హైదరాబాద్: నూతన సచివాలయ భవన నిర్మాణం మొదటి అంతస్తులో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందని, వుడ్‌వర్క్ జరుగుతున్న క్రమంలో ఈ మంటలు వ్యాపించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సచివాలయం ప్రారంభోత్స వానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతుండడం, ప్రస్తుతం ఈ ప్రమాదం జరగడంతో దీనికి సంబంధించిన కారణాలను అధికారులు తెలుసుకునే పనిలో పడ్డారు.
ఎప్పటికప్పుడు మంత్రి పర్యవేక్షణ
ఈ నూతన సచివాలయ భవన నిర్మాణాన్ని ఈ నెల 17వ తేదీన కెసిఆర్ బర్త్‌డే రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ సచివాలయానికి ప్రభుత్వం అంబేద్కర్ భవన్ అని కూడా నామకరణం చేసింది. ఈ నేపథ్యంలోనే సచివాలయంలో అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించడంతో పాటు ప్రతిరోజు పనులను ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీంతో అధికారులు, ఏజెన్సీ 24 గంటల పాటు కార్మికులతో పనులు చేయిస్తున్నారు.
ఈ భవనం ఎత్తు 265 అడుగులు
తెలంగాణ సెక్రటేరియట్ మొత్తం విస్తీర్ణం 28 ఎకరాలు కాగా, 10, 51,676 చదరపు అడుగుల్లో ఈ నూతన భవనాన్ని నిర్మించారు. ఈ భవనం ఎత్తు 265 అడుగులు కాగా, దేశంలోనే అతి ఎత్తైన భవనాల్లో ఇది ఒకటి. ఈ భవనంపై ఏర్పాటు చేస్తున్న జాతీయ చిహ్నాన్ని కూడా కలిపితే మొత్తం ఎత్తు 278 అడుగులవుతుంది.11 అంతస్తుల ఎత్తులో ఈ భవనం కనిపిస్తుంది. కానీ ఇందులో ఉన్నవి ఆరు అంతస్తులు మాత్రమే. డెక్కన్, కాకతీయ శైలిలో నిర్మించిన ఈ భవనానికి 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తెలంగాణ సంప్రదాయంతో పాటు ఆధునిక హంగులతో దీనిని నిర్మించారు.
జూలై 2020లో పాత భవనాల కూల్చివేత
ఈ భవనాన్ని భారీ విస్తీర్ణంతో నిర్మించినప్పట్టికీ అతి తక్కువ సమయంలోనే ఈ భవనాన్ని పూర్తి చేశారు. కొత్త సచివాలయ నిర్మాణానికి జూన్ 27, 2019న సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారు. జూలై 2020లో పాత భవనాల కూల్చివేత మొదలైంది. శిథిలాల తొలగింపు పనులకు నాలుగు నెలల సమయం పట్టింది. ఏకంగా 14వేల టక్కుల లోడ్ల శిధిలాలను తొలగించారు
నూతన సచివాలయంలో ఎలాంటి నష్టం జరగలేదు: మంత్రి వేముల
- Advertisement -
- Advertisement -
- Advertisement -