Wednesday, November 20, 2024

చీకటి పువ్వు రెక్కలు

- Advertisement -
- Advertisement -

కత్తి పద్మ హక్కుల కార్యకర్త. మహిళా హక్కుల కోసం మహిళా చేతన సమితి సంస్థ ద్వారా తీవ్రంగా పనిచేస్తున్న కార్యకర్త. నాలుగైదు దశాబ్దాల నుండి మార్క్సిస్టు – లెనినిస్ట్ పార్టీ పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేసి ఎన్నో విలువైన జీవితానుభవాలు, ఉజ్వలమైన విలువలు, ప్రజా జీవితము, స్పష్టమైన వర్గ దృక్పథంతోపాటు స్త్రీ వాద దృష్టికోణం అలవర్చుకున్నారు. ఇంతవరకూ హక్కులకార్యకర్తలు వ్యాసాలు రాయడం వరకు ఉంది. కానీ సృజన రంగంలోకి అడుగు వేయడం అరుదు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి స్పష్టమైన చూపు ఉన్న వ్యక్తి సృజన రంగంలోకి అడుగు వేయడం చాలా మంచి సందర్భం.‘నచ్చని మనిషి నైనా, మనవునైనా, కొడుకు నైనా, నీతినైనా తిరస్కరించగలిగే ధీరుల కథల్నే నేను రాశాను‘ అని చెప్పి ఈ క్రమంలో ఆమెను ‘కదిలించి, కరిగించి, మేల్కొల్పి, ఊరడించి, నవ్వించి, ఉరకలెత్తించి, దిశా నిర్దేశం చేసిన‘ స్త్రీల ఇతివృత్తాలను ‘కలల్ని కనడం మర్చిపోతున్న పాడుకాలమొకటి దాపురించిన సమాజానికి‘ మిక్కిలి సంయమనంతో కథలుగా అందించారు పద్మ.
ఈ చీకటి పువ్వు కథా సంకలనంలో 19 కథలు ఉన్నాయి.

ఈ కథలలో రచయిత్రి సొంత వ్యాఖ్యానాలు ఉండవు. తమకున్న అనుభవాన్నుపయోగించి, తీర్పులివ్వడముండదు. ఈ కథలన్నీ ఆయావ్యక్తుల case studyలు మాత్రమే. వీటిని కథగా మార్చే క్రమంలో ఉపమానాలకు, అభూతకల్పనలకు తావివ్వలేదు. అవన్నీ కేవలం స్వభావోక్తులే. వస్తువులో చిక్కదనం ఉంటే కథ దానికదే శిల్పాన్ని తెచ్చిపెట్టుకుంటుంది. ఈ కథలలో కొత్తశిల్పం మనకు కనిపించకపోవచ్చు. కానీ సంభాషణల ప్రాధాన్యతతో అచ్చమైన ఉత్తరాంధ్ర యాసతో చదువరులను ఆకట్టుకుంటుంది.
స్త్రీలు,పురుషులు అందరూ ఈ కథలు చదివి తీరాల్సిందే. తాము ఎలా బతుకుతున్నాము, నిజంగా తాము ఏమి కోల్పోతున్నామో, తాము ఎలా ఒక అమానవీయ వ్యవస్థలో భాగమవుతున్నామో, మనల్ని మనం తడుము కోవడానికి, దాన్నుండి మనం నేర్చుకోవడానికి ఈ కథలు ఉపకరిస్తాయి. కొన్నికథలు జ్వరం తెప్పిస్తాయి. కొన్నికథలలో పాత్రలు రోజులతరబడి వెంటనడుస్తాయి. కొన్ని పాత్రలు మీరెందుకు నిటారుగా నిలబడలేక పోతున్నారని వీపు చరుస్తాయి. ఈ కథలు చదివి నిద్రపోదామంటే కుదరదు. రెండు మూడు పేజీలు చదివి ఆపేద్దామన్నా ఆగదు. కొన్ని పుస్తకాలు మనసుకు మంచి నిద్రను తెస్తాయి. కానీ ఈ పుస్తకంలో కథలు మెదడుకు తెలియని చైతన్యాన్ని తెస్తాయి. మనల్ని ఒక excitement కు గురిచేస్తాయి.

ప్రతీవారు తన కిందనున్న వ్యక్తి (కులం పరంగానో,జెండెర్ పరంగానో ) సమాజపు గీతలపరిధిలో ఉండేటపుడు చాలా చక్కగా చూసుకుంటాడు. ఆ వ్యక్తి ఒక్కసారి గీతను దాటినపుడు వారు ప్రవర్తించే విధానమే తన భావజాలం. పితృస్వామ్యసమాజంలో స్త్రీలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఆస్థిహక్కు, ఆర్థికస్వాతంత్య్రం, పెళ్లిపైతిరుగుబాటు, గృహహింసను వ్యతిరేకించడం, వ్యక్తిగత స్వేఛ్చ, సరదాలు వంటివాటిని స్త్రీలు కూడా కోరుకుంటారు. ఇవి స్వేచ్చా, స్వాతంత్య్రం వంటి సిద్దాంతాలు తెలిసిన వారే కోరుతారు అంటే అవివేకం. ఇంకితం ఉన్న ఏ స్త్రీ అయినా వీటిని అడుగుతుంది. వీటిని స్త్రీలు ఒక తాయిలంగా కాకుండా హక్కుగా కోరుకున్నపుడు సమాజం దృష్టిలో వారు చెడ్డవారుగానో, తగవులమారిగానో కనిపిస్తారు. సమాజం దృష్టిలో అలాంటి చెడ్డవారి, తగవులమారి, గయ్యాలుల కథలే ఈ చీకటిపువ్వు సంకలనం. ‘స్త్రీలుపుట్టరు – తయారు చేయబడతారు‘ అని సిమోన్ ది బొవియర్ చెప్పారంట. ఇంతకీ ఎలా తయారుచేయబడతారు అనేది విప్పిచెప్పారు పద్మ.ఎర్రమ్మ – గొర్రమ్మ కథలో 12 సంవత్సరాల వరకు కుటుంబ సభ్యుల మధ్య ఆడిందిఆటగా, పాడిందిపాటగా పెరిగిన ఎర్రమ్మ రాత్రికి రాత్రి ఆడదానిగా తయారు చేయబడిన దృశ్యం మన సమాజంలో పితృస్వామ్య భావజాలపు చిహ్నాలను వెగటు కలిగించేలా చూపింది.

పితృస్వామ్యభావజాలం పురుషాధిపత్యానికి, స్త్రీ అణచివేతకు సంబందించినప్పటికీ ఇది ముఖ్యంగా స్త్రీలచేతనే ఎక్కువగా మోయింపబడుతుంది. ‘చిన్నప్పటినుంచి ఏదడిగినా అబ్బురంగా కొనిచ్చే నాన్నలు, మావయ్యలు అడక్కుండానే మొగుడ్ని కొంటున్నారు. కాకపోతే అప్పుడంతా ఆ పిల్లకి నచ్చినవి కొనేవారు. ఇప్పుడాళ్లకు నచ్చింది కొంటున్నారు.‘ అయితే ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పిన ఎర్రమ్మను ‘కొట్టి, తన్ని, తిట్టి, కట్టడి చేసి, బంధించి, బాధించి, వేధించి, హింసించి ఒక జీవిని ఆడదానిగా మార్చవచ్చని‘ తెలుసుకొని అలా మార్చి పెళ్లి చేస్తారు. ముండలముఠాకోరు అయిన భర్త వేరే స్త్రీని ఇంటికి తీసుకొస్తే, అడగాల్సిన అత్త కూడా కొడుకు తరపున వకాల్త పుచ్చుకుంటుంది.అప్పటికే భర్త పరిస్థితికి విసిగిన ఎర్రమ్మ అత్తను బాది పిల్లలతో సహా కన్నవారి ఇంటికి వస్తుంది. పెద్దమనుషుల పంచాయతీలో విడాకులు జరిగి, కట్నం గా వచ్చిన రెండు ఎకరాల పొలాన్ని తిరిగి ఇప్పించడానికి తీర్మానం జరుగుతుంది. అయితే తిరిగి వచ్చిన భూమిని, ఎర్రమ్మ అన్నల పేరున రిజిస్టర్ చేయడానికి పెద్దమనుషులు సిద్ధపడితే, ఎర్రమ్మ రెండు వర్గాల వారిని ఎదిరించి తన పేరున రాయమంటుంది.

పెద్ద మనుషులు కొడుకుల పేరున రాస్తామని ప్రతిపాదన తెస్తే ‘అవున్రా… నా బాబుతో తన్నులు కాసాను… మొగుడు ఎదవతో తన్నించుకున్నాను. రేపు భూమిగల నా బిడ్డలతో తన్నించుకోవడం ఒకటే మిగిలింది….. నా ఒంటి మీద ఇంకెవ్వడి చేయపడ్డానికి వీల్లేదు.‘ అని ఆస్తి మాత్రమే స్త్రీలకు ధైర్యాన్నిచ్చి, ఆత్మాభిమానాన్ని కాపాడుతుందనే ఎరుకను ప్రకటిస్తుంది ఎర్రమ్మ.అలాగే ‘పులస‘కథలో కూడా ఎన్టీఆర్ ఆడోళ్ళు కూడా ఆస్తి హక్కు ఉండాలి అనే చట్టం తెచ్చాడనే విషయాన్ని తెలుసుకున్న జుత్తాడ రమణమ్మ, తన పసుపు కుంకం కింద వచ్చిన భూమిని కొడుకు మోసంతో లాక్కుంటే, దాన్ని కూతుళ్లకు ఇప్పించడానికి ఒంటరిగా ఉద్యమాన్నే చేస్తుంది. ‘బూవి తోడిదే నా బతుకు. నా బూవి నేను సాదిత్తాను. ఈ తూపు ఎమ్మా రావు గాని నా కూతుళ్ళ పేరు మీద పాసు పుత్తకాలిచ్చిందా ఇచ్చింది నేదంటే కలెట్రు కాడకెళ్తాను. నా బూవి దక్కేవరకు నానొగ్గను. నా కొడుకు సేసిన దొంగ రిజిస్ట్రీ మీద కూడా కాయితమెట్నాను కదా, అది తేల్లేదు. రూలున్నాది గాబట్టి నీనే గెలుత్తాను. ఈ ఎమ్మా రావు కాపోతే కలెట్రు వచ్చైనా బూవి నాకిత్తాడు. నా కూతుర్లు భూమిలేని అనాధముండలవ్వడానికి నానొప్పుకోను..‘అంటూ స్త్రీలకు ఆస్తి మరియు భూమిపై హక్కు ఉండాలని బలంగా చెబుతుంది ఈ కథ.

మా విశాఖపట్నం కొండ కథలో గేదల్ని, కుక్కల్ని,కాకుల్ని, ఆఖరికి పడగవిప్పిన పామును ప్రేమించి దాని బతుకు కోసం సూర్యనారాయణ మూర్తిని మొక్కిన నూకాలమ్మ పెళ్లి ద్వారా తన జీవితంలోకి వచ్చిన భర్తను మాత్రం రోజు తిట్టడం, ఇంట్లోకి రానివ్వకపోవడంలాంటి పనులు చేసి పాఠకులకు గయ్యాలిలా కనిపిస్తుంది. ‘పెళ్లి పేరుతో ఒకే వసారా కింద బతుకుతున్న శత్రువుల్లా ఉంటారిద్దరు‘ చూస్తే పెళ్లి అనే అధికారంతో భార్యలను గుంజుకుతింటున్న భర్తలు, వారిమీద సహజంగానే మనసు విరిగిపోయిన భార్యలు, సమాజం కోసం ఒక ఇంట్లో జీవించడం మనకు కనిపిస్తుంది. ఇది చాలామంది ఇళ్లల్లో జరుగుతున్న క్రతువే. అలాగే మన సమాజంలో ప్రతి గ్రామంలోనూ భర్త చనిపోయిన భార్యలు చాలామంది ఉంటారు. వాళ్లెవరు భర్త కోసం బెంగ పెట్టుకోవడమో, తనకుతోడు లేదనే బాధచెందడమో, పెద్దగా కనిపించదు. సంవత్సరాలుగా భర్త ప్రస్తావన లేకుండా ఆనందంగానే గడుపుతున్నవారు చాలామంది మనకు కనిపిస్తుంటారు. అలాగే ‘మనకీ పెళ్లిళ్లు అచ్చిరావు‘ కథలో అమ్మమ్మలు, అమ్మలు, ఇప్పుడు అమ్మాయిలు (పెద్దలు కుదిరిచినదైనా, ప్రేమ వివాహమైనా, సహజీవనమైనా) ఏ తరంలో చూసినా ‘ఆడదాన్ని పొట్టిదని, పొడుగుదనీ, కర్రిదని, కాకి లాగా ఉందని, ఇలా వంకలు పెట్టి‘ ఆళ్ల బతుకులు తీసేస్తున్న పెళ్లి వ్యవస్థను చర్చించింది. ‘సావండే! అందరూ సావండి.

పెళ్లి లేకపోతే సచ్చిపోతారా? ఇలా గేడిసి సచ్చే బదులు ఆ పెళ్ళిని సంపలేరే మీ సదుంకున్న ఆడోళ్ళందరూ కూడి‘అని అమ్మమ్మ తరం పెళ్లిపై ఒక ప్రతిఘటనను తీసుకొస్తుంది. దీన్నిబట్టి చూస్తే పెళ్లివ్యవస్థ, స్త్రీలకు ధైర్యం, నమ్మకం ఇవ్వలేకపోతుందేమో! అందుకే చాలాకాలం నుంచి పెళ్ళి వద్దనే చర్చ ఒకటి మనసమాజంలో నడుస్తుంది. పెళ్ళి వలన వచ్చే సుఖాలు, గౌరవాలు కన్నాదానిలో ఉండే హింసే ఎక్కువని కదా ఈ డిమాండ్ స్త్రీ సమాజం నుండి వస్తుంది. ఈ డిమాండ్ వెనుక ఉన్న సంఘర్షణ,వేదన,అణచివేత కోసం ఖచ్చితంగా ఆలోచించి తీరాల్సిందే.అయితే స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ఉంటే కొంత ధైర్యంగా గృహహింసను ఎదుర్కోగలదు. అంతకుముందువరకు భర్త పెట్టే బాధలు భరించిన నూకాలమ్మ గేదెల్ని పెంచడం, పాలమ్మడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధిస్తుంది. ఎప్పుడైతే ఆర్థికస్వావలంబన వచ్చి, జీవితంమీద ధైర్యం వచ్చిందో, భర్తకు ఎదురుతిరిగింది. స్త్రీకి ఆర్థిక స్వేచ్చఉంటే భర్తల ప్రవర్తనలోకూడా మార్పు ఉంటుంది అనే ఎరుకను కలిగిస్తుందీకథ. ఈ కథలలో ఇంకో నిక్సాన, నిటారైన పాత్ర మట్టగిడస కథలో సత్తెమ్మ.

తను అనుకున్నట్లుగానే జీవించింది. దిక్కులేని పక్షులైన తన మనవల్లను పెంచడానికి సారా అమ్మి జైలు పాలవుతుంది. అక్కడ ఆమె ప్రవర్తన తోటి ఖైదీలకు ధైర్యాన్ని ఇవ్వడమే కాదు, జైలు అధికారులకు కూడా గుబులు పుట్టిస్తుంది.‘నువ్వు చుట్టలు ఎక్కువగా తాగుతున్నావట కదా… అలా తాగడానికి వీల్లేదు‘అని హుంకరించిన జైలర్ తో ‘జైల్లో సుట్టలకి ఆడ్రు ఉంది. కాబట్టి కదా మాకు ఇత్తన్నారు.నువ్వొద్దంటే నానెందుకు సుట్టను వొగ్గేత్తాను.‘ చుట్ట కాల్చడం అనారోగ్యమని తెలిసుండొచ్చు. కానీ తన మనసుకు నచ్చిన ఆహారం , లేదా తన సరదాను ఆపడానికి మీరెవరు అనే ధిక్కారమే ఈ మాటలు. మేరీ టైలర్ ‘భారతదేశంలో నా జైలు జీవితం‘ అనే పుస్తకంలో బయట బెయిలు పెట్టి విడిపించేవారు లేని రిమాండ్ ఖైదీలు శిక్ష ఖరారు కాకుండానే, సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోవడం చూపిస్తుంది. అలాంటి జీవితాలను ఈ సంకలనంలో మట్టగిడస, జైల్లో జాబిలమ్మ కథలలో చర్చించింది.రాము జీవితాన్ని నాశనం చేసి, తాను వేరే పెళ్లి చేసుకుని, రాముని ఉంపుడుగత్తెనుగా చేసి, ఆవిడ శరీరాన్ని దోచుకున్న షావుకారు చిన్నబాబు, చివరలో కొడుకుల కోసం ఆవిడ మిల్లు కళాసి అని చెప్పి,పోలీసులతో మిల్లు నుండి బయటకు పంపిస్తాడు రామును. రాము ఎలాంటి జీవితం ఎలాగో మారిందని కొంతసేపు బాధపడినా,

తాను చేసిన కళాసీ పనికి తనకు ఇన్ని సంవత్సరాలుగా ఇవ్వాల్సిన వేతనంపై, లేబర్ ఆఫీసులో చినబాబు మీద పిర్యాదు చేస్తుంది. అక్కడ ఆమెకు డబ్బు కట్టబడుతుందని చినబాబు ‘నిజానికి ఈవిడ పనిమనిషి కాదు, నీనుంచుకున్నావిడ.‘ అని చెబితే ‘మా ఇద్దరినీ ఒకసారి చూడండి. నా భుజానికైనా రాని ఇతడు ఉంచుకుంటానంటే నేలగ ఒప్పుకుంటానో మీరైనా సెప్పండి‘ అని చిన బాబును చులకన చేసి, పిల్టీ పట్టుకుని మరీ ధైర్యంగా నిలబడుతుంది.వీటితోపాటు ఆకర్షణలకు గురై, అమాయకంగా నమ్మి, అడుసులోకి దిగిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్న స్త్రీలను ‘ జైల్లో జాబిలమ్మ, మనసుడికిపోతే, అద్దం, సమరమే ‘వంటి కథలలో హృదయ విదారకంగా చిత్రించారు. అలాగే ప్రకృతిలో ఒక జీవికి ఇంకోజీవి ఎలా సాయం చేసుకుంటాయో చెబుతూ మంత్రసాని కథలో పందికి ప్రసవం చేసిన ఆవును గూర్చి చెబుతూ ‘ప్రకృతిలో మనిషేం అంత గొప్ప కాదు.. మనిషొక్కడే మిగతా జీవులకన్నా ఎక్కువేమీకాదు‘అని తోటి వారికి సాయపడడంలో మనం ఇంకా అల్పంగానే ఉన్నామని చెబుతుంది.

ఇంతకుముందు స్త్రీవాద రచయితలు, స్త్రీవాద సూత్రాలను మధ్యతరగతి జీవితాలను ఆలంబనగా చేసుకొని కథలు, కవితలుగా రాసారు., ఈమె ఏ సిద్దాంతాలు తెలియని మామూలు గ్రామీణ మరియు బస్తీల స్త్రీలు (చాలావరకూ నిరక్షరాస్యులు) ఇంగిత జ్ఞానంతోనే , తమ మనసు సుఖం కోసం చేసిన పోరాటాలను కథలుగా మలిచారు. అలాగే ఈ కథలన్నీ స్త్రీల సమస్యలను చెప్పాయి కదా అని, స్త్రీలందరూ మంచివారు పురుషులందరూ చెడ్డవారు అనే సామాన్యీకరణ చేయలేదు.
సెంట్రీ శీను, గాంధీ, కిరణ్ లాంటి స్త్రీల కోసం ఆలోచించే పురుషులూ ఉన్నారనీ, అలాగే స్త్రీలలో క్రూరమైనవారు ఉదాహరణకు జైలుకు వచ్చిన స్త్రీలతో బయట వ్యాపారం చేయించే సరస్వతమ్మలాంటివారు ఉన్నారని చెబుతారు. ఉత్తరాంధ్ర శ్రామిక జీవద్భాషలోనే, తానువిన్న, సాక్షిభూతంగాఉన్న ఇతివృత్తాలను కథలుగా తెలుగు సాహిత్యానికి అందించడం ఈ తరం సాహిత్య పాఠకుల అదృష్టంగా భావిస్తూ, పద్మ గారికి అభినందనలు.

డా. ఆల్తి మోహన రావు
9963895636

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News