Sunday, December 22, 2024

సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేట నల్లగుట్టలోని ఓ షాపింగ్‌మాల్‌లో గురువారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో మంటల్లో చిక్కుకున్న పది మందిని రెస్కూ సిబ్బంది కాపాడగా ఇద్దరి ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్ మాల్‌లోని మంటలను అగ్నిమాపక సిబ్బంది పది గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆచూకీ లభించని వారి కోసం క్లూస్ టీంను రంగంలోకి దింపారు. ఆరు అంతస్థుల డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్ మాల్ సెల్లార్‌లో కింద కార్ల విడి భాగాల గోదాం, గ్రౌండ్ ఫ్లోర్‌లో వస్త్ర దుకాణం, మొదటి అంతస్థులో క్రీడా సామగ్రి దుకాణాలను నిర్వహిస్తున్నారు. మూడు అంతస్థుల్లో వివిధ రకాల వస్తువులను స్టోర్ చేశారు. ఉదయం 11 గంటలకు సెల్లార్‌లోని కార్ల విడిభాగాల గోదాంలో షార్ట్ సర్కూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బిల్డింగ్ మొత్తం దట్టమైన పొగ వ్యాపించడంతో కాపాడాలంటూ అందులో ఉన్న వారు అరుపులు, కేకలు వేశారు.

మరోవైపు కొందరు మంటల నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. మంటల వల్ల ఆ ప్రాంతం మొత్తం పొగ దావానంలా వ్యాపించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. ఆరు ఫ్లోర్ల బిల్డింగ్‌లో రెగ్జిన్ మెటీరియల్, సింథటిక్, ఫైబర్ మెటీరియల్ ఉండడంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. మంటలు అన్ని ఫ్లోర్లకు వ్యాపించడంతో సిబ్బందికి ఆర్పివేయడం కష్టంగా మారింది. అంతేకాకుండా మంటలు చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్‌లకు వ్యాపించడంతో వారిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. భవనం పరిసరాల్లోకి ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎంతకీ మంటలు అదులోకి రాకపోవడంతో రసాయనాలతో మంటలను అదపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదంపై రాంగోపాల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సహాయక చర్యలను జిహెచ్‌ఎంసి, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంలో పలు రకాల వస్తువులు కాలిపోవడం వల్ల అక్కడ కార్బన్‌మోనాక్సైడ్ విషవాయువు వెలువడి ఆ చుట్టూ పక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఎంతో శ్రమించిన ఫైర్ సిబ్బంది
అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 40 ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు యత్నించగా అన్ని ఫ్లోర్లకు మంటలు వ్యాపిస్తుండడంతో పైకి వెళ్లేందుకు సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా మంటలు పక్కన ఉన్న బిల్డింగ్‌లకు వ్యాపించడంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. మంటలు చుట్టుపక్కన ఉన్న నాలుగు భవనాలకు వ్యాపించాయి. పై ఫ్లోర్‌లో మంటలను అదుపులోకి తీసుకుని వచ్చినా కింద ఫ్లోర్‌లో అదుపు చేయడానికి చాలా సమయం పట్టింది. ఉదయం ప్రారంభమైన రెస్కూ ఆపరేషన్ రాత్రి వరకు కొనసాగింది. పొగ వల్ల ఇద్దరు అగ్నిమాక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
అనుమతి లేని పరిశ్రమలపై కఠిన చర్యలు : పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
అగ్నిప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. అగ్ని మాపక సిబ్బంది ఎంతో కష్టపడి మంటలను అదుపు చేశారన్నారు. అనుమతి లేని పరిశ్రమలు, గోదాంలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇళ్ల మధ్య గోదాంలు, పరిశ్రమలు ఉండటం వల్ల ప్రమాదాలు జరినప్పుడు ఆందోళన చెందాల్సి వస్తోందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది : హోంమంత్రి మహమూద్ అలీ
అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్‌లో ఉన్న పది మందిని రెస్కూ సిబ్బంది కాపాడారని ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉందని హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. సంఘటన స్థలాన్ని హోంమంత్రి అలీ, అగ్నిమాపక శాఖ డిజి నాగిరెడ్డితో కలిసి సందర్శించారు. భవన యజమానిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవనంలో ప్లాస్టిక్ వస్తువులు, రసాయనాలు ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గోదాంలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎలాంటి నిర్ణయమైన తీసుకుంటాం : జిహెచ్‌ఎంసి డిఆర్‌ఎఫ్ చీఫ్ విశ్వజిత్ కంపాటి
భవనం చాలా ప్రమాదకర స్థితిలో ఉందని, ఏ క్షణమైనా కూలవచ్చని జిహెచ్‌ఎంసి డిఆర్‌ఎఫ్ చీఫ్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. బిల్డింగ్ కూలిపోయిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. చుట్టుపక్కల ఉన్న వారికి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఎలాంటి నిర్ణయమైననా తీసుకుంటామని తెలిపారు. మంటల ఉధృతి ఎక్కువగా ఉండడంతో భవనం వద్దకు ఫైరింజన్లు వెళ్లలేని పరిస్థితి ఉందని తెలిపారు. ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News