మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విధానాలను ఎండగడుతూ.. శాస్త్రీయ విద్యా విధానం కోసం విద్యార్థి సంఘాలు పోరాటాలు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్‌లో జరిగిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.ఎఫ్.ఐ) రాష్ట్ర స్థాయి 4వ మహా సభకు వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ నూతన విద్యా విధానంపై విద్యార్థి సంఘాలు సమీక్షించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ నుంచి విశ్వ విద్యాలయం స్థాయి వరకు స్కిల్ ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపకులు ఉన్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడానికి గల కారణాలను విశ్లేషించాలని విద్యార్థి సంఘాల నాయకులకు సూచించారు. విద్యార్థుల సమస్యల అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా విద్యారంగ విధానాలు, సంస్కరణలపై దృష్టిని సారించాలని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ఎడాపెడా విక్రయించడం, ప్రైవేటీకరణ చేయడం వంటి చర్యలను విద్యార్థి సంఘాలు ఎండగట్టాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.సామాజిక అంశాలు, మతతత్వ రుగ్మతలపై కూడా విద్యార్థి సంఘాలు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని అన్నారు.