Monday, December 23, 2024

ముంబయిలో ఘోర అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -
Fire Accident in Mumbai
20 అంతస్థుల నివాస భవనం 19వ ఫ్లోర్‌లో మంటలు
ఏడుగురు మృతి, 23 మందికి గాయాలు
మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని
రాష్ట్రప్రభుత్వం రూ.5 లక్షల సాయం

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కనీసం ఏడుగురు మృతి చెందగా 23 మంది గాయపడ్డారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సెంట్రల్ ముంబయిలోని తాడ్‌దేవ్ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భాటియా ఆస్పత్రికి ఎదురుగా ఉన్న 20 అంతస్థుల కమలా బిల్డింగ్‌లోని 19వ అంతస్థులో ఉదయం ఏడు గంటల సమయంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా అగ్నిమాపక బృందాలు సహా ఇతర సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే పలువురు తీవ్రంగా గాయపడ్డంతో వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఇద్దరు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. మరో వైపు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మొత్తం 13 వాటర్ జెట్టీలు, అయిదు ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. భారీ ఎత్తున పొగలు కమ్ముకోవడంతో భవనంలో వారినందరినీ పోలీసులు ఖాళీ చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన వారిలో ఏడుగురిని బిఎంసిఆధ్వర్యంలోని నాయర్ ఆస్పత్రికి తరలించగా అయిదుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరు కస్తూర్బా ఆస్పత్రిలో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 17 మంది క్షతగాత్రులను భాటియా ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. వీరిలో అయిదుగురిని చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ప్రాథమికంగా షార్ట్ సర్కూట్ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ప్రధాని సంతాపం

ముంబయిలో జరిగిన అగ్నిప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ మృతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నారు. ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి (పిఎంఎన్‌ఆర్‌ఎఫ్)నుంచి ఈ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News