Friday, November 15, 2024

ప్రొఫెసర్ సాయిబాబాకు కన్నీటి వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

 గాంధీ మెడికల్ కాలేజీకి
పార్ధివదేహం అప్పగింత
గన్‌పార్కు వద్ద
సంతాపసభకు
అనుమతి నిరాకరణ
నివాళులర్పించేందుకు వెళ్లిన
కెటిఆర్‌కు చేదు అనుభవం
మనతెలంగాణ/హైదరాబాద్ : పౌర హక్కుల ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాకు పౌరహక్కుల నేతలు, ప్రజాసంఘాల నాయకులు సోమవారం తుది వీడ్కోలు పలికారు. శనివారం రాత్రి తుది శ్వాస విడిచిన సాయిబాబా పార్థివదేహాన్ని సోమవారం ఉదయం నిమ్స్ మార్చురీ నుంచి ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయన పార్థివదేహాన్ని గన్‌పార్క్‌కు తీసుకెళ్లారు. అక్కడ 5 నిమిషాల పాటు సాయిబాబా సంతాప సమావేశం ఏర్పాటు చేస్తామని కుటుంబసభ్యులు, అభిమానులు కోరగా.. పోలీసులు నిరాకరించారు. సాయిబాబా పార్థివదేహాన్ని అంబులెన్స్‌లోనే ఉంచి నిర్వహిస్తామని చెప్పినా అనుమతి ఇవ్వలేదు. దీంతో సాయిబాబా అభిమానులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే ప్రొఫెసర్ సాయిబాబా పార్ధివదేహానికి పలువురు నివాళులర్పించారు.

final farewell to Professor Saibaba

సిపిఐ నేత నారాయణతో పాటు పలువురు వామపక్ష నేతలు అంజలి ఘటించారు. సాయిబాబా అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. కామ్రేడ్ సాయిబాబా అమర్ రహే, లాల్ సలాం, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నేత నారాయణ మాట్లాడుతూ, పుస్తకాలు కాకుండా సమాజాన్ని చదివేవారు మేధావులని పేర్కొన్నారు. సాయిబాబా అలాంటి వ్యక్తి అని కొనియాడారు.సాయిబాబాను పదేళ్లు అన్యాయంగా జైల్లో నిర్బందించారని ఆవేదన వ్యక్తం చేశారు. దోషి ఎవరో తేల్చాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాస్తామని నారాయణ చెప్పారు.

అనంతం సాయిబాబా భౌతికకాయాన్ని మౌలాలిలోని ఆయన నివాసానికి తరలించగా, సాయిబాబాకు నివాళులర్పించేందుకు ప్రజాసంఘాలు, పౌర హక్కుల నేతలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జోహార్ సాయిబాబా, లాల్ సలాం నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం, పిఒడబ్లూ సంధ్య సహా పలువురు రాజకీయ, ప్రజాసంఘాల నేతలు సాయిబాబా బౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

కెటిఆర్‌కు చేదు అనుభవం

ప్రొఫెసర్ సాయిబాబా పార్థివ దేహానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా కెటిఆర్‌కు నిరసన సెగ తగిలింది. సాయిబాబా భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న సమయంలోనే ప్రజా సంఘాల నేతలు కెటిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గో బ్యాక్ అంటూ నినదించారు. సాయిబాబా పదేళ్లు జైల్లో ఉంటే బిఆర్‌ఎస్ ఏం చేసిందని నిలదీశారు. ఇప్పుడు నివాళులు అర్పించేందుకు ఎలా వచ్చారని అడిగారు. బిఆర్‌ఎస్ హయాంలో 150 మందిపై అకారణంగా ఉపా కేసులు పెట్టారని గుర్తు చేశారు. హరగోపాల్, కోదండరాం, విమలక్కను వేధించారని మండిపడ్డారు. డౌన్ డౌన్ కెటిఆర్ అంటూ ప్రజా సంఘాల నేతలు నినాదాలు చేశారు.

సాయిబాబా గారు పడిన వేదనకు ఎవరు సమాధానం చెబుతారు : హరీశ్‌రావు

సాయిబాబా గారు పడిన వేదనకు ఎవరు సమాధానం చెబుతారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ప్రశ్నించారు. మౌలాలిలోని ప్రొఫెసర్ సాయిబాబా పార్థీవ దేహానికి ఆయన పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపి, నిర్దోషిగా బయటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలా జరగటం శోచనీయమని వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు నిర్దోషి అని తీర్పు ఇచ్చిందని, కానీ దశాబ్ద కాలం ఆయనతో పాటు, ఆయన కుటుంబ సభ్యులు పడిన వేదన వర్ణనాతీతమని పేర్కొన్నారు. నిర్దోషిగా బయటికి వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చే సమయంలో ఇలా జరగటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

సాయిబాబా ప్రొఫెసర్‌గా పని చేస్తూ, ఆ హొదాలోనే ప్రాణాలు వదలాలని అనుకున్నారని, కానీ దురృష్టవశాత్తూ ఉద్యోగం కూడా కోల్పోయారని పేర్కొన్నారు. వంద మందికి శిక్ష పడినా ఒక నిర్దోషికి శిక్ష పడవద్దు అనేది న్యాయ సూత్రం అని, ఇది సాయిబాబా విషయంలో వర్తిస్తుందని చెప్పారు. 90 శాతం అంగవైకల్యం ఉన్న వ్యక్తి పట్ల అక్రమ కేసులు పెట్టి నిర్బంధిచడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సాయిబాబా తన కండ్లు, శరీరాన్ని కూడా గాంధీ ఆసుపత్రికి డొనేట్ చేస్తూ ఆదర్శంగా నిలిచారని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా సాయిబాబా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గాంధీ మెడికల్ కాలేజీకి సాయిబాబా పార్థివదేహం అప్పగింత

ప్రొఫెసర్ సాయిబాబా అంతిమయాత్ర సోమవారం మధ్యాహ్నం మౌలాలి నుంచి ప్రారంభమయ్యింది. ఆయన అంతిమయాత్రలో ప్రజలు, పౌర హక్కుల నేతలు, వామపక్షల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, పాటలు, నినాదాలతో సాయిబాబాకు నివాళులు అర్పించారు. రాజ్యమే సాయిబాబాను చంపిందని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని పౌర హక్కుల నేతలు హోరెత్తించే నినాదాలతో ర్యాలీ సాగింది. యాత్ర అనంతరం ఆయన చివరి కోరిక మేరకు కుటుంబ సభ్యులు సాయిబాబా పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు.అప్పటికే ఆయన కళ్లను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి దానం చేశారు. సాయిబాబా పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగిస్తున్న సమయంలో ప్రజాసంఘాల నేతలు, ఆయన అభిమానులు, ప్రజలు సాయిబాబా అమర్ రహే, జోహార్ సాయిబాబా, సాయిబాబా ఆశయాలను కొనసాగిస్తామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా సాయిబాబా సతీమణి వసంత, కూతురు మంజీర మాట్లాడుతూ, సాయిబాబా ప్రొఫెసర్‌గా ఎంతోమంది విద్యార్థులకు పాఠాలు చెప్పారని, ఆయన శరీరం కూడా ఇక్కడికి పాఠాలు చెప్పేందుకు వచ్చిందని అన్నారు. ఆయనకు బోధన వృత్తి అంటే ఎంతో ఇష్టం అని, జైలులో ఉన్న సమయంలో కూడా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్లు తనకు అనిపించేదని చెప్పేవారని తెలిపారు. కాగా, అనారోగ్య సమస్యలు, గుండెపోటుతో శనివారం రాత్రి ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మౌలాలిలోని నివాసంలో ఆయన పార్థీవ దేహానికి రాజకీయ నేతలు, ప్రజాసంఘాల నేతలు నివాళులు అర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News