అహ్మదాబాద్: కెనడా, భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత పరిస్థితులుల నెలకొన్న వేళ..ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ వరస హెచ్చరికలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరి కొద్ది రోజుల్లో భారత్ వేదికగా ప్రారంభం కానున్న క్రికెట్ వరల్డ్ కప్ పైనా ఈ ఉగ్రవాది కన్ను పడినట్లు తెలుస్తోంది.క్రికెట్ వరల్డ్ కప్‌ను ‘ వరల్డ్ టెర్రర్ కప్’గా మారుస్తానంటూ చేసిన హెచ్చరికలు సంచలనం రేపుతున్నాయి. దీంతో అప్రమత్తమైన గుజరాత్ పోలీసులు ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అక్టోబర్ 5న గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వరల్డ్ కప్ తొలిమ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్‌పాకిస్థాన్ మ్యాచ్ సహా పలు మ్యాచ్‌లు ఇక్కడ జరగనున్నాయి.
ఈ క్రమంలోనే ఇక్కడ ప్రతికూల వాతావరణాన్ని సృష్టించడానికి నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్‌ఎఫ్‌జె) సంస్థ వ్యవస్థాపకుడు, ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ ప్రయత్నిస్తున్నట్లు వెల్లడయింది. ఇటీవల హత్యకు గురయిన నిజ్జర్‌కు ప్రతీకారంగా కెనడానుంచి కొందరు ఖలిస్థానీ వాదులు భారత్‌కు చేరుకున్నారని అతను చెప్పడం గమనార్హం.ఇందుకు సంబంధించి గురుపత్వంత్ సింగ్ మాట్లాడినట్లుగాఉన్న ప్రీ రికార్డింగ్ ఆడియో కాల్ గురువారం దేశ వ్యాప్తంగా ఎంతోమందికి వచ్చింది. నిజ్జర్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఖలిస్థానీ జెండాతో అహ్మదాబాద్‌పై దాడి చేస్తామని ఆ మెస్సేజిల్లో ఉంది. ఈ విషయాన్ని పలువురు గుజరాత్ వ్యక్తులు పోలీసులకు తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గురుపత్వంత్ సింగ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అహ్మదాబాద్ సైబర్ క్రైండిసిపి అజిత్ రాజియన్ పేర్కొన్నారు.