Sunday, January 19, 2025

పుప్పాలగూడలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

షార్ట్‌సర్కూట్‌తో ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగిన సంఘటన మణికొండ మున్సిపాలిటి పరిధిలోని పుప్పాలగూడలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న వారు మంటలను గమనించి కట్టుబట్టలతో బయటికి రావడంతో ప్రాణాపాయం తప్పింది. మంటలకు ఇంట్లోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు అలుముకున్నాయి. దీంతో అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వారు అందరూ బయటికి పరుగులు తీశారు. గండిపేట మండలం, పుప్పాలగూడలోని ఫార్చూన్ గ్రీన్ హోమ్స్ అపార్ట్‌మెంట్‌లోని బ్లాక్ బి, ఫ్లాట్ నంబర్ 310లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కుక్కుల వెంకట రమణ కుటుంబంతోపాటు ఉంటున్నాడు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో వెంకటరమణ తల్లి ఇంట్లో మంటలను గమనించింది వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పింది. అప్పటికే ఇంట్లోని షార్ట్ సర్కూట్ వల్ల ఫ్రిడ్జ్‌లో మొదలైన మంటలు ఇంట్లో మొత్తం పాకడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో బయటికి వచ్చారు.

వీరు బయటికి వచ్చిన తర్వాత మంటలు గ్యాస్ సిలిండర్లకు అంటుకోవడంతో ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న వారు మొత్తం ఒక్కసారిగా భయాందోళనకు గురై బయటికి పరుగులు తీశారు. కానీ ఇంట్లో దాచుకున్న డబ్బులు, బట్టలు, విలువైన సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు రూ.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజిన్లతో అక్కడికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్లు లోపలికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో దాదాపు గంట పాటు వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు ఎలాగోలా లోపలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఫ్లాట్ మొత్తం దగ్ధమైంది, ఫైర్ సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పి వేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనా స్థలిని పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేసిన అపార్ట్‌మెంట్ నిర్వాహకులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో ఉన్నదంతా కోల్పోయి బాధితులు కట్టుబట్టలతో నిలబడిన పరిస్థితి అందరినీ కలిచివేసింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News