తడబాటు లేకుండా స్పష్టంగా 96 నిమిషాలు బడ్జెట్ ప్రసంగం
బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేసిన సభ్యులు
అభినందించిన సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్, ఇతర సభ్యులు
మన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం సరిగ్గా 96 నిమిషాలు పాటు సాగింది. స్వరాష్ట్రంలో గడిచిన ఏడు బడ్జెట్‌లలో ఇంత సమయం ఎన్నడూ లేదని లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. శాసనసభలో గురువారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు ప్రసంగాన్ని చాలా కూల్‌గా చదివారు. పదాలను స్పష్టంగా పలకడంతో పాటు, ప్రాధాన్య పథకాలు వచ్చినపుడు నొక్కి చదివారు. ఎక్కడా కూడా తడబడలేదు. అదే విధంగా సభలోని సభ్యులంతా బడ్జెట్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. మంత్రులు వారి శాఖల బడ్జెట్ వివరాలు వినగానే బల్లలు చరిచి, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి మంత్రి హావాభావాలను ముఖ్యమంత్రి కెసిఆర్ గమనించారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఆర్ధిక మంత్రి హరీశ్‌రావుకు సిఎం కెసిఆర్‌తో పాటు మంత్రులు కెటిఆర్, ఎర్రబెల్లిలు అభినందనలు తెలిపారు. సభ వాయిదా అనంతరం అధికారుల పార్టీ సభ్యులంతా మంత్రి హారీష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.