మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రముఖ సినీ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ (76) కన్నుమూశారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వడ్డేపల్లి కృష్ణ కవి, సినీగేయ, లలిత గీతాల రచయిత. రెండు రోజుల క్రితమే తెలుగు సినీ రచయితల సంఘం ఆయన్ని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. సినారె ఇష్టపడిన రచయిత వడ్డేపల్లి కృష్ణ. పది వేల లలిత గీతాలను పరిశీలించి పీహెచ్‌డీ పూర్తి చేశారు. వందలాది లలిత గీతాలు ఆకాశవాణి, దూరదర్శన్ లో ప్రసారమయ్యాయి. 40కి పైగా నృత్య రూపకాలు రాశారు. ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ఎక్కడికి వెళ్తుందో మనసు’ చిత్రంలో సాయికుమార్ హీరోగా నటించారు. సంచలనం సృష్టించిన బలగం సినిమాలో ఆయనే స్వయంగా నటించారు.
ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఆటా, తానా వేడుకల్లో ప్రతి ఏటా, సాహిత్య చర్చల్లోను పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన దర్శకత్వం వహించి నిర్మించిన గోభాగ్యం లఘు చిత్రానికి అంతర్జాతీయంగా పలు పురస్కారాలు లభించాయి. బతుకమ్మ, రామప్ప రామణీయం లాంటి అనేక లఘు చిత్రాలకు నంది పురస్కారాలు వచ్చాయి. వడ్డేపల్లి కృష్ణ సిరిసిల్లలో చేనేత కుటుంబంలో జన్మించారు. తొలుత పోస్ట్ మేన్ గా ఉద్యోగం చేశారు. దర్శకుడిగా రెండు సినిమాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన ఎక్కడకి వెళుతుందో మనసు సినిమాలో సాయికుమార్ హీరోగా నటించారు. ’బలగం’ సినిమాలో వడ్డేపల్లి నటించారు. ఆయన రాసిన వందలాది లలితగీతాలు ఆకాశవాణి, దూరదర్శన్ లో ప్రసారమయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా కృష్ణ చురుగ్గా పాల్గొన్నారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేశారు.