న్యూఢిల్లీ : ఢిల్లీ లోని ముఖర్జీ నగర్‌లోని కోచింగ్ సెంటర్‌లో గురువారం అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో సెంటర్‌లో ఉన్న విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కిటికీల నుంచి తాడు సాయంతో కిందకు దిగారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. 12.27కు తమకు సమాచారం అందగానే 11ఫైర్ ఇంజిన్లు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పగలిగాయని ఢిల్లీ ఫైర్‌సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు. 10 నుంచి 12 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. పెద్ద ప్రమాదాలు ఏమీ లేవని, విద్యార్థులంతా ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలిపారు.
ఈ భవనం లోని నాలుగో అంతస్తులో మీటర్ బోర్డు నుంచి మంటలు మొదట లేచాయని దాంతో మంటలు వ్యాపించామయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరంగా ఢిల్లీ సిఎంకేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నించిన విద్యార్థులు కొందరు స్వల్పంగా గాయపడ్డారని, ఆందోళన చెందనవసరం లేదని ఆయన అన్నారు. జిల్లా అధికారులు అక్కడే ఉండి సహాయ చర్యలు చేపట్టారని చెప్పారు. విద్యుత్ మీటర్ల నుంచి అగ్నిప్రమాదం జరిగిందని ఢిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి సుమన్ నల్వా చెప్పారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామన్నారు.