Monday, January 20, 2025

ఫైనల్ అలైన్‌మెంట్ ఖరారు

- Advertisement -
- Advertisement -

Final alignment of RRR finalized

ఆర్‌ఆర్‌ఆర్‌కు వచ్చే నెల నుంచి తొలి విడత భూసేకరణ

ఈ నెలాఖరులోగా సర్వే నెంబర్ వివరాలతో నోటిఫికేషన్
21రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనల స్వీకరణ
తొలి విడతలో 60శాతం భూమి సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల నుంచి, మిగతా 40శాతం యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి సేకరణ
డిసెంబర్‌లో మొదటి విడత పనులు ప్రారంభం

మార్పులు ఉండదు

ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించి ఫైనల్ అలైన్‌మెంట్ ఖరారైంది. దీనిలో ఎలాంటి మార్పు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం మేరకు కేంద్రం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గ్రామాలకు, ప్రాజెక్టులకు ఇబ్బందుల్లేకుండా ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మిస్తున్నాం. భూసేకరణలో రెవెన్యూ అధికారులు ఆయా యజమానులకు నోటీసులు ఇచ్చి అభ్యంతరాలను, సూచనలు స్వీకరిస్తున్నారు. ఎవరూ దళారులను నమ్మొద్దు. ప్రస్తుతం పెగ్ మార్కింగ్ అయింది. ఈ సంవత్సరం చివరిలోగా మొదటివిడత పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

                                                                                   ఆర్‌అండ్‌బి ఇఎన్‌సి గణపతిరెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆర్‌ఆర్‌ఆర్ (రీజనల్ రింగ్‌రోడ్డు)కు సంబంధించిన ఫైనల్ అలైన్‌మెంట్ ఖరారు అయ్యింది. ఇది పూర్తయ్యే వరకు ఈ అలైన్‌మెంట్‌లో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని అధికారులు తేల్చిచెప్పారు. ఎవరూ కూడా తమ భూమిలో నుంచి లేదా ప్లాట్ల నుంచి, వెంచర్‌ల నుంచి ఈ అలైన్‌మెంట్ పోకుండా చూడాలని తమకు ఫోన్‌లు చేయడంతో పాటు తమ వద్దకు వస్తున్నారని, అలా ఎవరూ చేయవద్దని ఇది ఫైనల్ అయ్యిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఫైనల్ అలైన్‌మెంట్ ఖరారు కావడంతో దీనికి సంబంధించిన హద్దురాళ్ల నాటే ప్రక్రియను ఇప్పటికే పలు జిల్లాలో రెవెన్యూ అధికారులు ప్రారంభించారు.

మొదటివిడతలో ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించి (సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి) నాలుగు జిల్లాలు ఉండగా ఈ జిల్లాలో మొత్తం 5 వేల ఎకరాలను భూమిని అధికారులు సేకరిస్తున్నారు. ఇక రెండోవిడతలో నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్, సంగారెడ్డి) జిల్లాలు ఉండగా మొత్తం ఇక్కడ 6వేల ఎకరాల భూమిని అధికారులు సేకరించనున్నారు. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించి ఎక్కడా గ్రామాలకు, ప్రాజెక్టులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. ఈ ప్రాజెక్టులో అధికశాతం ప్రైవేటు వెంచర్‌లతో పాటు ప్రభుత్వ భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించనుంది. మొదటివిడతలో 158 కి.మీల ఆర్‌ఆర్‌ఆర్ రోడ్డు చౌటుప్పల్ వరకు పూర్తి కానుండగా రెండోవిడతలో చౌటుప్పల్ నుంచి 182 కి.మీల మేర ఈ రోడ్డును అధికారులు పూర్తిచేయనున్నారు.

యాదగిరిగుట్ట లోపలి నుంచి భువనగిరి మధ్యలో నుంచి…

మొదటి విడత భూసేకరణలో భాగంగా యాదగిరిగుట్ట టెంపుల్ బయటి నుంచి ముందుగా భూ సేకరణ చేయాలని అధికారులు భావించారు. దానికి 10 కి.మీల దూరం ఎక్కువ కావడంతో పాటు భూ సేకరణ పరిహారం అధికంగా కావడంతో ఆ ప్రతిపాదనను అధికారులు విరమించుకున్నారు. ప్రస్తుతం భూ సేకరణ యాదగిరిగుట్ట లోపలి నుంచి భువనగిరి మధ్యలో నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ను ఏర్పాటు చేయనున్నారు.

6 నుంచి 8 నెలల సమయం…

అయితే ఇప్పటికే యాదాద్రి టెంపుల్ పేరుతో చాలామంది రియల్టర్లు అక్కడ స్థానికంగా వెంచర్లు చేసి అమ్మేశారు. చాలామంది వీటిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం చాలా వెంచర్‌ల మీదుగా ఈ అలైన్‌మెంట్ పోతుంది. దీంతోపాటు మొదటివిడతలో భూ సేకరణ చేసే నాలుగు జిల్లాలను తీసుకుంటే 60 శాతం భూమిని సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాల నుంచి సేకరిస్తుండగా 40 శాతం భూమి ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మున్సిపాలిటీ నుంచే సేకరించనున్నారు. ఈ నేపథ్యంలో అధికశాతం ఇక్కడ భూ సేకరణ చేపట్టాల్సి రావడంతో కొంతమేర భూ సేకరణ ఇక్కడ ఆలస్య అయ్యే అవకాశం ఉందని 6 నుంచి 8 నెలల సమయం పట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ఇప్పటికే భూ సేకరణకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యింది. దీనికి సంబంధించిన హద్దురాళ్లను కూడా అధికారులు నాటుతున్నారు. ఈనెలాఖరులోగా మొదటివిడతలో భూమిని సేకరించే సర్వే నెంబర్‌లను రెవెన్యూ అధికారులు విడుదల చేయనున్నారు. ఈ సర్వే నెంబర్‌ల యజమానులకు 21 రోజుల సమయాన్ని ఇవ్వడంతో పాటు వారి నుంచి అభ్యంతరాలు, సూచనలను రెవెన్యూ అధికారులు స్వీకరించనున్నారు. అనంతరం ఆర్‌డిఓలు అవార్డు పాస్ చేసి వారికి పరిహారం అందచేస్తారు.

ఎన్‌హెచ్‌ఏఐ 1956 యాక్ట్ ప్రకారం, 2013లో చేసిన సవరణల ఆధారంగా పరిహారం

ఈ పరిహారం కూడా ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ప్రకారం ఆయా భూ యజమానులకు రెవెన్యూ అధికారులు పరిహారం అందిస్తారు. ఈ పరిహారం ఎన్‌హెచ్‌ఏఐ 1956 యాక్ట్ ప్రకారం, 2013లో చేసిన సవరణల ఆధారంగా దీనిని రెవెన్యూ అధికారులు నిర్ణయిస్తారు. దీంతోపాటు అర్భన్, రూరల్ మార్కెట్ వాల్యూను కూడా పరిగణలోకి రెవెన్యూ అధికారులు ఈ పరిహారాన్ని నిర్ణయిస్తారు. అయితే మార్కెట్ వాల్యూ ప్రకారం ఆయా యజమాలనులకు ఇబ్బందులు ఏర్పడినప్పుడు మాత్రమే దీనిపై కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది.

2023 జనవరిలో రెండోవిడత భూ సేకరణ పనులు

భూసేకరణతో పాటు పరిహారం చెల్లింపులన్నీ ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్‌లో పూర్తయ్యే అవకాశం ఉందని డిసెంబర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ మొదటివిడత పనులు మొదలయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియను కూడా ఈ సంవత్సరం అక్టోబర్‌లో ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వచ్చే సంవత్సరం 2023 జనవరిలో రెండోవిడత భూ సేకరణ పనులు మొదలయ్యే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

రెండు విడతల్లో 10 జంక్షన్‌లు

ఆర్‌ఆర్‌ఆర్ మొదటి, రెండోవిడవతలో మొత్తం 10 జంక్షన్‌లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఒకవేళ ఈ జంక్షన్‌లు జాతీయ రహదారులకు దగ్గరగా ఉంటే వాటిని కలిపేలా వీటిని ఏర్పాటు చేస్తారు.

మొదటి విడతలో 5 జంక్షన్‌ల వివరాలు ఇలా …

1.చౌటుప్పల్ వద్ద విజయవాడ హైవే మీద

2.ప్రజ్ఞాపూర్ నుంచి కిందకు రాజీవ్ రహదారి వద్ద

3.తూఫ్రాన్ ఊరు దాటిన తరువాత హల్దీవాగు వద్ద

4.నర్సాపూర్‌కు 5 కి.మీలు దాటిన తరువాత

5.సంగారెడ్డి దగ్గర ఉన్న పెద్దాపూర్ వద్ద

రెండోవిడతలో వచ్చే 5 జంక్షన్‌లు…

1.నాగార్జున సాగర్ నుంచి మాల్ వెళ్లే మార్గంలో

2.ఆమన్‌గల్ నుంచి శ్రీశైలం హైవే మార్గంలో

3.రాయల్‌కల్ నుంచి షాద్‌నగర్ దక్షిణమార్గం వైపు

4.మన్నెగూడ నుంచి చేవెళ్ల వెళ్లే మార్గంలో

5.సంగారెడ్డి దగ్గర

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News