ప్రస్తుతం రద్దయిన ఎన్నికల బాండ్ల పథకానికి సబంధించిన ఫిర్యాదుపై ఇక్కడి కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతరులపై శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సతీరామన్‌తోపాటు, ఇడి అధికారులు, బిజెపికి చెందిన రాష్ట్ర, జాతీయ స్థాయి కార్యవర్గ సభ్యులపై ఎఫ్‌ఐఆర్‌ని నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జనాధికార సంఘర్ష పరిషత్(జెఎస్‌పి) సహ అధ్యక్షుడు ఆదర్శ్ ఆర్ అయ్యర్ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఎన్నికల బాండ్ల ముసుగులో నిందితులు బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారని, తద్వారా రూ. 8,000 కోట్ల మేరకు లబ్ధి పొందారని అయ్యర్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఇడి అధికారుల రహస్య మద్దతుతో బిజెపికి చెందిన రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులకు ప్రయోజనం చేకూర్చే విధంగా వేల కోట్ల రూపాయల బలవంతపు వసూళ్లకు నిర్మలా సీతారామన్ పాల్పడ్డారని కూడా అయ్యర్ ఆరోపించారు.
వివిధ స్థాయిలలో బిజెపి అధికారులతో కుమ్మక్కై ఎన్నికల బాండ్ల ముసుగులో ఈ బలవంతపు వసూళ్ల కుంభకోణాన్ని సాగించారని ఆయన ఆరోపించారు. కాగా..ఏ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు ఈ పథకం రాజ్యాంగంలోని సమాచార హక్కు, వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించింది. ఇదిలా ఉండగా&మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ(ముడా) స్థలాల కేటాయింపు కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు అయినందున తాను రాజీనామా చేయాలంటూ డిమాండు చేస్తున్న బిజెపి నాయకులు ఇప్పుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన కారణంగా ఏం చెబుతారని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రశ్నించారు. బిజెపి నాయకుల వాదన ప్రకారం చూస్తే నిర్మలా సీతారామన్ కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దీనికి కేంద్ర మంత్రి, జెడిఎస్ నాయకుడు హెచ్‌డి కుమారస్వామి స్పందిస్తూ నిర్మలా సీతారామన్ ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు.
ఎన్నికల బాండ్ల నిధులు నిర్మలా సీతారామన్ వ్యక్తిగత ఖాతాలోకి వెళ్లాయా రాజీనామా చేయడానికి అని ఆయన నిలదీశారు. మీలాగ ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడి వ్యక్తిగతంగా ప్రయోజనం పొందారా అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న బిజెపి శాసనసభ్యుడు ఆర్ అశోక కూడా సిద్దరామయ్య వ్యాఖ్యలపై స్పందిస్తూ నిర్మలా సీతారామన్‌కు వ్యాఖ్యనించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని అన్నారు. ఎన్నికల బాండ్ల పథకానికి, ముడా కుంభకోణానికి పోలికే లేదని ఆయన చెప్పారు. ఎన్నికల బాండ్ల అంశం ఎప్పుడో ముగిసిపోయిందని, దానిపై సుప్రీంకోర్టు నిర్ణయం కూడా తీసుకుందని అశోకా తెలిపారు. ఎఫ్‌ఐఆర్ విషయంలో తమ నాయకులు చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూమిని ఉపయోగించుకున్న మీకు(సిద్దరామయ్యకు, నిర్మలా సీతారామన్‌కు(ఎన్నికల బాండ్ల కేసు) పోలికా అని ఆయన ఎద్దేవా చేశారు.