Monday, January 20, 2025

నాటోలో ఫిన్‌లాండ్

- Advertisement -
- Advertisement -

రష్యాతో 1340 కి.మీ సరిహద్దు గల ఫిన్‌లాండ్ నాటో కూటమిలో చేరడం ఎంత మాత్రం హర్షించదగిన పరిణామం కాదు. ఏడాదికి మించి సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగడానికే ఇది దోహదం చేస్తుంది. యుద్ధం నుంచి ఉత్పన్నమైన సమస్యలు మరింత పేట్రేగడానికి దారి తీస్తుంది. ప్రపంచ శాంతికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది. ఫిన్‌లాండ్ చేరికతో నాటో దేశాల సంఖ్య 31కి చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడితో తలెత్తిన అశాంతిని తొలగించడానికి, చర్చల ద్వారా యుద్ధానికి పరిష్కారాన్ని సాధించడానికి ప్రయత్నించి వుండవలసిన అమెరికా అందుకు విరుద్ధంగా ఉక్రెయిన్‌కు విశేషంగా ఆయుధాలను సరఫరా చేస్తూ ఆ అగ్గిని రాజేస్తూనే వుంది. ఉక్రెయిన్‌పై దాడి చేసిన రష్యా తనను కూడా వదిలిపెట్టదని భయపడిన ఫిన్‌లాండ్ నాటో కూటమిలో చేరడానికి దాదాపు ఏడాది క్రితం దరఖాస్తు పెట్టుకొన్నది. ఆ ప్రక్రియ ఇప్పటికి ముగింపుకి చేరుకొన్నది. మొన్న మంగళవారం నాడు ఫిన్‌లాండ్ అధికారికంగా నాటోలో చేరింది. నాటోలో ఆహ్వానిత దేశ హోదాలో వున్న స్వీడన్ కూడా త్వరలోనే పూర్తి స్థాయి సభ్యత్వాన్ని స్వీకరిస్తుందని భావిస్తున్నారు. నాటో సభ్య దేశాలు తమ స్థూల జాతీయోత్పత్తిలో 2% వరకు ఆ కూటమి రక్షణ బడ్జెట్‌కు సమర్పించాల్సి వుంటుంది.

2014లో జరిగిన వేల్స్ శిఖరాగ్ర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ప్రపంచంలోని అతి పెద్ద సైనిక కూటమి అయిన నాటోలో ఒక్క అమెరికాకే 1.35 మిలియన్ల మంది సైనికులున్నారు. 4,47,000 మందితో ఆ తర్వాతి స్థానాన్ని టర్కీ ఆక్రమించింది. పరస్పర విరుద్ధమైన పెట్టుబడిదారీ, కమ్యూనిస్టు కూటముల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితే అవి పోటాపోటీగా ఆయుధ సంపత్తిని, సైన్యాన్ని పెంచుకొనేందుకు దోహదపడుతున్నది. అణ్వాయుధాలను సైతం సమకూర్చుకోడానికి దారి తీసింది. ఆయుధ పోటీని తగ్గించుకోవాలనే సంకల్పాన్ని ప్రకటించుకొన్నప్పటికీ ఆ వైపుగా కృషి నత్తనడకగానే సాగుతున్నది. ఉక్రెయిన్ యుద్ధం, ఫిన్‌లాండ్ నాటో కూటమిలో చేరడం వంటి పరిణామాలు అమెరికాకు రష్యా, చైనాలకు మధ్య దూరాన్ని మరింతగా పెంచడం ఖాయం. అణు యుద్ధాన్ని కూడా చేరువ చేస్తే ఆశ్చర్యపోవలసిన అవసరం వుండదు. వాస్తవానికి సోవియట్ యూనియన్‌ను ఎదుర్కోడానికి నాటో కూటమి ఆవిర్భవించింది. 1949లో ఏర్పాటైన నాటోకి దీటుగా 1955లో సోవియట్ తరపున ఏర్పడిన వార్సా కూటమి 1991లో అంతమైంది.

కాని నాటో కూటమి మాత్రం ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత కూడా కొనసాగుతూ వుండడమే ప్రపంచానికి ప్రమాదకరమైన అంశం. ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యాతో బలాబలాలను తేల్చుకోడానికి అమెరికా ఉపయోగించుకొంటున్న తీరు, కొత్త సభ్య దేశాల చేరికతో నాటో బలపడుతూ వుండడం ఎంత మాత్రం మంచి పరిణామాలు కావు. ఫిన్‌లాండ్ దరఖాస్తును ఆమోదించిన సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ మాట్లాడుతూ ఇందుకు మనం పుతిన్‌కు కృతజ్ఞతలు చెప్పాలి అని ప్రకటించారు. అంటే మూడో ప్రపంచ యుద్ధం వైపు ప్రపంచాన్ని నడిపించడానికి దాని నుంచి తాను లబ్ధి పొందడానికి అమెరికా ఆరాటపడుతున్నదని భావించాలి. వాస్తవానికి ఫిన్‌లాండ్ ఆత్మ రక్షణ కోసం నాటోలో చేరడం పట్ల అమెరికా ఈ విధంగా హర్షం ప్రకటించి వుండకూడదు. నాటో సభ్య దేశాలపై ఎవరు దండెత్తినా ఆ కూటమిలోని మిగతా సభ్యదేశాలన్నీ దానిని తమపై జరిగిన దాడిగానే చూడాలని నాటో ఒప్పందంలోని 5వ అంగీకారం శపథం చేస్తున్నది. ఈ రక్షణ కోసమే ఫిన్‌లాండ్ ఇప్పుడు నాటోలో చేరింది. అమెరికా తనపై దాడికి ఉక్రెయిన్‌ను ఉపయోగించుకోచూస్తున్నదనే కారణం చూపించి రష్యా ఉక్రెయిన్ మీదికి సైన్యాన్ని పంపించింది.

వార్సాతో పాటు నాటోను కూడా రద్దు చేసి వుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. ఫిన్‌లాండ్ నాటోలో చేరడం వల్ల ఉక్రెయిన్ యుద్ధం విస్తరించుకోడానికి అవకాశాలను విశేషంగా పెంచిందని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు చేసిన ప్రకటన వాస్తవానికి దగ్గరగా వుంది. నార్డిక్ దేశాలైన ఫిన్‌లాండ్, స్వీడన్‌లు ఏ సైనిక కూటమికి చెందకుండా వుండాలని తీసుకొన్న నిర్ణయానికి విఘాతం కలగడం ప్రపంచ శాంతికి జరుగుతున్న ముప్పునే సూచిస్తున్నది. ఇందుకు రష్యాయే బాధ్యత వహించవలసి వుంటుందని అధిక సంఖ్యాక ప్రపంచ దేశాలు అభిప్రాయపడుతున్నప్పటికీ పరోక్షంగా అమెరికా కూడా బాధ్యురాలేనని గుర్తించక తప్పదు. నాటో విస్తరణ రష్యా , చైనాలను మరింత చేరువ చేసే అవకాశాలున్నాయి. యుద్ధ పిపాసను అరికట్టడానికి ఐక్యరాజ్య సమితికి తగిన బలగాలు లేకపోడం అమెరికా ఏకైక అగ్రరాజ్యమైన తర్వాత ఘర్షణ వాతావరణం పెరగడం, దాని ఆంక్షల కోరలు పదునెక్కడం అంతర్జాతీయ సమాజాన్ని మరింత భయపెడుతున్న అంశాలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News