Friday, December 20, 2024

కళతప్పుతున్న సినిమా రంగం

- Advertisement -
- Advertisement -

వినోదం, విజ్ఞానం అందించే సినిమా రంగం కళ తప్పుతోంది. అసత్యం, అతిశయోక్తి సినిమాలు ఊపందుకున్నాయి. మాస్ మసాల సినిమాలు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో వస్తున్న సినిమాల్లో కమర్షియల్ హంగులు తప్ప, వినోదం, విజ్ఞానం అనే మాటే లేకుండా పోయింది.

ఆనాటి మాయాబజార్, లవకుశ లాంటి సినిమాలు రజతోత్సవాలు, శతదినోత్సవాలు జరుపుకున్నాయి.వందల కోట్ల వ్యయంతో ఇప్పుడు నిర్మిస్తున్న సినిమాలు పట్టున పది రోజులు కూడా ఆడటం లేదు. గత కొంత కాలంగా కమర్షియల్ సినిమాల జోరు పెరగడంతో నిర్మాతల పంటపండుతుంది. హీరోల ప్రాధాన్యత పెరుగుతోంది, కాని అదంతా వ్యాపారం, సమాజహితం ఇసుమంతైనా లేకపోవడం విచారకరం. రక్తపాతం, హింస, దోపిడీ, అశ్లీల నృత్యాలు సినిమాలకు కథాంశాలుగా మారిపోయాయి.

కళారూపాలన్నింటిలోనూ మనకు అత్యంత ముఖ్యమైంది సినిమా అంటుంటారు. సినిమాలు రాకముందు వీధి నాటకాలు ప్రదర్శించేవారు. ఆనాటి నాటకాల్లో వినోదం, విజ్ఞానం, చరిత్ర, వర్తమానం, మానవత్వం, నిజాయితీ, దేశభక్తి, సామాజిక చైతన్యం, సాంఘిక బాధ్యతలతో పాటు కళాత్మకతను ప్రేక్షకులకు అందించారు. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో సినిమా రంగం కూడా అదే ఒరవడిని కొనసాగించింది. సినిమాల ద్వారా సమాజంలో మెరుగైన మార్పును ఆశిస్తుంటారు. ప్రేక్షకులపై సినిమా ప్రభావం ఆ స్థాయిలో ఉంటుందని నమ్ముతుంటారు.

అందుకే, సినిమాల నుండి సమాజ హితాన్ని ఆశించిన ప్రభుత్వాలు ఈ రంగానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నాయి. అనేక రాయితీలు కల్పిస్తున్నాయి. సినీ పరిశ్రమకు పలు ప్రయోజనాలు కలిగిస్తున్నాయి. కాలక్రమేణా సిని పరిశ్రమలో వ్యాపార ధర్మం పెరిగింది. సమాజ హితం విస్మరించింది. వ్యాపారం చేసుకొని లాభాల కోసం సినిమాలు నిర్మించే నిర్మాతల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. అందువల్లనే మాస్ మసాల సినిమాలు జోరందుకున్నాయి. హింస, రక్తపాతం, దోపిడీ కథాంశాలుగా మారిపోయాయి. దేశ సంపదను దోచే వారిని హీరోలుగా చూపించే పరిస్థితి దాపురించింది.

ఇలాంటి సినిమాల వల్ల అనేక ఘోరాలు, నేరాలు, అనర్ధాలు, అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. గ్రామీణుల నిజజీవితాలకు దగ్గరగా ఉన్న ‘బలగం’ సినిమా ఇటీవల ఓ సంచలనం. ఆ సినిమా తీయడానికి చేసిన ఖర్చు కూడా చాలా తక్కువ. నటీనటులు పెద్దగా పేరున్నవారు కాదు. అయినా జనజీవితాలను హత్తుకున్న బలగం స్థాయిలో, వందల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించిన మాస్ మసాల సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాయి. ఊరూరా ‘బలగం’ సినిమాను చూడనివారంటూ లేరంటే అతిశయోక్తి కానేకాదు. ఇటీవల విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప -2 సినిమాలు, డబ్బులు సంపాదించాయే తప్ప, సామాన్య ప్రేక్షకుల నుండి ఆ స్థ్ధాయిలో ఆదరణ పొందలేకపోయాయనేది జగమెరిగిన సత్యం. సినిమా అంటే అలా ఉండాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారనడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి లేదనుకుంటాను.

వినోదం, విజ్ఞానం, కళాత్మకత, దేశభక్తి, సమాజ హితం, మానవత్వం, నిజాయితీ, కుటుంబ అనుబంధాలు ఇతివృత్తంగా సినిమాలు వచ్చిన రోజుల్లో సినిమా హాళ్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి. బండెనుకబండి కట్టుకొని గ్రామీణులు సమీప పట్టణాల్లోని సినిమా థియేటర్లకు వచ్చిన రోజులను విస్మరించలేం. ఆనాటి సినిమాలు విలువలతో కూడిన సమాజ హితాన్ని ఆశించి నిర్మించబడ్డాయి. నిర్మాతలు లాభాపేక్ష లేకుండా దేశభక్తితో సినిమాలు తీశారు. నటీనటులు కూడా మానవత్వానికి, నిజాయితీకి విలువనిచ్చారు.

వినోదంతో పాటు సందేశం ఉండే విధంగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. కాలం మారింది. నిర్మాతల ప్రాధాన్యత తగ్గింది. అనేక సినిమాలకు దర్శకుడు, హీరో తప్ప నిర్మాత ఎవరనేది ప్రేక్షకునికి తెలియని పరిస్థితి ఏర్పడింది.హీరోకు అనుగుణంగా నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. మాస్ మసాల జోడించి పది రోజులు ఆడితే చాలు జేబులు నింపుకోవచ్చు అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. దీంతో సమాజంలో దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు వచ్చే సినిమాల్లో కమర్షయల్ హంగులు తప్ప వినోదం, విజ్ఞానం మచ్చుకైన కనిపించవు. హింస, రక్తపాతం, దోపిడీదారులను హీరోలుగా చిత్రీకరించడంతో సినిమాల వల్ల ఎన్నో ఘోరాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ఇటీవల ఒక సినిమా విడుదలైంది. ఆ సినిమాను ప్రేక్షకుల మధ్య కూర్చొని చూసేందుకు హీరో థియేటర్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి హీరోపై పోలీసులు చట్టపరమైన చర్యల్లో భాగంగా జైలుకు పంపించారు. ఆ హీరో జైలులో అడుగు పెట్టిన వెంటనే, ఆగమేఘాల మీద యంత్రాంగమంతా కదిలింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత జైలు లోపలికి వెళ్లిన ఆ హీరో తెల్లవారే సరికే ఇంటికి చేరుకున్నారు.

ఆయనను పరామర్శించడానికి సినిమా రంగం వరస కట్టింది. కాని సినిమా విడుదల సందర్భంగా చనిపోయిన మహిళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఏ ఒక్క సినీ ప్రముఖుడు ముందుకు రాలేదు. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో కోట్లకు కోట్లు సంపాదించుకొని సెలెబ్రిటీగా సమాజంలో గుర్తింపు పొందుతున్న సినీరంగం ఆదే ప్రేక్షకుల విషయంలో ఎంత చిన్నచూపుతో వ్యవహరిస్తుందనడానికి ఈ సంఘటనే సరైన ఉదాహరణ.

కొలను వెంకటేశ్వరరెడ్డి
ఎస్‌పి, జైల్స్ (రిటైర్డు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News