10 మంది సజీవ దహనం
మహారాష్ట్ర అహ్మద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం
ప్రధాని, రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి
పుణె: మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది మృత్యువాత పడ్డారు. శనివారం ఉదయం11.30 గంటల ప్రాంతంలో అహ్మద్ నగర్ సివిల్ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్( ఐసియు)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై స్పష్టత లేనప్పటికీ షార్ట్ సర్కూటే ప్రమాదానికి కారణం అయి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడగా వేరే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ చికిత్స కోసం ఆ ఐసియు విభాగంలో 17 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఆస్పత్రిలో ఐసియు యూనిట్‌ను కొవిడ్ రోగుల కోసం ఇటీవలే ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఘోర అగ్నిప్రమాదం సంభవించడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర మేఖ్యమంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు.
కాగా మృత దేహాలను పోస్టుమార్టం కోసం పంపించామని, మరణాలకు కారణం ఊపిరాడకపోవడమా లేక మెడికల్ ఆక్సిజన్ సరఫరాలో అంతరాయమా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోసలే చెప్పారు. కాగా ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌లో ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా బాధించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని మోడీతన ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన సహాయక చర్యల్లో తోడ్పాటు అందించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఈ ఏడాది ఏప్రిల్‌లో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఓ ప్రైవేటు ఆస్పత్రి ఐసియు విభాగంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 19 మంది కొవిడ్ పేషెంట్లు మృతి చెందిన విషయం తెలిసిందే. మార్చిలో కొవిడ్ ప్రత్యేక ఆస్పత్రి ఉన్న ముంబయి బందుప్ లోని డ్రీమ్స్ మాల్‌లో సంభవించిన మరో ప్రమాదంలో తొమ్మిది మంది కొవిడ్ రోగులు మృతి చెందారు.