మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో) పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు రూ. 32.37 కోట్ల విలువైన చేనేత వస్త్రాలు కాలిపోయాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం సమీపంలోని టెస్కోకు చెందిన అద్దె గోడౌన్‌లో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంతో దాదాపు రూ. 32.37 కోట్ల విలువైన వస్త్రాలు బుగ్గి పాలయ్యాయని టెస్కో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారని టెస్కో ఎండి శైలజా రామయ్యర్ వెల్లడించారు. చేనేత కార్పెట్లు, బెడ్‌షీట్లు, టవల్స్,టిసి షర్టింగ్, వస్త్రాలు కాలిపోయాయి. గోదాం వాచ్‌మన్ పర్యవేక్షణలో ఉందని, మంటలను అదుపు చేసే అగ్నిమాపక పరికరాలు ఏర్పాట్లు ఉన్నాయని ఆమె తెలిపారు.
ఘటన స్థలాన్ని టెస్కో అధికారుల బృందం సందర్శించి విచారణ చేస్తుందని తెలిపారు. టెస్కో రాష్ట్రంలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాల నుంచి చేనేత వస్త్ర ఉత్పత్తులను కొనుగోలు చేసి రాష్ట్రంలోని వివిధ జిల్లాల లో గల గోదాములలో నిల్వ చేశామని, వరంగల్, కరీంనగర్ డివిజన్‌లోని చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి ధర్మారం గోడౌన్‌లో నిల్వ చేయడం జరిగిందన్నారు. ఈ వస్త్రాలకు సంబంధించి నగదు చెల్లింపులు ఆ సంఘాలకు ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకా ఏమైనా చెల్లింపులు ఉంటే త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని టెస్కో గోదాములకు, షోరూం లకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా చేయిచామని తెలిపారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నష్ట పరిహారాన్ని పొందడం కోసం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.