Saturday, November 23, 2024

బడ్జెట్ ఓటు బాట

- Advertisement -
- Advertisement -

కేంద్రంలో హ్యాట్రిక్ విజయం కోసం తపిస్తున్న ఎన్‌డిఎ ప్రభుత్వం తన పూర్తిస్థాయి ఆఖరి బడ్జెట్‌ను ఓటుబాట పట్టించింది. మధ్యతరగతిని మచ్చిక చేసుకోవడానికి ఆదాయం పన్నులో భారీ మినహాయింపును ప్రకటించి ఉద్యోగులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఎన్నికల వత్సరం2024 టార్గెట్‌గా రూపొందించిన పద్దుకు ‘సప్తర్షి’ పేరిట ఏడు ప్రాధామ్యానాలను నిర్దేశించుకున్నది. 2047నాటికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తి అవుతున్నది. ఆ విజన్ లక్ష సాధనే ధ్యేయంగా పథకాలకు రూపకల్పన చేసింది. అమృత్ కాలమ్‌లో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ యధావిధిగా తెలంగాణకు అన్యాయమే చేసింది.

న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల ఏడాది ముందు సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే మరో వైపు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పలు పథకాలను ప్రకటించడం ద్వారా వివిధ వర్గాల ఓటు బ్యాంకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. మరో విధంగా చెప్పాలంటే ఈ ప్రయత్నంలో నిర్మలా సీతారామన్ కత్తిమీద సాము చేశారు. ఫలితంగా ఇది ఏ వర్గానికీ తగిన న్యాయం చేయని బడ్జెట్‌గా మారిపోయింది. అమృత్‌కాల్‌లో ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్‌లో అన్ని వర్గాలకు ప్ర యోజనం చేకూర్చేందుకు ప్రయత్నించామని గంటా 26 నిమిషాల పాటు సా గిన బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ చెప్పుకొన్నారు. సప్తర్షి( సప్త రుషుల) రీతిలో బడ్జెట్‌లో ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. పైకి ఆర్థిక క్రమశిక్షణను పాటించినట్లుగా కనిపించినప్పటికీ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వివిధ వర్గాలకు ప్రయోజనం చేకూర్చే పథకాలకు కేటాయింపులు భారీగా పెంచడం ద్వారా ఆయా ఓటుబ్యాంకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

అన్నిటికన్నా ముఖ్యంగా మధ్యాదాయ వర్గాలు ముఖ్యంగా వేతన జీవులకు ఊరట కల్పిస్తూ ఆదాయం పన్ను రిబేటు పరిమితిని పెంచడంతో పాటుగా పన్ను శ్లాబ్ రేట్లనుకూడా ఆకర్షణీయంగా ఉండే విధంగా తగ్గించారు. ఫలితంగా ఇప్పుడు రూ.7 లక్షల వార్షికాదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇలా చేయడం ద్వారా పన్ను రిబేటు పెంపు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మధ్యాదాయ వర్గాలు, వేతన జీవులకు ఊరట కల్పించంతో పాటుగా వారి మనసులను గెలుచుకునే ప్రయత్నం చేశారు. మరో వైపు గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్‌లో మూలధన వ్యయాన్ని భారీగా పెంచారు. మూలధన వ్యయాన్ని పెంచడం వరసగా ఇది మూడో ఏడాది. ఈ ఏడాది బడ్జెట్‌లో మూలధన వ్యయాన్ని గత ఏడాదితో పోలిస్తే 33 శాతం అంటే రూ.10 లక్షల కోట్లకు పెంచారు. 2019 20 బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ.

2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం రోడ్లు, విద్యుత్ లాంటి కీలక రంగాల్లో మూలధన వ్యయాన్ని పెంచడంతో పాటుగా తక్కువ పన్ను రేట్లు, కార్మిక సంస్కరణలతో పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. మరో వైపు పేదల రాజకీయ మద్దతును సాధించడం కోసం పేదల కటుంబాలకు రకరకాల సబ్సిడీలు అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అదే ప్రయత్నం చేశారు.

వ్యవసాయ రంగానికి ఊతం

దేశ ఆర్థిక రంగానికి పట్టుగొమ్మ వ్యవసాయ రంగమేనని గుర్తించిన ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో పంటరుణాల లక్షాన్ని 11 శాతం పెంచి రూ.20 లక్షల కోట్లకు చేర్చుతున్నట్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. భారత్‌ను చిరుధాన్యాలకేంద్రంగా మారుస్తామని చెప్పారు. ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం ‘పిఎంప్రణామ్’ పేరిట కొత్త పథకాన్ని ప్రకటించారు. అలాగే యువ రైతులను ప్రోత్సహిస్తూ వ్యవసాయ రంగంలోని అంకుర సంస్థలకోసం ప్రత్యేక నిధిని ప్రకటించారు. వ్యవసాయంతో పాటుగా అనుబంధ రంగాలు, రైతుల సంక్షేమం కోసం పలు కీలక ప్రకటనలను ప్రకటించడం ద్వారా మోడీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న రైతులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే రైతులు పండించే పంటకు గిట్టబాటు ధర లభించేలా చూడడంతో పాటుగా మార్కెటింగ్ సదుపాయాలను మెరుగుపర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కారణంగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు రైతన్నలను ఎంతమేరకు సంతృప్తిపరుస్తాయో చూడాల్సి ఉంది.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన

అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పిఎంఎవై)కు కేటాయింపులను బడ్జెట్‌లో భారీగా 66 శాతం పెంచారు. గత ఏడాది బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.48 వేల కోట్లు కేటాయించగా, ఈ సారి ఈ మొత్తాన్ని రూ.79,000 కోట్లకు పైగా పెంచారు. వడ్డీ రేట్లు పెరిగిన వేళ గృహ కొనుగోలుదారులకు ఇది భారీ ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి. అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వేర్వేరుగా నిధులు సమకూరనున్నట్లు తెలిపారు. పిఎంఎవై పథకానికి భారీగా నిధులు కేటాయించడం ద్వారా రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ రంగాలతో బలోపేతానికి అవకాశం ఏర్పడింది. ప్రత్యక్షంగా నిర్మాణరంగ కార్మికులకు, పరోక్షంగా అనేక వ్యాపారాలకు ఉపాధి కల్పించడానికి వీలు కలుగుతుంది.

ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 38 వేల ఉద్యోగాల భర్తీ

రాబోయే మూడేళ్లలో 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులకు సేవలందించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఉన్న 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 38,000 మంది ఉపాధ్యాయులు, సహాయక సిబ్బంది నియామకాలు చేపడతామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనివల్ల ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన గిరిజనుల సామాజికఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్బంతో పాటుగా సురక్షితమైన గృహవసతి, తాగు పీరు. శానిటేషన్ వంటి మౌలిక సదుపాయాలు కూడా లభిస్తాయి. గిరిజనులు అత్యధికంగా ఉండే ఈశాన్య రాష్ట్రాలు. జార్ఖండ్, చత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాలకు ఈ పథకం ద్వారా ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. తద్వారా ఆయా వర్గాల ప్రజలను తమ వైపు మళ్లేలా చేసుకోవచ్చన్న అధికార బిజెపిఆలోచనలకు ఈ పథకం దోహదం చేస్తుంది. బిజెపి హిందుత్వ విధానాలకు గిరిజనులు ఎక్కువగా ఆకర్షితులు కాని నేపథ్యంలో ఇది వారిని ఆకట్టుకోవడానికి ఓ అస్తంగా ఉపయోగపడుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

మహిళలు, వృద్ధులకు శుభవార్త

మహిళలు, వృద్ధులకు కేంద్ర బడ్జెట్ మంచి వార్త చెప్పింది. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పేరిట కొత్త పథకాన్ని ప్రకటించింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్‌డ్ సేవింగ్స్ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ లభిస్తుంది.గరిస్ఠంగా రూ.2లక్షల దాకా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.అలాగే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీము కింద ప్రస్తుత గరిస్ఠ పరిమిత రూ.15 లక్షల వరకు మాత్రమే ఉండగా ఇప్పుడు దీన్ని రూ.30 లక్షల వరకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

కర్నాటకకు భారీగా నిధులు
ఇక ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్న అధికార బిజెపి యత్నాలకు ఊతమిచ్చే విధంగా ఆర్థిక మంత్రి ఆ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించారు. ముఖ్యంగా రాష్ట్రంలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకోసం బడ్జెట్‌లో రూ.5,300 కోట్లను కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News