సూర్యాపేట: మగదిక్కు లేని సంసారం…అందులో ముగ్గురు ఆడబిడ్డలు ఎలాగోలా ఇద్దరు బిడ్డల వివాహం చేసిన ఆ తల్లి మరో బిడ్డ వివాహం కోసం ఆర్థిక సహాయం కోసం ఎదురు చూడ సాగింది. అందరిలాగే ఆ తల్లి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని కలిసి పెళ్లి కార్డు ఇచ్చేందుకు వచ్చింది. బయటకు చెప్పుకోలేని బాధతో ఉన్న ఆ తల్లి కళ్లలో ఉన్న ఆవేదనను గమనించి వివారాలు అడిగి తెలుసుకున్న మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నేనున్నానంటూ బాధపడ వద్దని ఆడబిడ్డ వివాహనికి ఆర్థిక సహాయం అందజేసి ఆదుకున్నారు.
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కోమటికుంటకు చెందిన గాదె వనమ్మ భర్త మృతి చెందడంతో వంట మాస్టర్‌గా పనిచేస్తూ తన ముగ్గురు ఆడపిల్లలను సాదుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తుంది. ముగ్గురు ఆడబిడ్డల్లో చిన్న బిడ్డ వికలాంగురాలు కావడంతో మొదలగా వివాహం చేసి ఆ తర్వాత పెద్దమ్మాయికి వివాహం చేయడం జరిగింది. ప్రస్తుతం మరో అమ్మాయి ప్రతిభ వివాహం జూన్ 1న జరగాల్సి ఉండగా ఆర్థిక సహాయం కోసం మంత్రి జగదీష్ రెడ్డికి విన్నవించింది. దీంతో మంత్రి స్పందించి ఆర్థిక సహాయం అందజేసి వివాహానికి సహకరించారు. అడిగిన వెంటనే స్పందించి కుమార్తె వివాహనికి సహకరించిన మంత్రికి ఆ తల్లి ధన్యవాదాలు తెలుపుతూ జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొంది.