Wednesday, December 25, 2024

అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు

- Advertisement -
- Advertisement -

గడ్డి క్షేత్రాలు మంటలకు ఆహుతి

మనతెలంగాణ/ హైదరాబాద్ : నల్లమల అటవీ ప్రాంతంలో ఏటా వేసవిలో కార్చిచ్చు ప్రభావం వన్యప్రాణులపై పడుతోంది. గడ్డి క్షేత్రాలు మంటలకు ఆహుతి అవుతున్నాయి. ఇటీవల శ్రీశైలం హైదరాబాద్ రహదారికి సమీపంలో అటవీ ప్రాంతంలో దాదాపు ఐదు హెక్టార్ల మేర అగ్నిప్రమాదం సంభవించింది. నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాల పరిధిలో మొత్తం 7. 37 లక్షల ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉంది. నల్లమలలో కొన్నేళ్లుగా ఏటా ఫిబ్రవరి మొదటివారం నుంచే అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. గతేడాది అభయారణ్యంలోని బండల వద్ద వ్యాపించిన కార్చిచ్చుకు 50 ఎకరాల్లో అడవి దగ్ధమైంది. గతంలోనూ ఆక్టోపస్ వ్యూపాయింట్ సమీపంలో కార్చిచ్చు ఏర్పడి నీలారం వరకు వ్యాపించి 70 ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమైన దోమలపెంట, తుర్కపల్లి, గుండం, మల్లాపూర్, మద్దిమడుగు ప్రాంతాల్లోనూ మంటలు వ్యాపించిన ఘటనలున్నాయి.

అడవిలో అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్ వాచర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాహనాలు, మంటలను ఆర్పే పరికరాలను అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రక్రియను వేగవంతం చేయలేదని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అభయారణ్యంలో వాచర్లను పెంచాల్సి అవసరం ఉందని వారు గుర్తుచేస్తున్నారు. గతంలో కార్చిచ్చు జరిగిన ప్రాంతాలను శాటిలైట్ గుర్తించి.. తగు చర్యలు చేపట్టాల్సి ఉంది. నల్లమలలో 1.75 లక్షల హెక్టార్లలో టైగర్ రిజర్వు ఫారెస్టులో 28 పులులు, 100కు పైగా చిరుతలు, ఐదువేల బిట్టు ఉడతలు, 8వేల సాంబర్లు, 2200 జింకలు, వందల సంఖ్యలో ఎలుగుబంట్లు, మచ్చల జింకలతోపాటు వేల సంఖ్యలో కొండ ముచ్చులు, అడవి. పందులు, కృష్ణ జింకలు, గుంట నక్కలు, మనుబోతులు, కోతులు, నెమళ్లు, జింకలు, తోడేళ్లు ఉన్నాయి. కార్చిచు వేగంగా వ్యాపిస్తే ఈ వన్యప్రాణులకు ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉంది. విలువైన కలప, ఔషధ మూలికల మొక్కలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఈ ప్రకృతి సంపదకు నష్టం వాటిల్లుతుంది ఇప్పటి నుంచే అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తేనే వేసవిలో కార్చిచ్చుకు అడ్డుకట్ట వేయవచ్చు.

* అవగాహనతో ప్రమాదాల నివారణ..

గడ్డి క్షేత్రాలు ఏర్పాటు, ఫైర్ వాచర్ల నియామకం, అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంది. కార్చిచ్చు వ్యాపించకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకు అలాంటి ఊసే లేదు. ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. స్థానికులు ఇప్ప పువ్వు కోసం అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి ఆ చెట్టు కింద గడ్డికి నిప్పు పెడుతున్నారు. కాపరులు తమ పశువులను, గొర్రెల మందను రక్షించుకోడానికి నిప్పు పెడుతుంటారు. శ్రీశైలం, మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయాలకు వెళ్తే భక్తులు మధ్యలో ఆగి వంటలు చేసుకుంటారు. స్థానికులు కొందరు భూముల్లో ఉన్న నన్నరి గడ్డలు తీయడానికి కూడా మంటలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి వీటిపై చెంచులకు ప్రతి సంవత్సరం జనవరి నుంచే అవగాహన కల్పించాల్సి ఉంది. పర్యాటకులు వంటలు చేయకుండా పర్యవేక్షణ చేపట్టాలని స్థానికులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News