటికి కొత్త పేర్లు పెట్టి, కొత్త గుర్తులు ఇచ్చి తమవిగా ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది అన్ని రంగాల్లోనూ, అన్ని చోట్ల విస్పష్టంగా కనిపించే విషయమే. చివరికి పిల్లలకు ఇచ్చే నోటు పుస్తకాల పైన, లబ్ధిదారులకు ఇచ్చే పింఛన్ పథకాల పైన గత ప్రభుత్వాల చిహ్నాలను లేకుండా చేయడం అన్ని చోట్లా ఆనవాయితీగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలు, విమానాశ్రయాలు, చివరికి వీధుల పేర్లు కూడా కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు మార్చి వేయడం మనకి కొత్త కాదు.

ఆయా విగ్రహాలు రూపొందించిన వాళ్లే ఎల్లకాలం అధికారంలో ఉండరు కాబట్టి, కొత్తవాళ్లు అధికారంలోకి వచ్చినప్పుడు కొత్త ప్రతీకల్ని సృష్టించడం కోసం ప్రయత్నిస్తారని, అవి వాటి అధికారానికి చిహ్నాలుగా ఉంటాయని కూడా మనం మొదట గుర్తించాల్సిన అవసరం ఉంటుందేమో. టిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తున్నప్పుడు కూడా ఎవరికి ఆ తల్లి ప్రాతినిధ్యం వహిస్తుంది? దళిత, బహుజనులకు ప్రాతినిధ్యం వహిస్తుందా? లేక ఆధిపత్య కులాలకు ప్రాతినిధ్యం వహిస్తుందా ఆమె అనే చర్చ కూడా చాలా తీవ్రంగానే జరిగింది. చివరికి ఆ విగ్రహం తల పైన కిరీటం, ఒంటి పైన మెరిసే నగలు, ఒక చేతిలో బతుకమ్మ, మరో చేతులో జొన్నకంకులు ఇలా మరి కొన్ని అలంకరణలతో తయారు అయినప్పుడు, దాన్ని ప్రతిష్టాపన చేసినప్పుడు తెలంగాణ సమాజపు ప్రజలే దాన్ని విమర్శించారు. ఆ తల్లి తమ సమూహాన్ని రిప్రజెంట్ చేయడం లేదని, ఆమె దొరసానిలా, ఆమె కెసిఆర్ కూతురు కవితలా వుందనీ అన్నవాళ్లు కూడాఉన్నారు.

అసెంబ్లీలో తెలంగాణ తల్లి రూపురేఖలు విగ్రహం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహాలను రాజమాతల స్ఫూర్తితో కాకుండా చాకలి ఐలమ్మ, సమ్మక్క, సారక్క స్ఫూర్తితో రూపొందించామని, తెలంగాణ తల్లి ఒక భావన మాత్రమే కాదని అది నాలుగు కోట్ల మంది భావోద్వేగమని చెబుతూ తెలంగాణ తల్లి పీఠంలో నీలిరంగు కృష్ణా, గోదావరి నదులకు సంకేతం అని అన్నారు. ఇప్పుడు తెలంగాణ తల్లికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక గుర్తింపు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏళ్ళు గడిచినా తెలంగాణ రాష్ట్ర గీతం లేదని, ఉద్యమ సమయంలో తెలంగాణ పౌర సమాజాన్ని ఒక్కతాటిపై ముందుకు నడిపించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తిస్తున్నామని ఆయన ప్రకటించారు. ఇక నుండి ఏటేటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుతాం అని కూడా ఆయన అన్నారు. ప్రస్తుతం బిఆర్‌ఎస్ పార్టీగా మారిన, ఒకప్పటి టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వాలు మారితే జనం తలరాతలు మారాలి, కానీ తల్లులు కాదు మారాల్సింది అని నిరసనను వ్యక్తం చేసింది.

తెలంగాణ తల్లి బీదరికం ఉట్టిపడుతూ వుందని, పాలకుల దివాలాకోరు, దారిద్య్రపాలనకు గుర్తుగా తెలంగాణ తల్లిని కూడా దారిద్య్రానికి ప్రతినిధిగా తయారు చేశారని విమర్శించారు. ఆంధ్ర తెలుగు తల్లి నగలతో ధగధగలాడుతూ ఉంటే తెలంగాణ తల్లిని దరిద్రంగా రూపొందించటం తెలంగాణ అస్తిత్వం పైన జరుగుతున్న దాడి అని, కుట్ర అని కూడా వాళ్ళు అన్నారు. నిజంగా తెలంగాణ సమాజంలో జరగాల్సిన చర్చ ఏమిటి? పదేళ్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో సాగిన అభివృద్ధి ఫలాలు అందరికీ అందలేదని, కుటుంబ, అవినీతి పాలన కొనసాగిందని కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. అధికారంలోకి రాగానే కాళేశ్వరం మొదలుకొని అనేక ప్రాజెక్టులలో ఉన్న అవకతవకల పైన, గత పరిపాలనలో జరిగిన అవినీతులపైన ఎంక్వైరీ కమిటీలు వేసి, శ్వేత పత్రాలను ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలమే అయింది. అది చెప్పిన ఆరు హామీలను అమలుపరచడం లేదని, రాష్ట్రం దిగజారిందని, అన్ని వర్గాల ప్రజలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారని, తీవ్ర నిర్బంధం రాష్ట్రంలో అమలవుతుందని టిఆర్‌ఎస్ పార్టీ, దాని నాయకులు కాంగ్రెస్ పాలన విమర్శిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఊకదంపుడు ఆరోపణలు, దబాయింపులు చేయడం కాకుండా, ఒక్కొక్క రంగంలో జరిగిన వైఫల్యాలు ఏమిటో నిర్దిష్టంగా పేర్కొని, ప్రజలను జాగరుకుల్ని చేయడం ఒక ప్రతిపక్షం పార్టీగా నిర్మాణాత్మక విమర్శను బిఆర్‌ఎస్ చేయాలి.

నిజానికి టిఆర్‌ఎస్ పార్టీగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఆందోళన సమయంలో ఈ పని అది ఎంతో సమర్థవంతంగా చేసింది. అలాంటి నిర్దిష్టత ఎప్పుడైనా ఆలోచనల్ని రేకెత్తించగలదు సాధారణ ప్రజలలో. నిజానికి జరగాల్సిన అసలు చర్చ తెలంగాణ సమాజంలో ఇది. కాంగ్రెస్ పార్టీ కూడా చేయాల్సింది గత 10 ఏళ్ల కెసిఆర్ పాలన ఉన్న లోపాలకు సంబంధించిన సమీక్ష. వాళ్ళు చెబుతున్న అభివృద్ధి వెనుక ఉన్న అవినీతి చీకట్ల గురించి చర్చ సమాజంలో జరగాలి. అదానీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమ్మక్కు అని టిఆర్‌ఎస్ పార్టీ అంటున్నప్పుడు, బిజెపితో టిఆర్‌ఎస్ పార్టీకి లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నప్పుడు వాటి రూపం, సారం ఏమిటో అవి దేశప్రజలకి ఏ రకపు ప్రమాదాలను కలగజేస్తున్నాయో ఆయా పార్టీలు స్పష్టంగా చెప్పగలగాలి. ఎప్పుడో రాజకీయాలలో ఈ సూటిదనం నిర్దిష్టత, స్పష్టత కనుమరుగయ్యాయి. ఈ ఆరోపణలతో ఈ పూట గడిస్తే చాలు మరో కొత్త విషయం తెరమీదకు వస్తే పాత రోతలన్నీ కనుమరుగు అయిపోతాయి అనే రాజకీయ డిప్లమసీ దే ఇప్పుడు పైచేయి అయింది.

అసలు సమస్యలు కానివి సమస్యలుగా, అసలు చర్చించాల్సిన విషయాలను అత్యంత అప్రాధాన్యతా విషయాలుగా మార్చివేయడమే నేటి రాజకీయం. భారత దేశానికి ఒక భరతమాతను ప్రతీకగా చూపడం జరుగుతున్నప్పుడు, తెలుగు భాష మాట్లాడే ప్రజల్లో ఒక తెలుగు తల్లి, తెలంగాణ తల్లి అని ఇద్దరు ఉన్నప్పుడు దేశమంతా ఆయా రాష్ట్రాల అస్తిత్వపు గుర్తులుగా మరి ఎంతమంది తల్లుల ప్రతిష్టాపన జరగాలి? అంతేనా ఈ తల్లులు ఏ వర్గాల, కులాల ప్రతినిధులుగా ఉండాలి? ఇందాక ఎందుకు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకపోవడం తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచడమే అన్నప్పుడు, తెలంగాణలో కొన్నిప్రాంతాల్లో బతుకమ్మ ఆడే అలవాటులేదని కొందరు, బతుకమ్మ ఇప్పటికీ దొరల బతుకమ్మగానే ఉందని, బహుజన బతుకమ్మగాలేదని వాడల్లోని బతుకమ్మగా లేదని మరికొందరు వాదించటం తెలుసు మనకి.

ఇన్నాళ్లు గడిచాక, జూన్ రెండవ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన జరిగిన ఆ రాత్రి గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నిలబడి ఉద్విగ్నంగా ఇక తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి అని ఆకాంక్షించిన తెలంగాణ పౌర సమాజం. తెలంగాణ తల్లి విగ్రహాల సెంటిమెంట్లనే కాక, తెలంగాణ సమాజంలో ఇంకా ఉన్న చీకట్ల గురించి మళ్లీ మళ్లీ మాట్లాడాల్సిన అవసరం ఉంది అని గుర్తిస్తారు. విగ్రహాల విషయంలో జరిగిన ప్రపంచపు అనుభవాలు, తెలంగాణ అనుభవాల నేపథ్యం లో తెలంగాణ సమాజానికి నిజానికి కావాల్సిందేమిటో ఇంత సుదీర్ఘ పోరాట చరిత్ర ఉన్న తెలంగాణ పౌర సమాజానికి తప్పకుండా తెలుసు అనే విశ్వసిద్దాం.

విమల

బహుముఖం

(రచయిత్రి సామాజిక కార్యకర్త)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News