Monday, December 23, 2024

గొల్లుమన్న దబ్బీర్‌పేట

- Advertisement -
- Advertisement -

అశేష జనం మధ్య రాకేశ్‌కు అంతిమ
వీడ్కోలు పాల్గొన్న మంత్రులు
ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్,
ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సి
వరంగల్‌లో ఉద్రిక్తతల నడుమ
కొనసాగిన అంతిమయాత్ర
బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంపై దాడి,
ఫ్లెక్సీలకు నిప్పు.. నర్సంపేటలో టెన్షన్

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: సికింద్రాబాద్ కాల్పుల్లో మృతిచెందిన వరంగల్ జిల్లా దబ్బీర్‌పేటకు చెందిన దామెర రాకేష్(21) అంతిమయాత్రకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేసింది. అగ్నిపథ్ పథకానికి బలైన అమరవీరుడు రాకేష్ కుటుంబాన్ని సిఎం కెసిఆర్ ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చిం ది. కేంద్ర ప్రభుత్వ వైఖరి మూలంగానే రాకేష్ మృతిచెందినందున వరంగల్ ఉమ్మడి జిల్లాలో తీవ్ర నిరసన వ్యక్తమై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బిజెపికి వ్యతిరేకంగా టిఆర్‌ఎస్, ఇతర ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు భారీ ఎత్తున నిరసన గళాన్ని విప్పి ర్యాలీలు చేపట్టారు. శనివారం ఉదయమే 8 గంటలకు ఎంజిఎం మార్చురీకి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, నర్సంపేట ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్‌రెడ్డిలు భారీ ఎత్తు పార్టీ శ్రేణులతో తరలివచ్చి అక్కడే కుటుంబసభ్యులను ఓదార్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిలు మా లోతు కవిత, పసునూరి దయాకర్, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి, ఎంఎల్‌ఎలు ము త్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, నన్నపునేని నరేందర్, డిఎస్ రెడ్యానాయక్‌లు మార్చురీకి చేరుకొని మృతదేహానికి శ్ర ద్ధాంజలి ఘటించి కుటుంబసభ్యులను ఓదార్చారు.

పోస్టుమార్టం ముగిసిన తర్వాత ఎంజిఎం నుంచి ఉదయం 9 గంటలకు రాకేష్ అంతిమయాత్ర మొదలైంది. పోచమ్మ మైదాన్‌కు చేరుకోగానే అక్క డే ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్ భవనంపై దాడి చేసేందుకు కొంతమం ది ప్రయత్నించారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడి నుండి కాశిబుగ్గ, వెంకట్రామా జంక్షన్‌కు చేరుకునే సరికే అశేషంగా తరలివచ్చిన రాకేశ్ అభిమానుల్లో కొంతమం ది వరంగల్ రైల్వేస్టేషన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించగా అక్కడ కూడా పోలీసులు అడ్డుకున్నారు. మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి నేతృత్వంలో పోచమ్మ మైదాన్‌లోనే కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అక్కడి నుంచి అంతిమయాత్ర ధర్మారం వరకు వేలాది మంది జనం మధ్య జోహార్లు రాకేష్ అంటూ.. మధ్యాహ్నం 12గంటల వరకు కొనసాగింది. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయి ద్వారా మం త్రుల బృందం రాకేష్ అంతిమయాత్రను నర్సంపేటకు తీసుకొచ్చారు. నర్సంపేటలోని అయ్యప్ప టెంపుల్‌కు చేరుకోగానే ప్రజలు భారీ ఎత్తున రాకేష్ వాహనానికి ఎదురొచ్చి కన్నీటి నివాళులర్పించారు. రెండు గంటల పాటు నర్సంపేటలో అంతిమయాత్ర ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగింది. అమరుల స్థూపం వద్ద రాకేష్‌కు నివాళులర్పిం చి అక్కడ నుంచి నేరుగా అంగడి సెంటర్, అంబేద్కర్ సెంటర్‌ల మీదుగా పాకాల రోడ్డు నుంచి అశోక్‌నగర్‌కు అక్కడ నుం చి స్వగ్రామమైన దబ్బీర్‌పేటకు చేరుకుంది.

రాకేష్ ఇంటికి మృతదేహాన్ని తరలించి సంప్రదాయ పద్ధతిలో రాకేష్‌కు అంతిమ సంస్కారాలు చేపట్టి అక్కడి నుంచి మళ్లీ యాత్రను శ్మశానవాటిక వరకూ కొనసాగించారు. శనివారం సా యంత్రం 5.30 గంటలకు శ్మశానవాటికలో ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపిలు మాలోతు కవిత, పసునూరి దయాకర్, ఎంఎల్‌ఎలు ఆరూరి రమేష్, నన్నపునేని నరేందర్, జడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి, ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, స్థానిక నేతలు వేలాది మంది కార్యకర్తలు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు.

రాకేష్‌కు నివాళులర్పించిన మాజీ దళ నేతలు

సికింద్రాబాద్ కాల్పుల్లో మృతిచెందిన దామెర రాకేష్‌కు న్యూ డెమోక్రసీ మాజీ అజ్ఞాత దళ నేతలు నివాళులర్పించారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రతినిధిగా కొనసాగిన గోపన్న, సూర్యంలు మృతదేహానికి పూలమాల వేసి రెడ్ సెల్యూట్‌తో నివాళులర్పించారు. ఇదిలా ఉంటే పాకాల ఏరియా దళ కమాండర్‌గా పనిచేసిన ములుగు ఎంఎల్‌ఎ సీతక్కకు ఈ కుటుంబంతో సంబంధాలున్నందున ఆమె కూడా మృతునికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.

అంతిమయాత్ర ప్రారంభం నుండి ఉద్రిక్తత..

కాల్పుల్లో మృతిచెందిన దామెర రాకేష్ మృతి చెందిన విషయం తెలిసినప్పటి నుంచి వరంగల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం వరంగల్‌లో మొదలైన అంతిమయాత్రలో నిరసనకారులు బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయ అద్దాలను ధ్వంసం చేసి, ప్లెక్సీలకు నిప్పంటించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు రైల్వే స్టేషన్ ఎదుట టైర్లను కాల్చి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇలా యాత్ర ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. అయితే ఎక్కడ పెద్దగా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ ఎత్తున పోలీస్ బలగాలు మోహరించారు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు దొంతి మాధవరెడ్డి, భరత్‌చందర్‌రెడ్డిలు మృతునికి నివాళులర్పించేందుకు నర్సంపేటలో ఉండగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయన్న ఉద్దేశ్యంతో పోలీసులు ముందస్తుగానే వారిని హౌస్ అరెస్ట్ చేసి ఎసిపి కార్యాలయానికి తరలించారు. ఈనేపథ్యంలో పోలీసులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News