కరోనా వైరస్, లాక్‌డౌన్ దెబ్బకు విలవిల
ఆశించినస్దాయిలో ఆదరించని నగరవాసులు
రోజుకు రూ. 5 కోట్ల నష్టం చవిచూస్తున్న సంస్ద
ఆదుకోవాలని సిఎం కెసిఆర్‌ను కలిసిన ఎల్ అండ్ టీ ప్రతినిధులు
హైదరాబాద్: గ్రేటర్ నగర ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరువేస్తున్న మెట్రో కరోనా దెబ్బకు విలవిల్లాడుతోంది. ప్రయాణికుల సంఖ్య ఆశించిన స్దాయిలో లేకపోవడంతో భారీ నష్టాల్లో కూరుకుపోయింది. కోవిడ్ నిబంధనలు, లాక్‌డౌన్, వైరస్ విజృంభణతో ప్రయాణికులు తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడం వంటి కారణాలు మెట్రో రైలును భారీ నష్టాల్లోకి తీసుకెళ్లాయి. మొదటి దశ కరోనా ప్రభావంతో ఐదు నెలల డిపోలకే సర్వీసులు పరిమితం కాగా, మళ్లీ సెప్టెంబర్ నుంచి ప్రారంభించి కోలుకునే సమయంలో కరోనా సెకండ్ వేవ్ విరుచుకపడటంతో రెండోసారి లాక్‌డౌన్, రాత్రి కర్పూతో మెట్రో సేవలు నిలిపివేశారు. తాజాగా జూన్ రెండో వారంలో పూర్తి స్దాయిలో సర్వీసులు పట్టాలపై పరుగులు పెడుతున్న రోజుకు ప్రయాణికుల సంఖ్య లక్ష దాటడం లేదు. దీంతో వచ్చే ఆదాయానికంటే ఖర్చులు ఎక్కువ కావడంతో మెట్రో నడపడం సంస్దకు భారంగా మారింది.
దీంతో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. నగరంలో మెట్రో రైలు ప్రారంభమైన తొలి రోజు నుంచే విపరీతమైన ప్రజాదరణ పొందింది. రైళ్లనీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దీంతో తొలి ఏడాదిలో మంచి లాభాలనే సాధించింది.అయితే కరోనా రాకతో మెట్రో లాభాలు పట్టాలు తప్పాయి. ప్రతి రోజు సగటున రూ. 5 కోట్ల నష్టాన్ని చవిచూస్తోంది. ప్రతి రోజు కేవలం రూ. కోటి మాత్రమే ఆదాయం వస్తోందని నిర్వహకులు వెల్లడిస్తున్నారు. ఈనేపథ్యంలో ఇటీవల మెట్రో రైల్ నిర్వహకులైన ఎల్ అండ్ టీ అధికారులు సీఎం కెసిఆర్‌ను కలిశారు. నష్టాల్లో కూరుకపోయిన మెట్రో రైల్ ఆదుకోవాలని కోరారు. దీంతో రాయితీ ఒప్పందం ప్రకారం ఏం చేయవచ్చనే దానిపై నివేదిక ఇవ్వాలని సీఎం కార్యాలయ, మెట్రో రైల్ కార్యాలయాన్ని కేసిఆర్ కోరారు. ఈఏడాది ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో మెట్రో రైల్ రూ. 400 కోట్లు నష్టాన్ని చవిచూసిందట, ఈఆర్దిక సంవత్సరం చివరి నాటికి నష్టాలు రూ. 1500 కోట్లకు చేరుకుంటాయిన అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆదుకోవాలని మెట్రో రైల్ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా మెట్రో లాబాల బాటలో ప్రయానించేందుకు ఇప్పటికే పలు మార్గాలు అన్వేషించినట్లు ఆర్దికంగా చేయూతనిస్తే ప్రయాణికులు ఆకట్టుకునేలా చేసి మెట్రో జనసందడిగా మారేలా చేస్తామని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు.