అజ్మీర్ దర్గా ఖాదీమ్‌పై కేసు.. గాలింపు
జైపూర్: మొహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి బిజెపి అధికారి ప్రతినిధిగా సస్పెన్షన్‌కు గురైన నుపూర్ శర్మను చంపి ఆమె తలను తెచ్చిన వారికి తన ఇంటిని బహుమతిగా రాసిస్తానంటూ కెమెరా సాక్షిగా ప్రకటించిన అజ్మీర్ దర్గాకు చెందిన ఒక మతగురువు(ఖాదీమ్) కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షమైన ఒక వీడియో క్లిప్పింగ్ ఆధారంగా అజ్మీర్ దర్గాకు చెందిన సల్మాన్ చిష్తీ అనే ఖాదీమ్‌పై రాజస్థాన్ పోలీసులు సోమవారం రాత్రి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. నుపూర్ శర్మ తలను తెచ్చిన వారికి తన ఇంటిని బహుమతిగా ఇస్తానంటూ ఆ వీడియోలో చిష్తీ ప్రకటించడం కనిపించింది. అంతేగాక మొహమ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ఆమెను తాను కాల్చిచంపి ఉండేవాడినంటూ కూడా అతను మాట్లాడాడు. ముస్తిం దేశాలన్నటికీ నువ్వు సమాధానం ఇవ్వాలంటూ నువూర్ శర్మను ఉద్దేశించి చిష్తీ డిమాండు చేశాడు. తాను రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి ఈ మాటలు చెబుతున్నానని, ఇది హుజూర్ ఖ్వాజా బాబా కా దర్బార్ నుంచి ఇస్తున్న సందేశమని అతను ఆ వీడియోలో పేర్కొన్నాడు. చిష్తీ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందని, నిందితుడికి నేర చరిత్ర ఉందని దర్గా స్టేషన్ హౌస్ ఆఫీసర్ దల్వీర్ సింగ్ ఫౌజ్దార్ తెలిపారు.