బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోట్ చేసిన సినీ
ప్రముఖులపై కేసు నమోదు దగ్గుబాటి రానా,
విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి,
నిధి అగర్వాల్ సహా 25మందిపై నమోదు
మన తెలంగాణ/మియాపూర్/సిటీ బ్యూరో: బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సినీ ప్ర ముఖులపై మియాపూర్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. మియాపూర్‌కు చెందిన ఫణీంద్ర శర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరిపై కేసు నమోదు చేశారు. ఇది వరకే యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినీనటులు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన విషయం బయటికి వచ్చింది. వాటికి సంబంధించిన ఆధారాల తో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దగ్గుపాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ, ప్రణీతా, నిధి అగర్వాల్, అనన్యా నాగళ్ల, సిరి హన్మం తు, శ్రీముఖి, వర్షీణి సౌందరాజన్, వాసంతి కృష్ణన్, శోభ శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహ పటాన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, శ్యామలా, తస్యతేజ్,
రీతు చౌదరి, బండారు శేషాయాని సుప్రితపై మియాపూర్ పోలిసులు కేసు నమోదు చేశారు.
ఈ ప్రచారం ద్వారా యువకులు, సామాన్యులు ఎక్కువగా ఆకర్షితులై లక్షలాది రూపాయలు పోగొట్టుకుని రోడ్డుపాలయ్యారు, కొంతమంది ఆర్థికంగా చాలా నష్టపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు. తమ అభిమాన నటులు తాము కూడా బెట్టింగ్ యాప్‌ల ద్వారా డబ్బులు సంపాదించామని ప్రకటనల్లో చెప్పడంతో నమ్మి లక్షలాది రూపాయలు పెట్టారు. దీంతో అమాయకుల డబ్బులు పోవడంతో ఇబ్బందులపాలయ్యారు. వీరి చేసిన ప్రకటనలపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు వీరు చేసిన ప్రకటనల గురించి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆయా సంస్థలు, నటులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. బెట్టింగ్ యాప్‌లపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు బిఎన్‌ఎస్, ఐటి యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
తప్పు తెలుసుకున్నా: సినీనటుడు ప్రకాష్ రాజ్
బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌ను తొమ్మిదేళ్ల క్రితం చేశానని, తప్పు తెలుసుకుని తర్వాత యాడ్‌ను ఆపివేయాలని సంస్థను కోరానని తెలిపారు. కానీ వాళ్లు యాడ్‌ను వేరే సంస్థలకు విక్రయించారని తెలిపారు. 2016లో యాడ్ సంస్థ తన వద్దకు వచ్చారని, చేసిన తర్వాత తప్పు అని కొద్ది నెలల్లోనే తెలుకున్నానని తెలిపారు. 2017 తన ఒప్పందాన్ని పొడిగిస్తానని అడిగితే, అంగీకరించలేదని చెప్పానని తెలిపారు. దాని తర్వాత ఏ గేమింగ్ యాప్‌లకు యాడ్స్ చేయలేదని తెలిపారు. తన యాడ్‌ను వాడుకున్న వారికి లీగల్ నోటీసులు పంపానని తెలిపారు. వారు ప్రకటనను ఆపివేశారని, ఇప్పుడు అది బయటికి వచ్చిందని తెలిపారు. తనకు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదని, గేమింగ్ యాప్స్‌కు యువత దూరం ఉండాలని, వీటి మాయలో పడి జీవితం కోల్పోవద్దని కోరారు.
స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు ప్రచారం చేశాడు: విజయ్ దేవరకొండ టీం
చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే విజయ్ దేవర కొండ ప్రచారం నిర్వహించాడని ఆయన టీం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కంపెనీకి చట్టప్రకారం అన్ని అనుమతులు ఉన్నాయని తెలిపారు. ఏ23 అనే సంస్థకు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారని తెలిపారు. కంపెనీతో విజయ్ ఒప్పందం గత ఏడాదే ముగిసిందని, ఇప్పుడు ఆ సంస్థతో విజయ్‌కు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థకు ఆయన ప్రచార కర్తగా లేడని తెలిపారు.
చట్టబద్దంగా అనుమతి ఉంది: దగ్గుబాటి రానా టీం
రానా దగ్గుబాటి స్కిల్ బేస్డ్ గేమ్ యాప్‌కు మాత్రమే ప్రమోట్ చేశారని ఆయన టీం ఓ ప్రకటనలో పేర్కొంది. చట్టబద్ధంగా అనుమతించిన వాటికే రానా ఆమోదం తెలిపారని చెప్పారు. ఒప్పందం చేసుకునే ముందు లీగల్ టీం సంస్థకు సంబంధించిన అన్ని విషయాలను పరిశీలించిందని తెలిపారు. అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత ప్రచారానికి ఒప్పుకున్నారని, ప్రకటన గడువు 2017లోనే ముగిసిందని తెలిపారు.