పూర్తిగా దగ్ధమైన 90 వాహనాలు
న్యూఢిల్లీ: ఆగ్నేయ ఢిల్లీలోని జామియా నగర్ మెట్రో స్టేషన్ వెలుపల ఉన్న పార్కింగ్ స్టాండులో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగి దాదాపు 90 వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం వాటిల్లలేదని పోలీసులు తెలిపారు. మెట్రో స్టేషన్ ఆనుకునే పార్కింగ్ స్టాండు ఉంది. తెల్లవారుజామున 5 గంటలకు జామియా నగర్‌లోని టికోనా పార్కు నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, వెంటనే 11 అగ్నిమాపక శకటాలను ఆ ప్రాంతానికి పంపించామని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అటుల్ గర్గ్ తెలిపారు. మంటలకు అనేక వాహనాలు ధ్వంసమయ్యాయని ఆయన చెప్పారు. మంటలను కొద్ది సేపట్లోనే అదుపులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని, షార్ట్ సర్కూట్ కారణం కావచ్చని అనుమానిస్తున్నామని ఆయన చెప్పారు. ఢిల్లీ మెట్రో ప్రాంగణంలోని ప్రాంతాన్ని ఈటో మోటార్స్ లీజుకు తీసుకుందని, ఈ ప్రాంతాన్ని పార్కింగ్ స్టాండుగా, ఈరిక్షాలకు చార్జింగ్ స్టేషన్‌గా ఉపయోగిస్తోందని పోలీసులు తెలిపారు. మంటల్లో 83 ఈరిక్షాలు, 11 కార్లు, 4 టూవీలర్లు దగ్ధమయ్యాయని, సమీపంలోని రెండు మూడు ఇళ్ల ఎసిలు దెబ్బతిన్నాయని వారు చెప్పారు.