మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక నిర్ణయం కేవలం రేషన్ కార్డు దారులకే కాకుండా యావత్ రాష్ట్రానికి మేలు చేకూరుస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్నబియ్యం రేషన్ పంపిణీ కొనసాగుతోంది. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రైవేటు రైస్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గత పదమూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం ధరలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సన్నబియ్యం పంపిణీ వల్ల బియ్యం వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. మార్కెట్లో బియ్యం భారీగా అమ్మకాలు తగ్గాయి. దాంతో వ్యాపారస్తులు కిలోకు రూ.5 చొప్పున తగ్గించి విక్రయించే పరిస్థితులు నెలకొన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 90,42,196 మంది కార్డుదారులు ఉండగా ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు 70,17,486 మంది కార్డుదారులు సన్నబియ్యం తీసుకున్నారు. గడిచిన 12 రోజుల్లో 1.27 కోట్ల మంది లబ్ధిదారులు సన్నబియ్యం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 90.42 లక్షల రేషన్ కార్డులుండగా ఇప్పటివరకు ఏప్రిల్ కోటా కింద 42 లక్షల రేషన్ కార్డులపై పేదలు సన్న బియ్యం తీసుకున్నారు. ప్రతి నెల లబ్ధిదారులు సగటున 16 లక్షల క్వింటా ళ్ల బియ్యం రేషన్ షాపుల నుంచి తీసుకుంటుండగా ఈ నెలలో 8.75 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని వినియోగదారులకు పంపిణీ చేశారు. రాష్ట్రంలో మొత్తం 17,311 రేషన్ షాపులు ఉండగా 8,899 షాపుల్లో సన్నబియ్యం పంపిణీ కొనసాగుతున్నది. అయితే పలు చోట్ల రవాణా, సాంకేతిక సమస్యలతో పంపిణీ నెమ్మదిగా సాగుతున్నా ఈ నెల 15వరకు అధిగమిస్తామని అధికారులు వెల్లడించారు.
రేషన్ షాపుల వద్ద క్యూలు
సన్నబియ్యం తీసుకునేందుకు తెల్ల రేషన్ కార్డు దారులు దుకాణాలకు క్యూకడుతున్నారు. మార్చి నెలలో తొలి 12 రోజుల్లో 52 శాతం కార్డుదారులు మాత్రమే బియ్యం తీసుకోగా తాజాగా ఏప్రిల్‌లో అది 77 శాతానికి చేరడం గమనార్హం. ఇప్పటివరకు అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 4,77,686 కార్డుదారులు, రంగారెడ్డి జిల్లాలో 4,65,772, హైదరాబాద్ జిల్లాలో 3,87,047 కార్డుదారులు రేషన్ తీసుకున్నారు. గతంలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యంకన్నా సన్నబియ్యం చాలా బాగున్నాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉగాదిన మొదలైన సన్నబియ్యం
మార్చి 30వ తేదీ ఉగాది పండుగ రోజున సన్న బియ్యం పథకాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రేషన్ కార్డు కలిగిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున పంపిణీ జరుగుతున్నది. హైదరాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. అయినప్పటికీ హైదరాబాద్ జిల్లా ప్రజలు ఎంతో ఆసక్తిగా ప్రభుత్వం ఇచ్చే సన్నబియ్యం తీసుకునేందుకు శివారు ప్రాంతాల్లోకి వెళ్లి తమ కోటాను పొందారు.
షాపులకు సన్నబియ్యం బ్రేక్
ఎప్పుడు జనంతో సందడిగా కనిపించే ప్రైవేట్ రైస్ షాపుల వద్ద రద్దీ తగ్గి కొనుగోళ్లు మందగించాయి. బియ్యం దుకాణాలముందుకు ఎవరైనా వెళ్లితే తాము నాణ్యమైన రైసుఅందుబాటులోని ధరలకే విక్రయిస్తున్నామని వ్యాపారస్తులు గొప్పలుచెప్పుకునే పరిస్థితి నెలకొంది. ఇష్టానుసారంగా సన్నబియ్యం అమ్మకం చేసిన వ్యాపారులకు సన్నబియ్యం పథకం కాస్తా వారి అక్రమ ఆదాయానికి గండి కొట్టింది.
అయోమయంలో దళారులు
గత కొన్ని సంవత్సరాలుగా రేషన్ బియ్యం(పీడీఎస్ రైస్) తో పెద్ద మొత్తంలోవ్యాపారం చేసిన దళారులు అయోమయంలో పడ్డారు. మార్చి నెలాఖరు దాకా పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే దొడ్డుబియ్యం కిలో రూ.10 వరకు కొనుగోలు చేసి బీరు తయారీ కంపెనీలకు, ఇతర రాష్ట్రాలకు కిలోకు రూ.25లకు అమ్మేవారు. రాజకీయ అండదండలతో కొంత మంది రేషన్‌డీలర్లు, స్థానిక పోలీసులు కాకినాడ పోర్టుకుతరలించిన ఉదంతాలు కూడా లేకపోలేదు.