Saturday, December 21, 2024

బడ్జెట్ వేళ కలకలం.. ఆర్థిక శాఖ సమాచారం విదేశాలకు లీక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి దేశ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సిద్ధమవుతున్న సమయంలో ఈ మంత్రిత్వశాఖలో గూఢచర్యం ఘటన కలకలం రేపుతోంది. ఆర్థిక శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తోన్న ఓ వ్యక్తి, అత్యంత రహస్య సమాచారాన్ని విదేశాలకు అందిస్తున్నట్టు ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్ గుర్తించి అరెస్టు చేసింది. గూఢచర్యం ఆరోపణలతో ఆర్థిక శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న సుమిత్‌ను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అతడు గత కొంతకాలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన కీలక సమాచారాన్ని విదేశాలకు అందిస్తున్నాడని, అందుకు బదులుగా భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటున్నాడని పోలీసులు వెల్లడించారు.

అధికారిక రహస్యాల చట్టం కింద అతడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సమాచారాన్ని చేరవేసేందుకు నిందితుడు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో దేశ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ సమయంలో ఈ గూఢచర్యం ఘటన బయటకు రావడం కలకలం రేపుతోంది. బడ్జెట్‌కు సంబంధించిన కీలక పత్రాలు లీకైతే దేశ మార్కెట్‌పై అది ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల కేంద్ర మంత్రిత్వశాఖల్లో తరచూ గూఢచర్య ఘటనలు వెలుగు చూస్తుండటం దేశ భద్రతకు సవాలుగా మారుతోంది. గత ఏడాది నవంబరులో గూఢచర్యం ఆరోపణలపై విదేశాంగ మంత్రిత్వ శాఖలో డ్రైవర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ వలపు వలలో చిక్కుకున్న ఆ డ్రైవర్, విదేశాంగ శాఖకు చెందిన పత్రాలు, సమాచారాన్ని చేరవేశాడని అందుకు బదులుగా డబ్బు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News