Monday, April 28, 2025

జానపద గాయని నేహా సింగ్ రాథోడ్‌పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

ఓ ప్రత్యేక మత వర్గాన్ని లక్షం చేసుకుని సామాజిక మాధ్యమంలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినందుకు జానపద గాయని నేహా సింగ్ రాథోడ్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు. పహల్గాం విషాధం తర్వాత జాతి ఐక్యతను దెబ్బతీసే విధంగా ఆమె పోస్టులు ఉన్నాయని భావించి ఈ కేసు నమోదుచేశారు. గత వారం పహల్గాంలో 26 మంది పర్యాటకులను వారి మతం ఏమిటని మరీ అడిగి చంపేశారు. ‘ఈ నేపథ్యంలో గాయని, కవయిత్రి నేహా సింగ్ రాథోడ్ తన ‘ఎక్స్’(ఇదివరకటి ట్విట్టర్) వేదికగా ఆక్షేపణీయ పోస్ట్‌లు పెట్టారు. ఓ మతవర్గానికి వ్యతిరేకంగా రెచ్టగొట్టే పోస్ట్‌లను పదేపదే పెట్టారు, ఇది దేశ సమగ్రతను దెబ్బతీయగలదు’ అని ఫిర్యాదుదారుడు అభయ్ ప్రతాప్ సింగ్ అన్నారు. ‘బీహార్ మే కాబా?’, ‘యుపి మే కాబా?’, ‘ఎంపీ మే కాబా?’ వంటి పాటలతో ప్రసిద్ధమైన నేహా సింగ్ రాథోడ్ అసలైన సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ప్రభుత్వం తనపై ఎఫ్‌ఐఆర్‌లు పెట్టిందని అన్నారు.
‘పహల్గాం దాడి తర్వాత ప్రభుత్వం ఇంతవరకు ఏమి చేసింది? నా మీద ఎఫ్‌ఐఆర్ పెట్టడం తప్ప…మీకు దమ్ముంటే వెళ్లి ఆ ఉగ్రవాద ముష్కరుల తలలు పట్టుకురండి.

నన్ను ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనమంటూ ఉండదు…మనది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం జరుగుతుంది. ప్రశ్నించొద్దు అని భావిస్తే…వెళ్లి ప్రతిపక్షంలో కూర్చొండి’ అని ఆమె వీడియోపెట్టారు. ఆమె ఇంకా భావోద్వేగంతో ‘మొత్తం బిజెపి నేతల పిల్లల కన్నా ఎక్కువ మంది నా కుటుంబానికి చెందిన వారు సైన్యంలో ఉన్నారు. కానీ నేడు బిజెపి ఐటి విభాగం నన్ను దేశద్రోహి అంటోంది. ఎందుకంటే నేను నిర్భయంగా ప్రశ్నిస్తాను కనుక. ప్రధానమంత్రిని ప్రశ్నించడం కూడా దేశద్రోహమేనా?’ అని ఆమె తన ‘ఎక్స్’ పోస్ట్‌లో నిలదీశారు. లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో నేహా సింగ్ రాథోడ్‌పై ఫిర్యాదు నమోదయింది. బిఎన్‌ఎస్ సెక్షన్ల కింద అనేక అభియోగాలు నమోదుచేశారు. కాగా ఆమె వర్గవిభేదాలు సృష్టిస్తోంది, భారత సమగ్రత, ఐక్యత, సారభౌమత్వాన్ని ముప్పులో పడేస్తోంది అని పోలీసులు అంటున్నారు. ఇదే కాకుండా ఆమె మీ ఐటి చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News