Friday, December 20, 2024

లొంగేది లేదు.. చివరి దాకా ప్రతిఘటనే

- Advertisement -
- Advertisement -

Final battle of Ukrainian forces in Mariupol

మెరియూపోల్‌లో ఉక్రెయిన్ దళాల అంతిమపోరు
స్టీల్‌ప్లాంట్ కేంద్రంగా పతాకదశకు ఘర్షణ
లోపల తలదాచుకున్న వేలాది మంది
ఈ క్లైమాక్స్‌లోనైనా అంతా ఆదుకుంటే మంచిది
ఇది ప్రపంచంపై సాగుతోన్న దాడి
జెలెన్‌స్కీ ఆవేదన ఆక్రోశం
డాన్బాస్ కారిడార్‌పై రష్యా గురి

కీవ్ : ఉక్రెయిన్‌లోని అత్యంత కీలక వ్యూహాత్మక నగరం మేరియూపోల్ కేంద్రంగా ఇప్పుడు పోరు ఉధృత స్థాయికి చేరింది. ఈ నగరం అంతా ఇప్పుడు తమ అధీనంలోకి వచ్చిందని ఓ వైపు రష్యా సేనలు చెపుతున్నాయి. అయితే అత్యంత విశాలమైన ఆవరణలతో కూడిన ఇక్కడి అజోవస్టల్ స్టీల్ ప్లాంట్‌లో తిష్టవేసుకుని ఉన్న ఉక్రెయిన్ సైనిక పటాలాలు రష్యన్లపై ఎదురుదాడికి దిగుతున్నాయి. సరెండర్ల బెదిరింపులకు లొంగేది లేదని స్పష్టం చేస్తున్నాయి. పోరును తుది స్థాయి వరకూ తీసుకువెళ్లి తీరుతాం వెనకకు పోయ్యేదే లేదని ఉక్రెయిన్ సైనికాధికారులు స్టీల్ ప్లాంట్ వేదికగా తెలిపారు. అయితే ఇక్కడి సైనిక స్థావరంపై విరుచుకుపడి సైన్యాన్ని దెబ్బతీస్తే ఇక ఇక్కడనే కాకుండా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం అంతా తమ గుప్పిట్లోకి వస్తుందని రష్యా సైనిక వ్యూహానికి పదును పెడుతోంది. సోమవారం రాత్రి వరకూ కూడా రష్యా సైన్యానికి ఉక్రెయిన్ స్టీల్ ప్లాంట్ సైనికబలగాల నుంచి తీవ్రస్థాయి ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. ఇప్పటి స్థితిని అయినా గుర్తించి రష్యా ఆక్రమణల పర్వానికి సరైన రీతిలో చెక్‌పెట్టేందుకు తక్షణం స్పందించాల్సి ఉందని ఉక్రెయిన్ నేత జెలెన్‌స్కీ పిలుపు నిచ్చారు.

ఇక్కడి విజయం లేదా అపజయం సైనికులు పౌరుల చావు లేదా బతుకు అనేది కేవలం ఈ ప్రాంతానికి ఈ దేశానికి సంబంధించిన విషయాలు కావని, ఇవి మొత్తం ప్రపంచానికి సంబంధించినవని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ రష్యా గెలిస్తే ఏమవుతుంది. ఇదే విధమైన పంజా మరోచోట ఆరంభమవుతుందని తేల్చిచెప్పారు. మేరియూపోల్‌ను కైవసం చేసుకునేందుకు రష్యా సేనలు దాదాపు ఏడువారాలుగా యత్నిస్తూ వచ్చాయి. ముందు శివార్ల దిగ్బంధనం చేశాయి. తరువాత ఇక్కడి కొన్ని ప్రాంతాలను స్వాధీనపర్చుకున్నాయి. ఇక్కడి పౌర జీవితాలను ఛిన్నాభిన్నం చేసేలా దారుణ హింసాకాండల నడుమ రష్యా సేనలు యుద్ధ నేరాలకు పాల్పడ్డాయని పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ మేరియూపోల్ కోసంయుద్ధం సాగుతూ ఇప్పుడు ఇక్కడి స్టీల్‌ప్లాంట్ కేంద్రంగా ఇప్పుడు నిర్ణయాత్మక స్థాయికి చేరుకుంది. సైనికులతో దుర్భేధ్యంగా ఉన్న స్టీల్‌ప్లాంట్‌లోనే అసంఖ్యాక ఉక్రెయిన్ పౌరులు తలదాచుకుని ఊపిరి బిగపట్టుకుని ఉన్నారు. ఈ నగరాన్ని వశపర్చుకుంటే ఇక్కడి అజోవ్ సముద్ర మార్గం ద్వారా తమ సేనల రాకపోకలకు మార్గం సుగమం అవుతుందని రష్యా భావిస్తోంది.

ఈ ప్రాంతం మీదుగానే అత్యంత పారిశ్రామిక సుసంపన్నమైన డాన్బాస్ ప్రాంత స్వాధీనానికి వీలేర్పడుతుందని రష్యా సైనిక వ్యూహకర్తలు భావిస్తున్నారు. 2014 నుంచి ఉక్రెయిన్ స్వాధీనంలో ఉన్న అపార వనరుల క్రిమియన్ సింధుశాఖలో తమ భూ స్థావరం ఏర్పాటుకు వీలేర్పడుతుందని రష్యా అందుకు అనుగుణంగానే పావులు కదుపుతోంది. మరో వైపు రష్యా సైనికులు సాగించిన దాడులలో ఎల్‌వీవ్‌లో ఏడుగురు పౌరులు మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక మేయర్ అండ్రియు సడోవ్యి సోమవారం తెలిపారు. ఈ ప్రాంతంలో రష్యా సేనలు నలుమూలల నుంచి దాడులను ముమ్మరం చేశాయి. ఇక్కడి ఓ హోటల్‌పై రష్యన్ సైనిక దళాలు బాంబులు విసిరాయి. దీనిలోపల వందలాది మంది పౌరులు తలదాచుకుంటున్నారు. వీరిలో ఇప్పుడు ఎందరు సజీవంగా ఉన్నారు? ఎందరు చనిపోయ్యారు. ఎందరు క్షతగాత్రులు అయ్యారు? అనేది తేలడానికి తమకే చాలా రోజులు పడుతుందని స్థానిక మేయర్ నిస్సహాయత వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News