న్యూఢిల్లీ: నేడు కేంద్ర బడ్జెట్ 2024ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఆమె తన ప్రసంగాన్ని ఆరంభిస్తూ ప్రభుత్వం పేదలు, మహిళలు, యువత, రైతులను దృష్టిలో పెట్లుకుని బడ్జెట్ ను రూపొందించిందని అన్నారు. ఈ తాత్కాలిక బడ్జెట్ లో ప్రభుత్వం తన పెట్టుబడి వ్యయం(క్యాపిటల్ ఎక్స్ పెండీచర్)ను ఏ మాత్రం మార్చకుండా యథాతథంగా రూ. 11.11 లక్షల కోట్లుగా ఉంచింది. ఐదేళ్లలో 20 లక్షల యువతకు కేంద్రం నైపుణ్య పథకాలు ప్రవేశపెట్టి శిక్షణ ఇవ్వనుందన్నారు. టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు 12 నెలల ఇంటర్న్ ఫిప్ అవకాశాలు కల్పించేనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్న్ షిప్ భత్యంగా నెలకు రూ.5000, వన్ టైమ్ అసిస్టెన్స్ కింద రూ. 6000 ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక కంపెనీలు ఇంటర్న్ షిప్ వ్యయంలో 12 శాతం భరించాల్సి ఉంటుంది.
బీహార్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కూడా దృష్టి సారిస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. బీహార్ లో విమానాశ్రయాలు, మెడికల్ కాలేజ్ లు, క్రీడల మౌలిక వసతులు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలను అభివృద్ధి పరుస్తామన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15000 కోట్లను కేటాయించారు.
మొబైల్ ఫోన్లపై, యాక్ససెరీలపై, ఛార్జెస్ పై 15 శాతం తగ్గింపు ఉంటుందన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించారు. ఉన్నత విద్య, దేశీయ సంస్థలకు రూ. 10 లక్ష ల కోట్లు కేటాయించారు. ఇకపోతే స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) లోటు 4.9 శాతం ఉండగలదన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతం ఆర్థిక లోటుకే చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను చట్టం, 1961 యొక్క సమగ్ర సమీక్షను కూడా ప్రకటించారు. ఇది సంక్షిప్తంగా, సులభంగా చదవడానికి , వ్యాజ్యాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడింది. “ఆరు నెలల్లో పూర్తవుతుంది” అని కూడా ఆమె అన్నారు.