Wednesday, January 22, 2025

రాహుల్‌పై కేసు దాఖలు చేయండి

- Advertisement -
- Advertisement -

పోలీసులకు అస్సాం సిఎం ఆదేశం
‘జనాన్ని రెచ్చగొట్టారని’ ఆరోపణ
వారి చర్యలు ‘నక్సలైట్ వ్యూహాలు’

గువాహటి : రోడ్డుపై అవరోధాలను తొలగించేలా ‘జనాన్ని రెచ్చగొట్టినందుకు’ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయవలసిందిగా పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి)ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మంగళవారం ఆదేశించారు. కాంగ్రెస్ వారి చర్యలు ‘నక్సలైట్ వ్యూహాలు’గా సిఎం అభివర్ణించారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బివి పోస్ట్‌కు స్పందనగా ముఖ్యమంత్రి ‘ఎక్స్’లో పోస్ట్‌లో రాస్తూ, ‘జనాన్ని రెచ్చగొట్టినందుకు మీ నేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయవలసిందిగా అస్సాం డిజిపిని ఆదేశించాను’ అని తెలియజేశారు.

శ్రీనివాస్ తన వేదికలో పోస్ట్ చేసిన ఫుటేజ్‌ను సాక్షంగా ఉపయోగించనున్నట్లు శర్మ తెలిపారు. ‘ఇది అస్సామీయుల సంస్కృతి కాదు. మాది శాంతియుత రాష్ట్రం. అటువంటి ‘నక్సలైట్ వ్యూహాలు’ మా సంస్కృతికి పూర్తిగా విరుద్ధం’ అని సిఎం పేర్కొన్నారు. ‘మీ దురుసు ప్రవర్తన, అంగీకృత మార్గదర్శక సూత్రాల ఉల్లంఘన గువాహటిలో ఇప్పుడు భారీ ట్రాఫిక్ జామ్‌కు దారి తీశాయి’ అని శర్మ తెలియజేశారు.

రోడ్డుపై అవరోశాలు ఏర్పాటు చేయడం ద్వారా రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ను ఆపేందుకు కుట్ర జరిగిందని యువజన కాంగ్రెస్ చీఫ్ తన ‘ఎక్స్’ పోస్ట్‌లో ఆరోపించారు. ‘మీరు కోరుకున్నన్ని కర్రలు వాడండి. ఈ పోరు కొనసాగుతుంది’ అని శ్రీనివాస్ అన్నారు. రాహుల్ గాంధీ సారథ్యంలోని యాత్ర నగరంలోకి ప్రవేశించకుండా నిలిపివేశారు. దీనితో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేశారు. వారు అవరోధాలను విరగ్గొట్లి నినాదాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News