Sunday, December 22, 2024

ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హత్య ‘కుట్ర’ భగ్నం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జె) నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు అమెరికాలో కుట్ర జరిగిందంటూ పశ్చిమ దేశాల పత్రికలు వెలువరించాయి. ఆ కుట్రను తాము భగ్నం చేశామని అగ్రరాజ్యం వెల్లడించినట్టు వాటిల్లో తెలిపాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారులు భారత ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకొచ్చినట్టు సమాచారం. దీంతో ఈ వార్తలు చర్చనీయాంశంగా మారాయి.

ఈ క్రమం లోనే భారత విదేశాంగశాఖ దీనిపై పరోక్షంగా స్పందించింది. అమెరికా ఇచ్చిన సమాచారాన్ని తాము పరిశీలిస్తున్నట్టు తెలిపింది. పన్నూను చంపేందుకు అమెరికాలోనే చేసిన ప్రయత్నాలను తాము భగ్నం చేశామని అమెరికా వెల్లడించినట్టు ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. “ ఈ అంశాన్ని మేం తీవ్రంగా పరిగణించాం. భారత ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్ద దీన్ని ప్రస్తావించగా, వారు ఆశ్చర్యంతోపాటు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై న్యూఢిల్లీ తదుపరి దర్యాప్తు చేస్తుందని మాకు అర్థమైంది.

ఈ కుట్రకు బాధ్యులైన వారికి శిక్ష పడాలని మేం భావిస్తున్నాం” అని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి ఆండ్రీన్ వాట్సన్ చెప్పినట్టు ఆ కథనం పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటనపై అమెరికా ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తున్నట్టు అగ్రరాజ్య అదికారిక వర్గాలు వెల్లడించాయి. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి ఈ కథనాలపై స్పందించారు. “ భారత్ అమెరికా భద్రతా సహకారంపై ఇరు దేశాల మధ్య ఇటీవల కొన్ని చర్చలు జరిగాయి. వీటిలో భాగంగా వ్యవస్థీకృత నేరగాళ్లు, ఉగ్రవాదులు, వారి మధ్య బంధాలు, తదితర అంశాల గురించి అమెరికా అధికారులు కొంత సమాచారం ఇచ్చారు.

ఆ సమాచార తీవ్రతను భారత్ గుర్తించింది. అది రెండు దేశాల భద్రతా ప్రయోజనాలకు ఆందోళనకరం. అమెరికా పంచుకున్న ఆ సమాచారాన్ని సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నాయి” అని బాగ్చి వెల్లడించారు. సిఖ్ ఫర్ జస్టిస్ అనే వేర్పాటువాద సంస్థను భారత్ 2019 లోనే నిషేధించింది. 2007లో ఈ సంస్థను స్థాపించగా, వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ పన్నూ కూడా ఒకడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు కెనడాలో ఉంటున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News