బెంగళూరు : బెంగళూరులో నానాటికీ తీవ్రం అవుతున్న ట్రాఫిక్, మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించడం తుదకు భగవంతునికీ సాధ్యం కాదని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ చేసిన వ్యాఖ్య వివాదానికి దారి తీసింది. శివకుమార్ అసాధారణ వ్యాఖ్యపై సోషల్ మీడియాలో ఖండనలు వచ్చాయి. ప్రాజెక్టులు ఆలస్యం కావడం, ఎడతెగని ట్రాఫిక్ సమస్యలపై రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేక మంది తీవ్ర స్థాయిలో తూర్పారపడుతున్నారు. ‘బెంగళూరును రెండు మూడు సంవత్సరాల్లో మార్చజాలం. చివరకు దేవుడు కూడా ఆ పని చేయలేడు.
పకడ్బందీ వ్యూహం రూపొందించి, అమలుపరచినప్పుడే పరిస్థితి మారుతుంది’ అని శివకుమార్ అన్నారు. రోడ్ల నిర్మాణంపై ఒక వర్క్‌షాప్‌ను ప్రారంభించిన అనంతరం శివకుమార్ ఆ విధంగా వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ అధ్వాన పరిస్థితులు, మెట్రో విస్తరణ జాప్యం, ప్రభుత్వ రంగ బస్సుల కొరత వంటి సమస్యలపై బెంగళూరు వాసులు, పట్టణ ప్లానర్లు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న సమయంలో శివకుమార్ ఆ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆశావహ రీతిలో మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రకటించినా, వాటి అమలు మందకొడిగా ఉంటున్నదని, ఒక పద్ధతిలో సాగడం లేదని విమర్శకులు వాదిస్తున్నారు.
బెంగళూరులో మౌలిక వసతుల మెరుగుదలలో ప్రభుత్వ పురోగతిని ఆర్థికవేత్త, ఆరిన్ క్యాపిటల్ చైర్మన్ మోహన్‌దాస్ పాయ్ ఉప ముఖ్యమంత్రి శివకుమార్ ప్రకటనను సవాల్ చేశారు.‘మంత్రి శివకుమార్! మీరు మా మంత్రి అయ్యి రెండు సంవత్సరాలు అయ్యాయి. మేము కొనియాడాం, దృఢమైన మంత్రిగా మిమ్మల్ని స్వాగతించాం. కానీ మా జీవితాలు మరింత అధ్వానంగా మారాయి’ అని పాయ్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండిపోయాయని, ఫుట్‌పాత్‌కు దారుణ స్థితిలో ఉన్నాయని, ప్రభుత్వ రవాణా సర్వీసులు చాలడం లేదని పాయ్ ఆరోపించారు.
తక్షణ చర్యలు అవసరమని, ఐదు వేల కొత్త విద్యుత్ బస్సులు వెంటనే కొనుగోలు చేయాలని, పరిశుద్ధమైన, నడకకు వీలైన నగరంగా మారాలని, మెట్రో విస్తరణ పని 24 గంటలూ సాగాలని పాయ్ కోరారు. ప్రతిపక్ష బిజెపి కూడా శివకుమార్ వ్యాఖ్యలను విమర్శించింది. కర్నాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అసమర్థమని బిజెపి ఆరోపించింది. “బ్రాండ్ బెంగళూరు’ చేస్తామని చెప్పిన మనిషి తుదకు దేవుడు కూడా దీనిని బాగు చేయలేడని అనడం అత్యంత దురదృష్టకరం, మరి ఎవరు చేయగలరు?’ అని బిజెపి నేత మోహన్ కృష్ణ ఒక ఆంగ్ల టివి చానెల్‌తో అన్నారు.