రంగనాయక సాగర్ లో నీటిని నింపండి
ప్రభుత్వానికి మాజీమంత్రి హరీష్ వినతి
మనతెలంగాణ/హైదరాబాద్: రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లోకి మిడ్ మానేరు నుండి 1.50 టీ ఎం సి నీటిని పంప్ చేసి యాసంగి పంటకు సాగు నీటిని ఇవ్వాలని రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు లేఖ అందజేశారు. సిద్దిపేట జిల్లా రైతంగానికి యాసంగి పంటకు నీళ్లు అందిచాలని, అందుకు అవసరమగు నీటిని మిడ్ మానెర్ నుండి రంగనాయక సాగర్ కి నీటిని పంప్ చేయాలని కోరారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో తెలంగాణకు అత్యంత ముఖ్యమైన నీటిపారుదల శాఖ మాత్యులుగా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే మనసారా శుభాకాంక్షలు తెలిపారు.
సిద్దిపేట జిల్లా రైతాంగ ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని మంత్రిగా మీ దృష్టికి తీసుకువస్తున్నట్టు తెలిపారు . రంగనాయక సాగర్‌ను నీటితో నింపాల్సిన ఆవశ్యకతను మంత్రికి అందజేసిన లేఖలో వివరించారు. గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో సాగు భూములకు రంగనాయక సాగర్ ద్వారా సాగునీరు అందజేయడం జరిగింది. దీని వల్ల పంట దిగుబడి పెరిగి రైతుల బతుకుల్లో సంతోషం నిండింది. ఈ యేడు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో యాసంగి పంటకు సరిపోయే నీరు రిజర్వాయర్ లో లేక రైతాంగం ఆందోళనకు గురవుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.యాసంగికి నీళ్లు అందించాలంటే మూడు టీఎంసీల నీరు ఉండాలి.
కానీ ప్రస్తుతం రంగనాయక సాగర్ రిజర్వాయర్ లో 1.50 టీఎంసీ మాత్రమే ఉంది. తమరు రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వెంటనే మిడ్ మానేరు నుండి 1.50 టీఎంసీల నీళ్లు రంగనాయక సాగర్ కు వచ్చే విధంగా పంపింగ్ చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించవలసిందిగా లేఖ ద్వారా మనవి చేశారు. గత మూడు సంవత్సరాలుగా అందించిన విధంగానే ఈసారి కూడా యాసంగి పంటకు కావలసిన సాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టవలసిందిగా సిద్ధిపేట జిల్లా రైతాంగం పక్షాన హరీష్ రావు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కల్సి లేఖ అందజేసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.