కరోనా కారణంగా అన్ని రంగాలతో పాటు చిత్ర పరిశ్రమ కూడా ఎన్నో కష్టనష్టాలకు గురైంది. ముఖ్యంగా కార్మికులు తీవ్ర అవస్థల పాలయ్యారు. ప్రస్తుతం సినీ కార్మికులు నానా కష్టాల పాలవుతున్నారు. దీంతో తమకు కనీస వేతనాలను పెంచాలని గత కొంతకాలంగా నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు. సినిమా బడ్జెట్‌లు, హీరోల రెమ్యూనరేషన్స్ పెరుగుతున్నా.. గత నాలుగు సంవత్సరాలుగా తమ వేతనాలు అయితే పెరగడం లేదని, సినీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రతి మూడు సంవత్సరాలకు వేతనాలు పెంచాల్సి ఉండగా ఇప్పటికీ కార్మికుల వేతన సవరణను నిర్మాతలు పట్టించుకోకపోవడంతో సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వేతనాలు 30 శాతం పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండాలని సినీ కార్మికులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల నాయకులతో సినీ ఫెడరేషన్ చర్చలు జరిపింది.
కార్మికుల వేతనాలపై చర్చిస్తాం…
చిత్ర పరిశ్రమలో సమ్మె చేయాలంటే నిబంధనల ప్రకారం 15 రోజుల ముందు ఫిల్మ్ ఛాంబర్‌కు నోటీస్ ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు కొల్లు రామకృష్ణ అన్నారు. అలాంటి నోటీస్ ఇప్పటివరకు ఫిలిం ఛాంబర్‌కు రాలేదని తెలిపారు. దీంతో బుధవారం నిర్మాతలు షూటింగ్‌లు యధావిధిగా నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఇక కార్మికుల వేతనాలపై బుధవారం నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ కౌన్సిల్ భేటీలో చర్చిస్తామని చెప్పారు.
Film Industry Workers Demand for hike salary