Monday, December 2, 2024

బతికించే కళ

- Advertisement -
- Advertisement -

మనిషి బతకడానికి ఏం కావాలి? కూడు, గూడు, గుడ్డ! అంతేనా? కాదు.. కథలు, కళలు కూడా కావాలి! తిండి కడుపాకలి తీర్చిస్తే కళ మనసు ఆకలి తీరుస్తుంది. కళ ఓ నిత్యావసర సరుకు. సాహిత్యం, సంగీతం, చిత్రం, శిల్పం, నాటకం, సినిమా.. మరేదైనా సరే మానవ జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. బుర్రకు ఏడురంగుల రెక్కలు మొలిపించి అద్భుత లోకాల్లోకి తీసుకెళ్తుంది. కళ ప్రపంచ భాష. ఇంపుగా దిద్దిన కాసిని రంగులు, ఓ జింక బొమ్మ, ఓ పిల్లంగోవి రాగం, హత్తుకునే ఓ అనాథ ఏనుగుపిల్ల డాక్యుమెంటరీ ఏడు ఖండాల్లోని మానవాళిని ఏకం చేస్తుంది.
‘నవలలు ఆయా దేశాల అనధికార చరిత్రలు’ అంటాడు ఫ్రెంచి రచయిత బాల్జాక్. ఇది కళలకు మరింతగా నప్పేమాట. నవలలు అనధికార చరిత్రలైతే కళలు సాధికార చరిత్రలు.ఆ మాటకొస్తే నవల కూడా అక్షరాలతో అందంగా పేర్చిన కళే! కానీ ఆర్ట్ అంటే చాలామందికి చప్పున గుర్తొచ్చేది ఓ పెయింటింగ్. లేకపోతే ఓ శిల్పం. కలంకారీ, బిద్రీ, కొండపల్లి కొయ్యబొమ్మలు వంటి హస్తకళలూ మనసులో మెదలొచ్చు. ఇలాంటి విజువల్ ఆర్ట్సే ఎందుకు గుర్తొస్తాయి? కల్చరల్ ఆంత్రపాలజిస్టులు, ఈస్తటీషియన్లు, న్యూరాలజిస్టులు దీనికేవో కారణాలు చెప్తారు గాని అంత లోతుల్లోకి వెళ్లక్కర్లేదు. కళతో మనిషికున్నది అనుదిన పేగుబంధం. ఆదిమానవుడి నుంచి నేటి డిజిటల్ ఆర్టిస్ట్ వరకూ కళ మనిషి రక్తమాంసాల్లో జీర్ణించుకుపోయింది. మనిషి కనీస అవసరాల నుంచి పుట్టుకొచ్చింది కళ. ఆదిమానవుడు, ఆదిమానవి తమకు వేటలో ఎద్దో, జింకో, మరొకటో దొరకాలన్న ఆశతో గుహగోడలపై జంతుకొవ్వు, ఎర్రమన్ను కలిపి వాటికి రూపమిచ్చారు. ఆ బొమ్మ వాళ్ల జీవనాధారానికి ప్రతీక. సాధించాల్సిన లక్ష్యం. ఆ ప్రయత్నంలో ప్రాణాలే పోవచ్చు. బలైన మనిషి బొమ్మ కూడా గోడపైకి ఎక్కుతుంది. అదొక పాఠం, చరిత్ర. విప్పారిన వేటగాడి చేతిగుర్తు తర్వాతి తరాలకు అభయ హస్తం. కళ గుహను దాటి వీధిన పడ్డానికి యుగాలు పట్టాయి. ఉద్దేశం మారలేదు. ముంగిట్లోని రంగవల్లి, అరిచేతిపై పండిన గోరింట డిజైన్, గోడమీది ఫ్రేములో ఒదిగిన పచ్చని అడవి, దిగంతరేఖపై పొడుస్తున్న ఎర్రపొద్దు, షోకేస్‌లోని గుర్రబ్బొమ్మ, వంటింట్లోని చిలకముక్కు కత్తిపీట, రవికమీది నెమలిబొమ్మ… అన్నిటి ఉద్దేశం ఒకటే. అవి మనకు దక్కాలి, మురిపించాలి. చేజారిన ప్రకృతిపై నాస్టాల్జియా అవన్నీ. వాటి ఆవాహన ఉబుసుపోని వ్యవహారం కాదు, కళాసృజనకు స్ఫూర్తి. సామూహిక సంభాషణ. కళ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. ఓ కళాఖండాన్ని చూసినప్పుడు మెదడులో డోపమీన్ హార్మోన్ మోతాదు పెరిగి, పులకించిపోతామని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ న్యూరోబయాలజిస్ట్ ప్రొఫెసర్ సెమిర్ జెకీ తేల్చాడు.
సాహిత్యంలాగే లలితకళలు కూడా ఆహ్లాదం కలిగిస్తాయి. ఆత్మపై పేరుకుపోయిన మురికిని కడిగేసి చూపుకు, జీవితానికి సరికొత్త అర్థం ప్రసాదిస్తాయి. సామాజిక మార్పుకు తమవంతు దోహదం చేసి చరిత్రకు అద్దం పడతాయి. ఫ్రెంచి విప్లవం నుంచి మెక్సికన్ విప్లవం వరకూ ఎంతో కళాసామగ్రి మందుగుండుగా మారింది. “ఇళ్ల డెకరేషన్ కోసం పెయింటింగులు వేయొద్దు. శత్రువును దెబ్బకొట్టడానికి, వాడి దెబ్బ నుంచి కాచుకోడానికి పనికొచ్చే ఆయుధం ఆర్ట్‌” అంటాడు పికాసో. శిల్పవాస్తుకళల ప్రసక్తిలేని గ్రీక్, రోమన్ చరిత్రలు డొల్లలు. డావిన్సీ, మైకెలాంజెలో, రాఫేల్ బొమ్మల్లేని పునరుజ్జీవన యుగం ఊహకందనిది. బౌద్ధజైన శిల్పం, గుప్తచోళుల ఆలయం, ఇస్లామిక్ వాస్తు లేకుండా భారతీయ చరిత్ర లేదు.
మనిషి నడిచొచ్చిన దారిని అద్భుతమైన ఊహలతో చిత్రిక పట్టిన కళ ఇప్పుడు తడబడుతోందా? అన్ని జీవనరంగాలు కాలుష్యంతో లుకలుకలాడుతున్నప్పుడు కళ అందుకు అతీతంగా ఉండడం అసాధ్యం. అన్ని విలువలను శాసిస్తున్న మార్కెట్, కళను కూడా శాసిస్తూ సామాన్యులకు దాన్నొక అందరాని ద్రాక్షగా మార్చింది. అమరకళావేత్త విన్సెంట్ వ్యాన్గో తన పెయింటింగులు అమ్ముడుపోక అడుక్కుతిన్నా, మ్యూజియం గోడకు టేపు అంటించిన రియల్ అరటిపండును 52 కోట్ల రూపాయలకు కొనుక్కొన్నా అన్నీ మానవ పరిహాసాలే.
ఇకపై మరో అప్సరసల అజంతా, మరో ‘క్రియేషన్ ఆఫ్ ఆడమ్’ సిస్టైన్ చాపెల్, మరో సమ్మోహన మోనాలిసా, మరో సాగదీసిన వయ్యారాల రామప్ప రూపుదిద్దుకోకపోవచ్చు. మరో బృహదీశ్వరాలయానికి, మరో తాజ్ మహల్‌కు కూలీలు రాళ్లెత్తాల్సిన అవసరముండకపోవచ్చు. ఉన్నవి పడగొట్టి యంత్రాలతో చిత్రికపట్టడం మాత్రమే ఉండొచ్చు. ఎంత హైఎండ్ స్కల్ప్టింగ్ మెషిన్ అయినా హలెబీడు జక్కన్న ఉలికి సాటిరాదు. యంత్రం సౌలభ్యమే తప్ప సృజనకాదు. ఆత్మలేని యంత్రం మనిషిని మించిపోగలదా? కానీ సర్వం యంత్రమయమైన నేటి ప్రపంచంలో మనిషి కళాసృజనకు భరోసా ఉంటుందా? ఉండితీరుతుందని ఆటుపోట్ల కళాచరిత్రే చెబుతోంది. ‘చీకటి చీకటి’ అని తిట్టుకున్న మధ్యయుగాల నుంచే అపురూప ‘రినెసాన్స్’ కళాపూర్ణోదయమైంది.
వర్చువల్ రియాలిటీ నుంచి మళ్లీ రియాలిటీలో అడుగు పెట్టడానికి మనిషి పురుటినొప్పులు మెల్లగా మొదలవుతున్నాయి. గుహలోని ఎర్రమట్టిముద్ద నుంచి, డిజిటల్ పెయింట్ టూల్ వరకూ అన్నీ మనిషి సృష్టించుకున్నవే. మానవ ప్రస్థానంలో వెలుగుకంటే చీకటే ఎక్కువ. ఎప్పటికప్పుడు దాన్ని వెలుగురవ్వల కత్తితో ఛేదిస్తూ సాగుతున్న మనిషి తప్పకుండా దారిలోపడతాడు. మనిషికి తన అవసరాలేంటో తెలుసు. కష్టసాధ్యమే అయినా అసాధ్యంకాదు.

-పి. మోహన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News