Saturday, November 9, 2024

రైస్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

కేసముద్రం : కేసముద్రం మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న కేసముద్రం విలేజ్ లోని మహదేవ్ రైస్ ఇండస్ట్రీలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రైస్ మిల్లులో ఉదయం ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో రైస్ మిల్లులో పనిచేస్తున్న కూలీలు ఇండస్ట్రీ యజమానికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న యజమాని ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించే లోపే పూర్తి నష్టం వాటిల్లింది.. యాసంగిలో కేసముద్రంలో పలు రైస్ మిల్లులకు కస్టం మిల్లింగ్ రైస్ నిమిత్తం ధాన్యాన్ని కేటాయించారు. ధాన్యం సిఎంఆర్ నిమిత్తం మిల్లులకు తరలించడంతో మిల్లులో స్టాకు పెద్ద ఎత్తున పేరుకుపోయింది.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సుమారు కోటి రూపాయలకు పైగా ధాన్యం అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తుంది. ఫైర్ స్టేషన్ సిబ్బంది ఎంత ప్రయత్నించిన మంటలు చాలాసేపటి వరకు అదుపులోకి రాకపోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, కేసముద్రం పిఎసిఎస్ చైర్మన్ ధీకొండ వెంకన్న, చిలువేరు సమ్మయ్య గౌడ్, జాటోత్ హరీష్ నాయక్ సందర్శించారు. కాగా కేసముద్రం స్టేషన్, విలేజ్ లో కలిపి పదుల సంఖ్యలో రైస్ ఇండస్ట్రీలు ఉండగా మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలని పలుమార్లు ప్రజాప్రతినిధులకు ప్రజా సంఘాలు, ఇండస్ట్రీ యజమానులు విన్నవించారు.

ఈ మేరకు ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ త్వరలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఆ దిశలో ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. మహబూబాబాద్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేసముద్రం స్టేషన్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక యంత్రం సంఘటన స్థలానికి చేరుకునే లోపే జరగాల్సిన ఆస్తి నష్టం జరిగిపోతుంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కేసముద్రం మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News