ములుగు జిల్లా, గోవిందరావుపేట మండలంలో అతిముఖ్యమైన పర్యాటక కేంద్రంగా ఎప్పుడూ పర్యాటకులతో సందడిగా ఉండే లక్నవరం చెరువు ఒకటి ముఖ్యమైనది. పచ్చని దట్టమైన అడవులు, గుట్టల మధ్య పర్యాటకులను ఆకర్షించే విధంగా నీళ్లతో ఉండే లక్నవరం చెరువు ఉన్న ప్రాంతంలో నిప్పు అంటుకొని మసిగా మారిపోయి అందవిహీనంగా కనబడుతూ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడుతోంది. చెరువు చుట్టూ ఉన్న గుట్టలకు మూడు రోజుల నుండి నిప్పు అంటుకొని 70 శాతం తగలబడ్డాక అధికారులు అప్రమత్తమై నిప్పులను చల్లార్చుతున్నారు. అటవీ ప్రాంతం ఇంతలా తగలబడేదాకా అధికారులు ఏమి చేస్తున్నారనేది పర్యాటకుల మదిలో మెదులుతున్న ప్రశ్న.
లక్నవరం అలుగు నుండి తూముల వరకు సుమారు 70 శాతం దాకా నిప్పు అంటుకొని తగలబడిపోతూ ఉంటే నిన్న మొన్నటి నుండి మంటలు ఆర్పుతున్నామని ఫారెస్టు అధికారులు చెబుతున్నారు. పచ్చని అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతి కావడం మానవాతీతమ తప్పిదమా లేక ప్రకృతి వైపరీత్యమో తెలియదు. కానీ కాలిపోయిన అడవిని చూస్తుంటే హృదయం ద్రవించిపోతోందని పలువురు పర్యాటకులు వాపోతున్నారు. అడివి తగలబడి పోవడానికి గల కారణాలు తెలుసుకొని తగిన పటిష్ట చర్యలు చేపట్టి మళ్లీ ఇలాంటి దురదృష్టకరన ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను పర్యాటకులు కోరుతున్నారు.