Wednesday, January 22, 2025

దేశంపై పాశ్చాత్య నమూనాలు

- Advertisement -
- Advertisement -

తమ 80వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) వలస వారసత్వాలు సంస్కరణలు, రాడికల్ పునర్నిర్మాణం కోసం మరోసారి ఇటీవల పిలుపునిచ్చాయి. గ్లోబల్ సౌత్ / ప్రపంచంలోని అత్యధిక దేశాలలోని పౌరసమాజ సంస్థల నుండి వాటికి వ్యతిరేకంగా నిరసనల నేపథ్యంలో ఈ పిలుపునిచ్చాయి. వీటి కారణంగానే గ్లోబల్ సౌత్‌లో ఎక్కువ భాగం నేడు అప్పులలో కూరుకుపోయామనే భావన బలపడుతుంది. ఈ సంస్థలలో ‘స్పష్టంగా’ సమస్యాత్మక నాయకత్వం ఉంది. అవి ఎల్లప్పుడూ అమెరికా, ఐరోపా దేశాల ప్రయోజనాల పట్లనే దృష్టి సారిస్తున్నాయి. 1949లో, అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ తన ‘పాయింట్ ఫోర్’ ప్రసంగంలో, అమెరికా కేంద్రీకృత ప్రపంచం వైపు చరిత్ర గమనాన్ని రూపొందించిన ‘అభివృద్ధి’ గురించిన ప్రభావవంతమైన దృష్టిని ప్రవేశపెట్టారు. ట్రూమాన్ ప్రసంగం గ్లోబల్ సౌత్‌ను ‘అభివృద్ధి చెందని’దిగా రూపొందించింది. ఈ దేశాలకు పారిశ్రామికీకరణ, ఆర్థిక విస్తరణ ద్వారా పాశ్చాత్య శైలి ఆధునికీకరణ అవసరమని సూచిస్తుంది. పెట్టుబడులు, సాంకేతిక మద్దతు ద్వారా ఈ దేశాలకు ‘అభివృద్ధి చెందడానికి‘ అమెరికా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఈ వాక్చాతుర్యం అభివృద్ధి నమూనా కోసం సైద్ధాంతిక పునాదిని స్థాపించింది. ఇది పారిశ్రామికంగా లేని, వనరులు సమృద్ధిగా ఉన్న, చారిత్రాత్మకంగా వలస రాజ్యాల దేశాలను ‘వెనుకబడినవి’గా పరిగణించింది. పాశ్చాత్య జోక్యం వారి పురోగతికి అవసరమైనదిగా చిత్రీకరించింది. 2020 లో ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌అండ్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ జాసన్ హికెల్ ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ గ్లోబల్ గవర్నెన్స్‌లో ‘ఆర్థిక వర్ణవివక్ష’ ని కొనసాగించే వలసవాద శకం సూత్రాలలో పాతుకుపోయిన సంస్థలుగా అభివర్ణించారు. ఈ రెండు సంస్థలు అసమానత, పేదరికం, ఆర్థికంగా ఆధారపడటానికి ఆజ్యంపోసే నయా -ఉదారవాద నిర్మాణ సర్దుబాటు కార్యక్రమాలతో బాధపడుతున్న గ్లోబల్ సౌత్‌ను అట్టడుగుకు నెట్టివేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రధానంగా అమెరికా, ఐరోపా దేశాలను అసమానంగా బలపరుస్తాయని ఆయన వాదించారు.ప్రొఫెసర్ హికెల్ ఈ సంస్థలలో ఓటింగ్ శక్తిలో అసమతుల్యత గురించి అంతర్ దృష్టిని ఇచ్చారు (ఉదా. బంగ్లాదేశ్ ఓటు కంటే 41 రెట్లు అధికంగా ఉన్న బ్రిటిష్ ఓటు). బ్రెట్టన్ వుడ్ కాన్ఫరెన్స్‌లో 1944లో జన్మించిన ఈ సంస్థలను ప్రధానంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో పునర్నిర్మాణానికి సహాయం చేయడానికి రూపొందించారు. ఆర్థిక వ్యవస్థలను స్థిరీకరించేందుకు, అభివృద్ధిని వేగవంతం చేస్తామని సంస్థలు ప్రతిజ్ఞ చేశాయి. పశ్చిమ ఐరోపాకు విదేశీ నిధులను అందించడానికి అమెరికా స్థాపించిన మార్షల్ ప్లాన్ నుండి పోటీ కారణంగా నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు దృష్టి మళ్ళింది. ఆ తర్వాత భారత దేశం, గ్లోబల్ సౌత్‌లో చాలా వరకు, ఈ ఆర్థిక సంస్థలు నయా ఉదారవాద విధానాలను అమలు చేసే సాధనాలుగా పరిగణనపొందాయి. అయితే ఈ రెండు ప్రపంచ ఆర్థిక సంస్థల నుండి మద్దతు పొందిన దేశాలు, సమాజాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడం, ఆర్ధికంగా స్వయం సమృద్ధి సాధించలేకపోవడం సర్వత్రా కనిపిస్తున్నది. భారతదేశ గ్రామీణ ప్రాంతాల నుండి ఆఫ్రికాలోని సంఘర్షణ ప్రాంతాల వరకు ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ప్రభావం గల ఖండాలు, ఆర్థిక వ్యవస్థలు, సిద్ధాంతాలు విస్తరించి ఉన్నాయి.1990వ దశకం ప్రారంభంలో భారత ప్రభుత్వం ఐఎంఎఫ్ రుణ పరిస్థితుల ద్వారా ఒత్తిడికి గురైంది. నిర్మాణాత్మక సర్దుబాటు కార్యక్రమాలను స్వీకరించింది. మనం నేడు ఉదార ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన ఘనులుగా భావిస్తున్న పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ వంటి వారు స్వతహాగా ఉదారవాద విధానాలపట్ల నమ్మకం, అవగాహన ఉన్నవారు కాదని, ఈ రెండు సంస్థల షరతులకు తలవంచి, తమ ద్రవ్య సర్దుబాటుకోసం విచ్చలవిడిగా రుణాలు తీసుకోవడం ప్రారంభించిన వారేనని ఈ సందర్భంగా గమనించాలి. సబ్సిడీలను తగ్గించడం, మార్కెట్లను నియంత్రించడం, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడంలను ఆధునీకరణకు మార్గాలుగా వీరు చిత్రీకరించారు. కానీ మహారాష్ట్రలోని రైతులకు, ‘ఆధునీకరణ’ అంటే వారు అకస్మాత్తుగా కార్పొరేట్ అగ్రి బిజినెస్‌లతో పోటీపడవలసి వచ్చింది. తరచుగా అదానీ, అంబానీ వంటి శక్తివంతమైన భారతీయ కార్పొరేట్‌ల ముందు తలవంచాల్సి వచ్చింది.
భారతదేశంలో, అనేక ప్రపంచ బ్యాంకు ఆర్థిక ప్రాజెక్టులు నీరు, ఇంధనం కార్యక్రమాలను సులభతరం చేయడానికి ప్రజలను స్థానభ్రంశం చేశాయి. తరచుగా ప్రభావిత జనాభా జీవనోపాధిని విస్మరిస్తారు. పర్యావరణ సమస్యలపట్ల ప్రపంచ బ్యాంకు విధానంలో కూడా ఈ వలస వారసత్వం కనిపిస్తుంది. అటవీ నిర్మూలన, భూమి క్షీణత, జీవవైవిధ్య నష్టానికి దోహదపడే శిలాజ ఇంధన ప్రాజెక్టులు, అగ్రిబిజినెస్ వెంచర్‌లకు నిధులు సమకూర్చినందుకు విమర్శలను ఎదుర్కొంది. కొన్ని ఒత్తిడుల కారణంగా ఇటీవల కాలంలో క్లైమేట్ ఫైనాన్సింగ్ పునరుత్పాదక ఇంధనం, విపత్తు తట్టుకునే ఇంధనంపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ, అంతర్లీన ఆర్థిక నమూనా కార్బన్ వాణిజ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి మార్కెట్ ఆధారిత పరిష్కారాలకు ప్రాధాన్యతనిస్తూనే ఉంది. ప్రపంచ బ్యాంకు షరతులపై రుణాలు ఇవ్వడం ద్వారా ప్రపంచ పర్యావరణ సంక్షోభాలను పరిష్కరిస్తున్నట్లు పేర్కొంది. ఇది తరచుగా మార్కెట్‌కు ప్రయోజనం చేకూర్చే నమూనాలను విధించడం ద్వారా పర్యావరణ హానిని పునరావృతం చేయడం, సామాజిక అసమానతలను తీవ్రతరం చేయడం ద్వారా కూడా దోహదపడుతుంది. నేడు సంపన్న దేశాలైన అమెరికా, ఐరోపా ఆర్ధికంగా అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. వారు అనుసరిస్తున్న ఆర్ధిక, అభివృద్ధి నమూనాలు ప్రశ్నార్ధకం అవుతున్నాయి. కానీ, అటువంటి నమూనాలను రుణాలకు షరతుల పేరుతో తమ ప్రయోజనాలకు అనువుగా ఉండే విధంగా గ్లోబల్ సౌత్ దేశాలపై రుద్దే ప్రయత్నం ఈరెండు సంస్థలు చేస్తున్నాయి. ఈ రెండు సంస్థల నుండి రుణాలు తీసుకోవడం ప్రారంభమైన తర్వాతనే భారత దేశంలో ఆర్ధిక అసమానతలు గణనీయంగా పెరుగుతూ ఉండటం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, గ్రామీణ- పట్టణ అంతరాలు పెరగడం, వ్యవసాయ- గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలు సంక్షోభాలలో చిక్కుకోవడాన్ని మనం చూస్తున్నాము. 80వ వార్షికోత్సవంలో ప్రవేశిస్తున్న ఈ రెండు సంస్థలు ప్రతిపాదించే నమూనాలు పర్యావరణానికి హానికరమైనవి. పైగా, దోపిడీ, హింసాత్మక ప్రవృత్తికి దోహదకారి అయినవని గమనించాలి. ఈ సంస్థలు స్థానికంగా కలిగించే వృద్ధి కంటే పాశ్చాత్య ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తాయి. గ్లోబల్ నార్త్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే ప్రపంచ సోపానక్రమాన్ని బలోపేతం చేస్తాయి. బహుళజాతి సంస్థలకు, సంపన్న దేశాలకు సేవలందించే ఒక ఎజెండాను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ బ్యాంకు అనేక దేశాలను శాశ్వతమైన పరాధీనత, రుణ ఉచ్చులలో ఉంచే ఆర్థిక వ్యవస్థను శాశ్వతం చేసింది. ప్రజలు, సమాజాలు, ఆర్థిక వ్యవస్థలు, ప్రకృతిపై వారు విధ్వంసం చేసినప్పటికీ, ప్రపంచ బ్యాంక్, ఐఎఫ్‌ఎఫ్ ఎటువంటి జవాబుదారీతనం వహించడం లేదు. వారి సంబంధిత వ్యవస్థాపక చార్టర్‌లు వారికి చట్టపరమైన, వస్తుపరమైన జవాబుదారీతనం నుండి పూర్తి నిరోధక శక్తిని అందిస్తాయి. ఆచరణలో అవి అక్షరాలా చట్టానికి అతీతమైనవి. సామాజిక రక్షణ విధానాలు వాటి విధానాలు, కార్యకలాపాలను ఏ అర్థవంతమైన పద్ధతిలో మార్చలేవు. ప్రజాస్వామిక, వికేంద్రీకృత ఆర్థిక పాలన సూత్రాలపై స్థాపించిన కొత్త సంస్థల ద్వారా, సమానత్వం, సుస్థిరత, అన్ని దేశాల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, ఎంపిక చేసిన కొన్నింటికి మాత్రమే కాకుండా, మనకు ప్రాథమిక నమూనా మార్పు అవసరం. ఈ కొత్త సంస్థలు నిజంగా సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక, సామాజిక అభద్రత భారాన్ని భరించే వారి అన్ని స్వరాలు వినిపించేలా ఉండాలి. ప్రపంచంలోని అత్యంత పేద, అత్యంత బలహీనమైన జనాభా అవసరాలను తీర్చడానికి విధానాలు రూపొందించాలి. వారు మానవ హక్కులలో పొందుపరిచిన అభివృద్ధి విధానాలను ప్రోత్సహించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. భవిష్యత్ తరాలవారు గౌరవంగా, సామరస్యంగా, శాంతితో జీవించే సామర్థ్యాలను నిర్ధారించాలి. కొత్త సంస్థలు నిజమైన రుణ ఉపశమన కార్యక్రమాలకు అత్యవసరంగా మద్దతు ఇవ్వాలి. రుణాలపై ఆధారపడే విషచక్రాల నుండి దేశాలు విడిపోవడానికి సహాయపడే అనుకూలమైన ఫైనాన్సింగ్‌ను అందించాలి.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News