గువహతి : అసోంలో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర, దీని నిర్వాహకులు కెబి జైజూలపై స్థానిక పోలీసులు శుక్రవారం కేసు దాఖలు చేశారు.ప్రస్తుతం అసోంలో సాగుతోన్న రాహుల్ యాత్ర రూటు మార్చారని, యాత్రపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఫిర్యాదు అందడంతో ఈ కేసు దాఖలు అయింది. ముందు యాత్రకు నిర్ధేశిత మార్గం ఖరారు అయిందని, అయితే గురువారం మధ్యాహ్నం జోర్హాట్ టౌన్‌లో సాగుతూ ఉండగా యాత్ర దిశ మార్చారని పోలీసులు నిర్థారించుకుని యాత్ర నిర్వాహకులపై కేసు పెట్టారు. అకస్మాత్తుగా మార్గం మారడంతో వేరే దారులలో పలు ఆటంకాలు ఏర్పడ్డాయని , చివరికి శాంతిభద్రతల సమస్య తలెత్తే పరిస్థితి ఏర్పడిందని , దీనిని పరిగణనలోకి తీసుకుని నిర్వాహకులపై కేసు పెట్టినట్లు స్థానిక అధికారులు వివరించారు.
ట్రాఫిక్ బారికేడ్ల ధ్వంసం, ఓ చోట ఆన్ డ్యూటీ పోలీసు అధికారిపై దౌర్జన్యం వంటి ఘటనలు జరిగాయని, ఈ మేరకు తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. అయితే కేసులపై రాహుల్ గాంధీ స్పందించలేదు. ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదార్లను ఆపే లేదా అరెస్టు చేసే ధైర్యం అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు ఉందా? అని శుక్రవారం రమేష్ సవాలు విసిరారు. అసోంలో భారత్ జోడో యాత్ర మార్గం మార్చలేదని, నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. ఏదోవిధంగా యాత్రను భగ్నం చేసేందుకు కేసులు పెడుతున్నారని చెప్పారు. తమ పార్టీ వారిని అరెస్టు చేయగలరా ? అని ప్రశ్నించారు. యాత్ర కోసం పార్టీ శ్రేణులు , స్థానిక కార్యకర్తలు వచ్చే ఏడురోజులు అసోంలోనే ఉంటారని , సిఎంకు ధైర్యముంటే ఈ యాత్రను అడ్డుకోవచ్చునని తెలిపారు. కేసులు పెట్టుకోండి, అరెస్టులకు దిగండి, ఏమి చేసినా తమ యాత్ర ఆగబోదన్నారు.
అసోంకు చెందిన కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గగోయ్ స్పందిస్తూ , ప్రజలు తమ వైపు ఉన్నారని, వేధింపులతో తమను ఎవరూ ఏమి చేయలేరని, అణచివేతలతో మరింత బలం పుంజుకుంటామని తెలిపారు. బిజెపి అధికారంలో ఉన్న అసోంలో ఇప్పుడు రాహుల్ యాత్ర సాగుతోంది. రూటు మార్చి యాత్ర సాగిస్తున్నారని పేర్కొంటూ స్థానిక పోలీసులు యాత్రను అడ్డుకునే యత్నాలకు దిగుతున్నారని కాంగ్రెస్ వర్గాలు ఎదురుదాడికి దిగాయి. అసోంలో రాహుల్ యాత్ర ఈ నెల 25వరకూ సాగుతుంది. 17 జిల్లాల్లో 833 కిలోమీటర్లు ప్రయాణం ఉంటుంది. కాగా శుక్రవారం ఆరవ రోజున రాహుల్ గాంధీ ఇతరులతో కలిసి రాష్ట్రంలోని భారీ నది దీవి మజూలీలో పడవలో యాత్ర సాగించారు. ఈ పడవకు చుట్టూ కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు, జెండాలు అమర్చారు. రాహుల్ ఇతర నేతలతో కలిసి ఇందులో సాగారు.